తిరుమలలో ప్రతి సంవత్సరం వైశాఖాన ఆగమోక్తంగా సుమారు 450 రకాల సేవలు, ఉత్సవాలు, పూలు జరుగుతుంటాయి. ఆ ఉత్సవాలప్పుడు యాత్రికుల వల్ల గానీ, ఆలయ సిబ్బంది వల్ల గానీ తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ పొరపాట్లను క్షమించి, దోషాలను నివారించమని స్వామివారిని కోరుతూ.. చేసేదే పవిత్రోత్సవం. ఆగమశాస్త్రం ప్రకారం మూడు రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి.
పవిత్రం. ఉత్సవం అనే రెండు పదాల కలయిక చల్ల పవిత్రోత్సవం ఏర్పడింది. పవిత్రోత్సవం నుంచి రక్షిస్తుందని 'జయఖ్య సంహిత' వివరిస్తుంది. ఈ ఉత్సవం చీకటి లేదా ప్రకాశవంతమైన పక్షం 12వ రోజున జరగాలని గరుడ పురాణం చెబుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తులకు కావలసిన పవిత్రాలు చేయడానికి శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను పెంచుతారు. అత్యంత పవిత్రమైన దైవమొక్కగా భావించే తులసి పెంచే పెరట్లోనే ఈ మొక్కలను పెంచుతారు.
ఆరు శతాబ్దాలకు పూర్వం:
తిరుమల ఆలయంలో 1463 నాటి నుంచి పవిత్రోత్సవాలు చేస్తున్నారు. ఆలయంలోని మొదటి ప్రాకారంలోని వగపడి వరండా. ఉత్తర గోడపై ఉన్న 157వ రాతి శాసనంలో పవిత్రోత్సవం గురించి వివరంగా ఉంది. పవిత్ర తిరునాల్ వేడుకలో వాడాల్సిన వస్తువులు గురించి కూడా ఈ శాసనంలో ఉంది. ఈ శాసనం -ప్రకారం పవిత్రోత్సవాలు చేయడం సాళువ నరసింహ కాలంలో సాళువ మల్లయ్య దేవరాజు మొదలుపెట్టారు. ఆ తర్వాత 1562 వరకు ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం చేశారు. కానీ.. తర్వాత ఆపేశారు. దానికి కారణం మాత్రం ఎక్కడా పేర్కొన లేదు.
1962 నుంచి మళ్లీ మొదలుపెట్టారు:
వైష్ణవ దేవాలయాలలో అనుసరించే ఆచారాలన్నింటినీ ప్రారంభించాలని టీటీడీ సంకల్పించింది. అందుకే 1962లో వార్షిక పవిత్రోత్సవాలను పునరుద్ధరించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం శ్రీవారి పవిత్రోత్సవం నిర్వహిస్తోంది. శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ముఖ్యమైన రోజుల్లో నిర్వహించటం సంప్రదాయం.
అంకురార్పణతో వైదిక క్రతువు:
పవిత్రోత్సవం ముందు రోజు అంకురార్పణం చేస్తారు. అందులో భాగంగా తొమ్మిది రకాల పవిత్ర విత్తనాలను మట్టి పాత్రల్లో విత్తుతారు. ఈ ఆచారం ఆలయంలో పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇదే సందర్భంలో మృత్సంగ్రహణ అనే కర్మలో వేదాలు పఠించే అంకురార్పణతో పాటు మృత్సంగ్రహణ ఆచారాలు బ్రహ్మోత్సవ సమయంలో చేసిన వాటికి సమానంగా ఉంటుంది. మృత్సంగ్రహణ కర్మ తర్వాత వేద పారాయణం ప్రారంభమైంది. ముందుగా ప్రధాన కుంభంలో (పవిత్రంలో మొదటిది) విష్ణువు కోసం ఆవాహన (పిలుపు) చేశారు. ఈ ప్రధాన కుంభం చుట్టూ 16 ఇతర కుంభాలు ఉన్నాయి. పఠించబడే వివిధ మంత్రాలు
మత, ఆధ్యాత్మిక శక్తిని కలిగి శబ్ద తరంగాలు ప్రేరేపిస్తాయని నమ్ముతారు. ప్రధాన కుంభాన్ని ముగింపు రోజున ప్రధాన దేవత వద్దకు తీసుకెళ్తారు. వృద్ధి చెందిన ఆధ్యాత్మిక శక్తి మూల విగ్రహానికి (కుంభ అవాహనం) ప్రసారం అవుతుందని నమ్ముతారు.
మూడు రోజుల కార్యక్రమం:
ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ చేస్తారు. రెండో రోజు పవిత్ర సమర్పణ. చివరి రోజు పూర్ణాహుతి చేస్తారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో ఉత్సవమూర్తులు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. చివరి రోజు పూర్ణాహుతితో వైదిక క్రతువు ముగిస్తారు.
పవిత్రాలంటే..:
పవిత్రాలను తయారు చేయడానికి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలు దారం ఉపయోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ, రంగులు అద్దుతారు. ఆలయ మొదటి ప్రాకారంలో ఉన్న వేగపడి వరందాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. 'పవిత్ర తిరునాల్' పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరల వివరాలున్నాయి.
భక్తుల భాగస్వామ్యం:
పవిత్రోత్సవంలో భక్తులకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ఆర్జిత సేవగా భక్తులు టికెట్ కొనుగోలు చేసి ఉత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు టీటీడీ బహుమానం. ప్రసాదాలు అందిస్తోంది.