హిందువులు అనేక మంది దేవతలను, దేవుళ్లను పూజిస్తుంటారు. ఎవరి ఆచారం ప్రకారం.. కుల దేవతను.. ఇష్ట దేవతను పూజిస్తుంటారు. అయితే కార్తీకమాసంలో శివుడిని...ధనుర్మాసంలో విష్ణువును.. వినాయకచవితి రోజు గణపతిని.. ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో విశిష్టమైన రోజు ఉందని పురాణాలు ద్వారా తెలుస్తోంది. అలాగే ఇప్పుడు ఫాల్గుణ మాసం కృష్ణ పక్షం అష్టమి ( ఏప్రిల్ 2) రోజును శీతలా దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు.. అసలు శీతలాదేవి అంటే ఎవరు.. ఆమెను ఆరోజు ఎందుకు పూజించాలో తెలుసుకుందాం. . .
హోలీ జరిగిన ఎనిమిదో రోజున శీతల అష్టమి వస్తుంది. ఈరోజు హిందువులకు అత్యంత ముఖ్యమైన రోజు. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం శీతల మాతను పూజిస్తారు. శీతల అష్టమిని బసోదా పూజ అని కూడా పిలుస్తారు. గ్రామాల్లో శీతల మాత అంటే గ్రామదేవత పోచమ్మగా పూజిస్తారు.. ఈ అమ్మవారికి పెట్టే ప్రసాదం కూడ ప్రత్యేకంగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం శీతల మాతను ఆరాధించడం వల్ల అన్ని రకాల అనారోగ్యాల నుండి ప్రజలను కాపాడుతుందని నమ్ముతారు. ఈ పండుగను ప్రధానంగా ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లో జరుపుకుంటారు.
శీతల అష్టమి శుభ సమయం
- శీతల అష్టమి తిథి ఏప్రిల్ 01న రాత్రి 09:09 గంటలకు ప్రారంభం
- ఏప్రిల్ 2, 2024న రాత్రి 08:08 గంటలకు ముగింపు
- శీతల అష్టమి పూజ ముహూర్తం ఏప్రిల్ 2 ఉదయం 06:31 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
శీతల అష్టమి పూజా విధానం
శీతలా అష్టమి రోజున ( ఏప్రిల్ 2) సూర్యోదయానికి ముందే పొద్దున్నే నిద్రలేవాలి. గంగాజలం కలిపిన నీటితో స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించి ముందు రోజు తయారు చేసిన వంటకాలను అమ్మవారికి సమర్పించి పూజ చేయాలి. వేప చెట్టుకి నీరు సమర్పించాలి. శీతల మాతకు సమర్పించే నీటిని కొద్దిగా ఇంటికి తెచ్చుకుని వాటిని ఇంటి చుట్టూ చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారు రక్షణగా ఉంటారని నమ్మకం.
పూజా విధానం
అమ్మవారి ప్రతిమను కాని.. చిత్ర పటాన్ని కాని పీటపై కాని.. బల్లపై కాని కొత్త వస్త్రంపై కొంచెం బియ్యం పోసి అమ్మవారి ప్రతిష్టించాలి. తరువాత.. ఆవాహన చేసి.. షోడశోపచారాలు చేసి ధూపం.. దీపం.. నైవేద్యం సమర్పించాలి. అందుకే సప్తమి రోజు శీతల అమ్మవారి పూజకు ఆహారం సిద్ధం చేసుకుని పెట్టుకుంటారు. అన్నం, రబ్రీ, పువా, హల్వా, రోటీ వంటివి తయారుచేస్తారు. ఈ తీపి వంటకాలు శీతల తల్లికి మరుసటి రోజు అంటే శీతల అష్టమి నాడు సమర్పిస్తారు. అమ్మవారికి ఇష్టమైన శ్లోకాలు చదువుతూ.. ఉపవాసం ఉండాలి. షుగర్ పేషంట్లు, వృద్దులు ఉపవాసం ఉండకపోవడమే మంచిది. ఉపవాస సమయంలో పండ్లు, పాలు తినవచ్చు.
శీతల అష్టమి ప్రాముఖ్యత
పురాణాలు ప్రకారం. ..శీతలా దేవి వ్యాధుల నుండి, ముఖ్యంగా వేసవి తాపం వల్ల వచ్చే వ్యాధుల నుండి రక్షకురాలిగా పూజించబడుతుంది. ఈ రోజున (ఏప్రిల్ 2) ఆమెను పూజించడం వల్ల అనారోగ్యాలు దరిచేరవని, తమ ఆత్మీయులకు మంచి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం.శీతల మాతను పూజించడం వల్ల చికెన్ పాక్స్, కంటి వ్యాధులు వంటి రోగాలు రాకుండా ఉంటాయని భక్తుల విశ్వాసం. అందుకే అమ్మవారిని మశూచి దేవతగా పూజిస్తారు. ఇంటి ముందు పేదరికం దూరం చేస్తుందని, సంపదని ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు
ముందు రోజున వండిన ప్రసాదమే ఎందుకంటే..
శీతల అష్టమి రోజు శీతలమాతకు ముందు రోజు వండిన ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. ఇంట్లో తాజాగా ఆహారాన్ని తయారు చేయరు. ముందు రోజే వండిన ఆహారాన్ని మాత్రమే ప్రసారంగా తింటారు. దీని వెనుక పౌరాణిక కథ కూడా ఉంది. స్కంద పురాణం ప్రకారం బ్రహ్మ దేవుడు విశ్వాన్ని ఆరోగ్యంగా ఉంచే బాధ్యతను శీతల మాతకు అప్పగించారు. అలా అంటు వ్యాధుల నుంచి బయట పడేందుకు ప్రజలు శీతల మాతను పూజిస్తారు. అమ్మవారికి చద్దన్నం అంటే చాలా ఇష్టం అని నమ్ముతారు. అందుకే ముందు రోజు వండిన ఆహారాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు. అష్టమి రోజు ఇళ్లల్లో ఎవరూ పొయ్యి వెలిగించరు. ముందు రోజు వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
శీతల మాతకు చేతిలో చీపురు.. చాట
శీతల మాత గ్రామ ప్రజలను రక్షించేందుకు ఊరి పొలిమెర్లలో ఉండే శీతలంబ లేదా పోచమ్మగా మారిపోయింది. ఈ అమ్మవారి చేతిలో చీపురు, చాట ఉంటాయి. గ్రామంలోని ప్రజలకు వ్యాధులు కలిగించే క్రిమి కీటకాలను, భూత ప్రేత పిశాచాలను గ్రామంలోకి రానివ్వకుండా చీపురుతో వాటిని చాటలోకి ఎత్తి పడేస్తుందని ప్రజలు నమ్ముతారు.
శీతల మాత కథ
హిందూ శాస్త్రం ప్రకారం పోచమ్మ తల్లి చల్లదనాన్ని ప్రసాదిస్తుంది. శీతల మాతనే మశూచి దేవతగా కూడా పిలుస్తారు. శీతల దేవిని పూజించడం వల్ల మశూచి రాదని నమ్ముతారు. స్కంద పురాణంలో శీతల మాతకు సంబంధించి పౌరాణిక కథ కూడా ఉంది.
శివుని సగ రూపంగా శీతల మాతను పరిగణిస్తారు. పురాణాల ప్రకారం దేవలోకానికి చెందిన శీతల మాత భూమిపై విరాట్ రాజు రాజ్యంలో నివసించడానికి వచ్చింది. అయితే రాజు శీతల మాతను తన రాజ్యంలో ఉండడానికి అంగీకరించలేదు. దీంతో అమ్మ వారికి కోపం వచ్చింది. దీని ప్రభావంతో అక్కడున్న ప్రజల శరీరం మీద ఎర్రటి మచ్చలు వచ్చాయి. వాటి వల్ల చర్మం మండిపోవడం ప్రారంభించింది. దీంతో విరాట్ రాజు తన తప్పు తెలుసుకొని అమ్మవారిని క్షమాపణలు కోరాడు. తల్లిని శాంతింప చేసేందుకు పచ్చి పాలు, చల్లని మజ్జిగ సమర్పించాడు. అప్పుడు అమ్మవారి కోపం చల్లారింది. అప్పటి నుంచి అమ్మవారికి చల్లని వంటకాలు పెట్టె సంప్రదాయం కొనసాగుతుంది.