Bonalu 2024 :  తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల పండుగ.. వివరాలు ఇవే..

Bonalu 2024 :  తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బోనాల పండుగ.. వివరాలు ఇవే..

ఆషాడ బోనాల పండుగతో జంటనగరాలు నెల రోజులపాటు కోలాహలంగా మారనున్నాయి. బోనాల పండుగను ఆషాఢమాసంలో నిర్వహిస్తారు. బోనాల్లో భాగంగా.. ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల రోజులు సిటి మొత్తం అచ్చంగ పల్లెటూరులాగ మారుతుంది. గల్లీలన్నీ వేపాకు తోరణాలతో కళకళలాడుతాయి.  గల్లీ నుంచి గోల్కొండ దాక, పాత బస్తీల నుంచి లష్కర్ దాక అమ్మవారి గుళ్లు  బోనాల పాటలు భజనలతో మారుమోగుతాయి.! ఎటు చూసినా పసుపు వాసనే... ఈ సంద్భంగా బోనాల నేపథ్యం.. ఈ పండుగ ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

బోనాలు ఎప్పటినుంచి..

తెలుగు పంచాంగం ప్రకారం, జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత వచ్చే ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక దేవాలయంలో బంగారు బోనంతో సంబురాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూలై 5న అమావాస్య శుక్రవారం రాగా.. జూలై 6 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. ఆ మరుసటి రోజు అంటే జూలై 7 ఆదివారం నుంచి భాగ్యనగరంలో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి.

బోనం కుండలను నైవేద్యంగా...

అన్నం, పాలు, పెరుగుతో తయారు చేసిన బోనాన్ని మట్టి కుండలో లేదా రాగి కుండలో వండి గ్రామ దేవతలకు సమర్పిస్తారు. అనంతరం బోనం కుండలకు వేపాకులు, పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. కుండపైన ఓ దీపాన్ని కూడా పెడతారు. వీటిని మహిళలు నెత్తిన పెట్టుకుని.. మేళ తాళాలతో, డప్పు చప్పుళ్ల మధ్య ఆలయాలకు తీసుకెళ్లి.. బోనం కుండలను నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాల్లో దీన్ని ఊర పండుగ అని కూడా అంటారు.

బోనం ఎవరు చేస్తారంటే...

తెలంగాణ సంప్రదాయానికి చిహ్నమైన బోనాన్ని మహిళలే తయారు చేస్తారు. బోనాల జాతర సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మలకు పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లిస్తారు. తమ కుటుంబాన్ని సుఖశాంతులతో కాపాడాలని, తమకు ఏ ఆపద రాకుండా చూడాలని కోరుకుంటారు. ఈ బోనాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు.

తొలి పూజ గోల్కొండలోనే..

ఈ బోనాల పండగను వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే జరుపుకుంటున్నారు. కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాప రుద్రుడు గోల్కోండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. హైదరాబాదులోని జగదాంబిక అమ్మవారి ఆలయం అతి పురాతనమైందిగా ప్రసిద్ధి గాంచింది. అందుకే ఇక్కడే తొలి బోనాన్ని ప్రారంభిస్తారు. రెండో బోనం బల్కంపేట రేణుక ఎల్లమ్మ గుడిలో, మూడో బోనం సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఎత్తుతారు.

భాగ్యనగరంలో ప్రతి సంవత్సరం మొట్టమొదటగా గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి బంగారు బోనంతో సందడి షురూ అవుతుంది. ఇక్కడి నుంచే బోనాల సంబురాలు షురూ అవుతయ్. ఒకప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఊరిలో బోనాల పండుగను ఘనంగా జరుపుకునేవారు. అందుకే ఈ బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి.. ప్రతి ఏటా సర్కారు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది తెలంగాణ సర్కార్ తరపున ఆధ్వర్యంలో బోనాల సంబరాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా జగదాంబి అమ్మవారికి ఆదివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 

ఆంగ్లేయుల కాలంలోనే..

సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఓ చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలో భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న ఆయన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలను రక్షించమని కోరుకున్నాడట. అక్కడ ఆ వ్యాధి తగ్గితే.. ఆ ప్రాంతంలో ఉజ్జయిని అమ్మవారికి ఆలయం కట్టిస్తానని మొక్కుకున్నారు. ఆ క్షణం నుంచి ఆ వ్యాధి తగ్గిపోయిందట. ఆ తర్వాత 1815లో తను నగరానికి తిరిగొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది.

భవిష్యవాణి..

బోనాల జాతరలో చివరి రోజు ఓ మహిళ వచ్చి మట్టికుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీన్నే రంగం అంటారు. చివర్లో అంటే ఆగస్టు 4వ తేదీన అమ్మవారి విగ్రహాన్ని ఏనుగు మీద ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. దీంతో బోనాల సంబురాలు ముగుస్తాయి.