
శ్రావణమాసం వెళ్లిపోయింది. మంగళగౌరి నోము, వరలక్ష్మి వ్రతాలతో సందడిగా ఉన్న ఇళ్లన్నీ ఒక్కసారి నిశ్శబ్దంగా మారిపోయాయి. కానీ శ్రావణం తర్వాత వచ్చే భాద్రపదమూ ప్రత్యేకమే .... భాద్రపదంలో ఒకో రోజు గడిచేకొద్దీ ఊరంతా హోరెత్తిపోతుంది. మరి వినాయక చవితి వచ్చేది ఈ నెలలోనే కదా. వినాయక చవితి తర్వాత వచ్చే పంచమిని రుషిపంచమి అని పిలుస్తారు. తొలిఏకాదశి రోజున శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తి, పరివర్తన ఏకాదశి రోజున మరోపక్కకి ఒత్తిగిలుతాడని అంటారు. అందుకే ఈ రోజుకి పరివర్తన ఏకాదశి.
అమావాస్యతో పవిత్ర శ్రావణ మాసం ముగిసి సెప్టెంబర్ 15 న భాద్రపదమాసం వచ్చింది. భాద్రపదంలో పండుగలే కాదు… నోములు, వ్రతాలకి కూడా కొదవ లేదు. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున వచ్చే అనంతపద్మనాభస్వామి వ్రతం ఇందులో ముఖ్యమైనది. ఈ రోజున ఆ పద్మనాభస్వామిని కొలిచినవారి కష్టాలన్నీ తీరిపోతాయని అంటారు. భాద్రపద మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పండగ. అదే సమయంలో- వరాహజయంతి, వామన జయంతి, రుషి పంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు తర్పణాలను వదిలే మహాలయ పక్షం.. ఈ నెలలోనే వస్తాయి. ఇది ముగిసిన వెంటనే దసరా సందడి ఆరంభమౌతుంది.
హిందూ క్యాలెండర్‌లో భాద్రపదం ఆరవ మాసం. వర్ష రుతువులో రెండవది. దేవతలు, పితృదేవతలకు సమానంగా పూజలు చేయడం ఈ మాసం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తొలి అర్ధభాగం అంటే శుక్లపక్షంలో దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలంగా భావిస్తారు. రెండో అర్ధభాగం అంటే కృష్ణ పక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలమని వేదాలు చెబుతున్నాయి.
శుక్లపక్ష కాలంలో ఉండ్రాళ్ల తద్దె, గౌరీ పూజ, వినాయక చవితి, శుక్ల చవితి, శుక్ల ఏకాదశి, శుక్ల ద్వాదశి, శుక్ల చతుర్ధశి, కృష్ణ పక్ష ఏకాదశి వంటి పండగలు జరుపుకొంటారు. ఇందులో శుక్ల ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా, ద్వాదశిని వామన జయంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
సెప్టెంబర్ 30వ తేదీ నుంచి మహాలయ పక్షం ఆరంభమౌతుంది. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. పితృదేవతలను ఆరాధించడానికి, వారికి పిండ ప్రదానాలు చేయడానికి, తర్పణాలను వదలడం, వారికి ఉత్తమగతులను అందించే కార్యాలకు మాత్రమే ఇది పరిమితం.
పితృదేవతల పేరు మీద దాన ధర్మాలు చేయడం అత్యవసరం. బ్రాహ్మణులకు బియ్యం, నువ్వులు.. వంటి ఆహార ధాన్యాలు, గోవు, బంగారాన్ని దానంగా సమర్పించుకోవడం వల్ల పితృదేవతలకు సద్గతులు లభిస్తాయని పెద్దలు చెబుతుంటారు. శ్రాద్ధవిధులను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం, పిండప్రదానం చేయడం వంటి కార్యాల వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.