Polala Amavasya 2024: తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 2న లేదా 3న ఎప్పుడొచ్చిందనే విషయంలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అమావాస్య ఎప్పుడొచ్చిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హిందూ మత విశ్వాసాల ప్రకారం పోలాల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ పర్వదినాన పూర్వీకులను స్మరించుకుంటూ, వివాహిత మహిళలు తమ సంతానం కోసం, పిల్లల యోగ క్షేమాలను కాంక్షిస్తూ వ్రతాలను ఆచరిస్తారు. తెలుగు పంచాంగం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ 02వ తేదీన అంటే శ్రావణ మాసంలో చివరి రోజున సోమవారం నాడు పోలాల అమావాస్య వచ్చింది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున శుభ ముహుర్తం ఎప్పుడొచ్చింది.. ఈరోజు వ్రతాన్ని ఎలా ఆచరించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
శుభ ముహుర్తం..
శ్రావణ అమావాస్య తిథి సెప్టెంబర్ 02న తెల్లవారుజామున 5:22 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే 3 సెప్టెంబర్ 2024 మంగళవారం 7:25 గంటలకు ముగియనుంది.
- ఉదయం తిథి ప్రకారం, సెప్టెంబర్ 2వ తేదీన అమావాస్యను జరుపుకోనున్నారు.
- స్నాన సమయం : తెల్లవారుజామున 4:38 గంటల నుంచి ఉదయం 5:24 గంటల వరకు
- పూజా సమయం : ఉదయం 6:09 గంటల నుంచి ఉదయం 7:44 గంటల వరకు
- శ్రాద్ధ సమయం : మధ్యాహ్నం 12 గంటల నుంచి సూర్యాస్తమయానికి ముందు వరకు
- ఈ అమావాస్య సోమవారం రోజున వచ్చింది కాబట్టి ఈ అమావాస్యను సోమావతి అమావాస్య అని కూడా అంటారు.
పూజా విధానం..
పోలాల అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. ఇంటిని శుభ్రం చేసి.. పూజా గదిలో కందమొక్కను ఉంచాలి. ఆ మొక్కకు తొమ్మిది పసుపు కొమ్మలు కట్టాలి. ముందుగా వినాయకుడిని పూజించి, ఆ తర్వాత కంద మొక్కలోకి మంగళగౌరీ దేవిని గానీ, సంతాన లక్ష్మీదేవిని గానీ ఆవాహనం షోడపశోపచారాలతో పూజలు చేయాలి. పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. మీ చుట్టు పక్కల ఇళ్ల నుంచి కూరగాయలను అడిగి తీసుకుని, వాటితో వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో వాయనం ఇవ్వాలి.
పోలాల అమావాస్య ప్రాముఖ్యత..
పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు.. అయితే ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డల్ని చూసి ఎంతో దుఃఖంతో ఆమె ఊరి వెలుపల ఉన్న పోచమ్మ చుట్టూ ప్రతి సంవత్సరం పిల్లల్ని సమాధి చేస్తూ వెళ్తోంది. అయితే ప్రతి ఏటా పోలాల అమావాస్యకు పిల్లలు పుడుతున్నారు.. మళ్లీ పోలాల అమావాస్య సమయానికి మరణిస్తున్నారు. దీంతో తాను నోము నోచుకోవడానికి ఎవరిని పేరంటానికి పిలిచినా రావడానికి విముఖత చూపేవారు.
గత జన్మలో చేసిన పాపాలు..
ఆ సమయంలో తను పూర్వ జన్మలో ఏ పాపం చేశానో నాకు పుట్టిన బిడ్డలు ప్రతిసారీ చనిపోతున్నారని బాధపడింది. అప్పుడు పోచమ్మ తల్లి ‘‘బ్రాహ్మణమ్మా! గత జన్మలో పోలాల అమావాస్య పేరంటాలు రాకముందే పిల్లలు ఏడిస్తే ఎవరూ చూడకుండా పాయసం, గారెలు పెట్టావు. పులుపు, తీపి సరిపోయిందో లేదో అని చూశావు. ఆచారాలన్నీ పాటించకుండా అమంగళం చేశావు. అందుకే నీ బిడ్డలు పుట్టిన కొంత సమయానికే మరణిస్తున్నారు’’ అని చెప్పింది.
తన తప్పును తెలుసుకున్న బ్రాహ్మణమ్మ పోచమ్మ తల్లి కాళ్ల మీద పడి తనను క్షమించమని కోరింది. ఈ వ్రత విధానం తనకు తెలపాలని కోరగా పోచమ్మ ఇలా వివరించారు. ‘‘శ్రావణ మాసంలో చివరి రోజున, భాద్రపదంలో మొదటగా వచ్చే రోజును పోలాల అమావాస్య అంటారు. ఆ పర్వదినాన గోమాత పేడతో అలికి పసుపు, కుంకుమతో రాసి, కందమొక్కను రాసి, కందమొక్కను అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరాన్ని కందమొక్కకు కట్టి పూజ చేయాలి. 9 వరుసల తోరం పేరాంటాలకు ఇచ్చి మనం కట్టించుకోవాలి. పిండి వంటలను అమ్మవారికి నివేదన చేయాలి. భోజనం చేసిన తర్వాత తాంబూలం, మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు మరణించకుండా కలరా, మలేరియా, మశూచి తదితర వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు’’అని వివరించారు. ఆ తర్వాత వ్రతాన్ని చేసిన బ్రాహ్మణమ్మ తిరిగి తన బిడ్డల్ని పొందినట్లు పురాణాల్లో పేర్కొనబడింది.