తెలుగు మాసాలలో చివరిది ఫాల్గుణం. ఫాల్గుణమాసం సోమవారం ( మార్చి 11) నుంచి ప్రారంభం కానుంది. మనలోని అరిషడ్వర్గాలను, కోరికలను నియత్రణలో ఉంచడం కోసం సాధన చేయడానికి అనువైన మాసం ఫాల్గుణం. ఆకాశంలో శ్వేతవర్జంతో దండాకారంగా ప్రకాశించే రెండు నక్షత్రాలతో కూడినదే ఫల్గుణ నక్షత్రం. అందులో ప్రథమం పూర్వ ఫల్గుణ (పుబ్బ), ద్వితీయం ఉత్తర ఫల్గుణ (ఉత్తర). అర్జునుడు ఈ నక్ష్మత్రం నాడు జన్మించడం వలన ఫల్గుణుడయ్యాడు.
పూర్ణిమ నాడు ఫల్గుణీ నక్షత్రం ఉన్న చాంద్రమాసాన్ని ఫాల్గుణ మాసమని పిలుస్తారు. ఈ మాసం శిశిర బుతువుకు వీడ్కోలు చెప్తూ వసంతానికి స్వాగతం పలుకుతుంది. ఫాల్గుణంలో చేసిన దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాలనిస్తాయి. కాబట్టే ఫాల్గుణం విశిష్టమైనది, దివ్యమైనది. అందుకే ఈ మాసం ప్రాముఖ్యత పొందింది. శ్రీ మహావిష్ణువు ఈమాసంలో గోవిందనామంతో సంతోషిస్తాడు. ఈ కారణం చేతనే ఫాల్గుణ మాసం విష్ణు ప్రీతికరమని చెబుతారు. ఈ మాసంలో ఎన్నో వ్రతాలు ఆచరించాలని శాస్త్రం చెబుతోందని పండితులు చెబుతున్నారు.
ఎప్పటి నుంచి ప్రారంభం.. ఏ రోజు ఏం చేయాలంటే...
ఈ సంవత్సరం ( 2024)మార్చి 11న ఫాల్గుణ మాసం ప్రారంభమవుతుంది. ఫాల్గుణం ఆహ్లాద వాతావరణంలో బ్రహ్మీముహూర్త సంధ్యాకాలం దేవతార్చనలకు పవిత్రమైనది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ద్వాదశి వరకు చేసే వ్రతంలో పన్నెండు దినాలు నదీస్నానం ఆచరించాలి.పాడ్యమి నాడు గుణావాప్తి వ్రతం, తదియనాడు మధూక వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ చవితిని “తిల” అంటారు. దీనినే పుత్రగణపతి వ్రతమని, శాంత చతుర్ధీ వ్రతమని అంటారు. ఈ రోజున ఉపవాసం చేసి తిలాన్నంతో గణపతి హోమం చేసి అతిథులు భుజించిన తరువాత హోమం చేసినవారు తినాలి. దీని వలన సర్వవిఘ్నాలు తొలగిపోతాయి.ఈ రోజున వ్రతమాచరించిన వారికి సత్సంతానం కలుగుతుంది.
అనంత పంచమి వ్రతం చేయాలి. నువ్వులు కలిపి వండిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరించాలి. సప్తమి నాడు అర్మసంపుట వ్రతం చేయాలి. ఉషోదయ కాల స్నానం అనంతరం సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యనమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి.
ఈ మాసంలో శ్రీ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవిని, సీతామాతను షోడశోపచారాలతో పూజించాలి. ప్రదోష కాలంలో దీపారాధన చేసిన వారికి సౌభాగ్యం, సంపద చేకూరుతుంది. ఈ రోజున లలితా కాంతి దేవి వ్రతమాచరించాలి. నవమి నాడు ఆనంద నవమి అని శ్రీ లక్ష్మీ నారాయణులను తులసి దళాలతో, మందార పుష్పాలతో అర్చించాలి.
ఈ మాసంలో వచ్చే ఏకాదశిని మతత్రయ ఏకాదశి, అమలకీ ఏకాదశి, ధాత్రి ఏకాదశి, అమృత ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీలక్ష్మీ నారాయణులను పూజించి ఉపవాసం, జాగరణం చేయాలి. ఉసిరి చెట్టు కింద శ్రీ లక్ష్మీ నారాయణులను పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున చేసిన ప్రతాల వేలకొలది గోదానాలు చేసిన ఫలితం కలుగుతుంది. శుద్ధ ద్వాదశి విష్ణు ప్రీతికరమైన తిథి. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు. శుద్ధ త్రయోదశి రోజు గ్రామ క్షేమం కోసం మన్మధ విగ్రహ దహనం చేస్తారు. శుద్ధ చతుర్దశి నాడు శ్రీ మహేశ్వర వ్రతం ఆచరించాలి.
ఈ నెలలో హోళి పండుగ నిర్వహిస్తారు. పూర్ణిమను హోళికా పూర్ణిమ అని, మదన పూర్ణిమ అని, హోళి అని, కామదహనమని వ్యవహరిస్తారు. ఈ రోజు ఉదయమే ఎండిన పిడకలపై మంటవేసి కామదహనం చేస్తారు. పూర్ణిమ సాయంత్రం నృత్యగీత వాద్యాలతో బాలకృష్ణుడిని .... రాధాకృష్ణులను ఊయలలో ఉంచి ఆరాధించి డోలాత్సవం జరపాలి. ఇలా చేయడం వలన వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు.
ALSO READ :- పోలీసుల దాడుల్లో బయటపడ్డ బ్లాస్టింగ్ మెటీరియల్
ఫాల్గుణ పూర్ణిమనాడు మధురైలోశ్రీ మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం, తమిళనాట శివపార్వతుల కళ్యాణం, ఇక ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నెమలిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణీ కళ్యాణం జరుపుతారు. ఈ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానమాచరించి గోమయంతో అలికిన ఇంటి ప్రాంగణంలో తెల్లటి వస్త్రాన్ని ఆసనంగా చేసుకుని తూర్పుముఖంగా కూర్చొని ఒక ముత్తైదువచే వందన తిలకం, నీరాజనం పొంది కొత్త చందనంతో కూడిన మామిడి పూవును భక్షించటం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
బహుళ ఏకాదశిని విజయైకాదశి, పాప విమోచన ఏకాదశి అని అంటారు. ఈ రోజున శ్రీ లక్ష్మి నారాయణులను అర్చించి ఉపవాసం ఉండి నియమానుసారం ఏకాదశి వ్రతం ఆచరిస్తే శుభఫలితాలు కలుగుతాయి. బహుళ ద్వాదశి అన్నమాచార్య వర్ధంతి కావున ఆయన కీర్తనలు పాడి స్మరించుకోవాలి. బహుళ అమావాస్య కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కనుక దీనిని కొత్త అమావాస్య అంటారు.
ఈ రోజు దేవ, పితృ ఆరాధనలు చేయడం తేష్టం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. అన్నదానం చెయ్యాలి. పాండవులు ఈ మాసంలోనే జన్మించారు. ఈ మాసంలో క్షీరసాగరమథనం జరిగింది. అయ్యప్పస్వామి అవతరణ, ఈ మాసంలోనే జరిగింది. ఈమాసంలో చేసే ప్రతి దానం గోవిందునికి ప్రీతి కలిగిస్తుంది. ఈ మాసం నారాయణునికి ప్రీతికరం. భక్తులందరికీ పావనం, ముక్తిదాయకమని పురాణాలు చెబుతున్నాయి.