Dasara 2024: దసరా పండుగ ప్రాముఖ్యత ఇదే..

Dasara 2024: దసరా పండుగ ప్రాముఖ్యత ఇదే..

దసరా ఉత్సవాలకు  గుళ్లు... గోపురాలను అలంకరిస్తున్నారు.  హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఏదో ఒక విశిష్టత ఉందని పురాణాలు చెబుతున్నాయి.  ప్రస్తుతం హైటెక్​ యుగంలో యూత్​ హాలిడేస్​ కు... ఎంజాయిమెంట్​కు మాత్రమే పరిమితమవుతున్నారు. లేదంటే వరుస సెలవులు వస్తే ఫ్యామిలీ ట్రిప్​నకు వెళ్తారు. అక్టోబర్​ 3న దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.  అసలు దసరా పండుగ ప్రాధాన్యత ఏంటి..  పురాణాల ప్రకారం ఈ ఫెస్టివల్​ ఎందుకు జరుపుకోవాలి.. పురాణాలు దసరా పండుగ గురించి ఏం చెపుతున్నాయో తెలుసుకుందాం. . .

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి.  ఆశ్వయుజ మాసంలో ఈ పండుగను పది రోజులు జరుపుకుంటారు. ఈ ఏడాది (2024) అక్టోబర్​ 3 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయి.  చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం దశమి  రోజున  రాముడు....  రావణునిపై విజయం సాధించాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా చెబుతుంటారు.  

దసరా పండుగ రోజుల్లో  రావణ వధ, జమ్మిచెట్టుకు   పూజా చేయటం ఆచారంగా ఉంది. జగన్మాత  దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

దుర్గాదేవి త్రిమూర్తుల అంశ

దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ... దుర్గాదేవి 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, హిమవంతుడు  కమండలము,  సింహమును వాహనంగాను ఇచ్చారని దేవీ భాగవతంలో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు పలు వేదికలపై ప్రసంగించారు.

 ఇలా సర్వదేవతల ఆయుధాలను  సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో రాక్షసుడితో పోరాడి..మహిషాసురుడిని చంపి.. దేవతలకు విముక్తి కలిగించింది దుర్గామాత.  ఇలా చెడుపై మంచి విజయానికి గుర్తుగా దసరా పండుగను తొమ్మిదిరోజుల పాటు జరుపుకుంటారు.