ఆదివాసులు... గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ నాగోబా జాతరకు సిదదమైంది. దేశంలోనే అతిపెద్ద రెండో జాతర కావడంతో అధికారులు నాగోబా జాతన ఉత్సవాలను.. ఏర్పాట్లను పరిశీలించారు.
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో జనవరి 28 అనగా రేపటి నుండి ఫిబ్రవరి 4వ తేదీ వరకు 8 రోజులపాటు నిర్వహిస్తారు.ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. నాగోబా జాతర ఉత్సవాలను ఆదివాసీలు సంప్రదాయ, ఆచార వ్యవ హారాలతో నిర్వహిస్తారు. ఇప్పటికే పవిత్ర గోదావరి జలాన్ని కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న.. గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొని వచ్చిన మెస్రం వంశస్థులు కేస్లాపూర్ కు చేరుకున్నారు. జనవరి28వ తేదీన రాత్రి పది గంటలకు మహా పూజతో జాతర ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ పవిత్ర గంగాజలాలతో నాగోబాను అభిషేకించ నున్నారు. రాత్రంతా నాగదైవానికి మహాపూజ నిర్వహిస్తారు. ఈ జాతర ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో గిరిజనులు తరలిరానున్నారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా, ఎస్పీ గౌస్ అలం, ఉట్నూర్ ఏఎస్పి కాజల్ నాగోబా ఆలయాన్ని దర్శించుకుని జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
వేడుకల అనంతరం ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. దీనికి స్థానిక ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు జిల్లా అధికారులందరూ హాజరవుతారు. ఈ దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలను అధికారుల దష్టికి తీసుకెళ్లి అక్కడికక్కడే పరిష్కరించుకునే వీలుంది.
ALSO READ | Spiritual: వేదాల్లో విద్య గురించి ఏముంది.. సంతోషంగా .. హాయిగా ఉండాలంటే డబ్బు ఎలా సంపాదించాలి..
జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బార్‌కు ఒక ప్రత్యేకత, చరిత్ర ఉంది. నిజాం హయాంలో మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరుగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరు వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం.. విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కొమురం భీం మరణించిన సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు.
అప్పుడు నిజాం దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్ హైమన్‌డార్ఫ్ 1946లో మొదట నిర్వహించాడు. స్వాతంత్రం వచ్చిన తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్‌కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు.
జాతర కథ..
క్రీ.శ 740.. కేస్లాపూర్‌లో పడియేరు శేషసాయి అనే నాగభక్తుడుండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్లాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. నిరుత్సాహానికిగురై తిరిగి పయనమవుతూ.. పొరపాటున నాగలోకం ద్వారాలను తాకుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు.
ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయం పట్టుకొని.. తనకు తెలిసిన పురోహితుడిని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు. ఏడు కడవల ఆవుపాలతోపాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు తదితర ఏడురకాల నైవేద్యాలు సమర్పించి, 125 గ్రామాలమీదుగా పయనిస్తూ, పవిత్ర గోదావరినీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకంచేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్‌లో శాశ్వత నివాసమేర్పరుచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటినుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు...