![మాఘ పౌర్ణమి.. నదీ స్నానం ఎంత పుణ్యమో తెలుసా](https://static.v6velugu.com/uploads/2025/02/significance-of-maghamasam-pournami-snanam_3KZBuGXlYk.jpg)
మాసాలన్నింటిలోకీ మాఘ మాసం విశిష్టమైనదని స్కందపురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో సకల దేవతలనూ పూజిస్తారు. మాఘపౌర్ణమి వచ్చిందంటే చాలు ... పుణ్యతీర్థాలన్నీ కళకళలాడిపోతాయి.
స్నానాలలోకల్లా మాఘస్నానం ఉత్తమం అని పెద్దలు చెబుతూ ఉంటారు. నదులు, గుడిలోని కోనేరులు కూడా ఈ రోజున (2025 ఫిబ్రవరి 12) పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం. ఈ నెలలో పుణ్యనదుల్లో సకల దేవతలు సంచరిస్తుంటారని పండితులు చెబుతున్నారు.
మాఘ మాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. సముద్రం, నదులు అందుబాటులో లేని పరిస్థితిలో బావుల దగ్గర గానీ, చెరువుల వద్దగానీ గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం.
మాఘమాసంలో పుణ్య నదుల్లో స్నానం చేస్తే ఆరేళ్ల పాటు మంత్ర సంకల్ప స్నాన ఫలం లభిస్తుందని శాస్తాల ద్వారా తెలుస్తుంది. నదీ స్నానానికి వెళ్లలేని వారు బావి దగ్గర కాని.. బోరు దగ్గర కాని.. వాటర్ ట్యాంక్ ల దగ్గర గాని నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం చేయాలి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది.
స్నానం చేసిన తరువాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ ఆలయానికి గానీ, శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశిస్తాయని నమ్మకం.
మాఘపౌర్ణమి రోజున పార్వతితేవి భూమి మీద ఒక శంఖు రూపంలో పడి... దక్షప్రజాపతి చేయి సోకగానే బాలికగా మారిపోయింది. ఆ బాలికకు సతీదేవి అన్నపేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు దక్షుడు. ఇక మునులలో అతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా మాఘ పౌర్ణమి రోజే. కేవలం మనకు మాత్రమే కాకుండా బౌద్ధులకు కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమే.. బుద్ధుడు తాను త్వరలోనే నిర్యాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే ప్రకటించారట. అందుకని మాఘపౌర్ణమి రోజున బౌద్ధులు వారి మతగ్రంథాలైన త్రిపిటకాలను పారాయణ చేస్తుంటారు.