Apara ekadashi 2024: జూన్​ 2 అపర ఏకాదశి.. పూజ ఎలా చేయాలి... ప్రాముఖ్యత ఏమిటి...

Apara ekadashi 2024:   జూన్​ 2 అపర ఏకాదశి.. పూజ ఎలా చేయాలి... ప్రాముఖ్యత ఏమిటి...

అపర ఏకాదశి విష్ణుమూర్తికి అంకితం చేసిన రోజు. జూన్ 2వ తేదీ అపర ఏకాదశి వచ్చింది. ఈ వ్రత కథ ఏంటి? ఎలా ఆచరించాలి.. అనే విషయాల గురించి తెలుసుకుందాం.

హిందూ మతంలో ఏకాదశికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది.  ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశి తేదీలు ఉన్నాయి. ఈ విధంగా సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని  అంటారు. జూన్ 2వ తేదీ జరుపుకోనున్నారు. అయితే ఈ అపర ఏకాదశి రెండు రోజులు జరుపుకుంటున్నారు. 

శుభ ముహూర్తం

 

  • ఏకాదశి తిథి ప్రారంభం జూన్ 2 ఉదయం 5.04 గంటల నుంచి
  • ఏకాదశి తిథి ముగింపు జూన్ 3 తెల్లవారుజామున 2.41 గంటల వరకు ఉంటుంది.

అపర ఏకాదశి ప్రాముఖ్యత

హిందూ మత విశ్వాసాల ప్రకారం అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల జాతకుల సకల కోరికలు నెరవేరతాయి. ఈ ఏకాదశి ఉపవాసం పాటించడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్ముతారు. దశమి, ఏకాదశి, ద్వాదశి రోజుల్లో కంచు పాత్రలు వాడకూడదు. అన్నం పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే ఆరోజు ధాన్యాలలో సకల పాపాలు నివశిస్తాయని అన్నం తినడం వల్ల అవి శరీరంలోకి చేరతాయని చెబుతారు.

అపర ఏకాదశి వ్రత విధానం

ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటి పూజ గదిలో దీపం వెలిగించాలి. వ్రతం ఆచరించాలని అనుకున్న వాళ్ళు దశమి తిథి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు. విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్టించి గంగా జలంతో అభిషేకం చేయాలి. తులసి ఆకులతో భోగం సమర్పించాలి. పూజలో పండ్లు, నైవేద్యం సమర్పించాలి. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం పఠించడం వల్ల పుణ్యం లభిస్తుంది. పూజ చేసిన తర్వాత అపర ఏకాదశి వ్రత కథ తప్పనిసరిగా చదువుకోవాలి.

అపర ఏకాదశి కథ

పూర్వం మహిధ్వజ అనే రాజు చాలా పుణ్యాత్ముడు. దయగల రాజు. అతని తమ్ముడు వజ్రధ్వజుడు అతని కంటే చాలా భిన్నమైన స్వభావం కలవాడు. అన్నని తప్పించి ఎలాగైనా రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. అందుకోసం రాజును చంపేసి రావి చెట్టు కింద పూడ్చి పెట్టాడు. దెయ్యంగా మారిన రాజు ఆత్మ అందరినీ భయభ్రాంతులకు గురి చేయసాగింది.

చెట్టుపై ఆత్మగా ఉన్న రాజుతో ఒక మహర్షి మాట్లాడాడు. మోక్షం పొందేందుకు అపర ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచించాడు. అలా ఈ ఉపవాసం ఆచరించడం వల్ల రాజు ఆత్మకు మోక్షం లభించింది. పూర్తి నియమ నిష్టలతో ఉపవాసం ఆచరించాలి. మహా విష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించాలి. శక్తి మేరకు దానాలు చేయాలి. ఉపవాసం ఉండి మనసు దేవుడి మీద లగ్నం చేసి ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏకాదశి ఉపవాస పుణ్యం దక్కుతుంది. ఈ వ్రతం ఆచరిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మనసు పవిత్రం అవుతుంది. మోక్షం పొందుతారు.