జులై 2 యోగిని ఏకాదశి.. ఆరోజు ఏంచేయాలంటే..

జులై 2 యోగిని ఏకాదశి.. ఆరోజు ఏంచేయాలంటే..

Yogini ekadashi 2024: జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల సకల యోగాలు లభిస్తాయి.

జ్యేష్ఠ మాసంలో వచ్చే చివరి ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి తిథి మహావిష్ణువుకు చాలా ప్రీతికరమైనది. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. శ్రీమహావిష్ణువును పూజించడం ద్వారా కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి తిథి ప్రతి నెల రెండుసార్లు వస్తుంది. కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంటుంది. యోగిని ఏకాదశి రోజు ( జులై 2)  ఉపవాసం ఆచరించి విష్ణువును పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ ఏడాది యోగిని ఏకాదశి జులై 2వ తేదీ వచ్చింది. దేవశయని ఏకాదశికి ముందు ఈ యోగిని ఏకాదశి వస్తుంది.

దేవశయని ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళతారు. యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించిన వ్యక్తికి 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.  అంతేకాదు  మరణించిన తర్వాత ఆత్మకు మోక్షం లభించి వైకుంఠ ప్రవేశం పొందుతారు.

యోగిని ఏకాదశి శుభ ముహూర్తం

  • పంచాంగం ప్రకారం యోగిని ఏకాదశి తిథి జులై 1, 2024 ఉదయం 10.26 నుంచి ప్రారంభం
  • యోగిని ఏకాదశి తిథి ముగింపు జులై 2 ఉదయం 8.42 గంటలకు.
  • ఉదయ తిథి ప్రకారం యోగిని ఏకాదశి జులై 2 జరుపుకోనున్నారు.

రెండు శుభ యోగాలు

యోగిని ఏకాదశి ఉపవాసం రోజు రెండు శుభ యోగాలు ఉన్నాయి. త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగం వచ్చాయి. సర్వార్థ సిద్ధి యోగం జులై 2 ఉదయం 5.27 నుంచి జులై 3 ఉదయం 4.40 వరకు ఉంటుంది. త్రిపుష్కర యోగం జులై 2 ఉదయం 8.42 నుంచి ప్రారంభమై మరుసటి రోజు జులై 3 ఉదయం 4.40 వరకు ఉంది.

యోగిని ఏకాదశి ప్రాముఖ్యత

యోగిని ఏకాదశి రోజు లక్ష్మీ నారాయణుడిని పూజిస్తారు. పద్మ పురాణం ప్రకారం యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించడం వల్ల ఎన్నో యాగాలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. జన్మ జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. యోగిని ఏకాదశి రోజు రాత్రి జాగారం చేసి విష్ణు నామ స్మరణ చేయాలి. ఇలా చేయడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు పొందుతారు. ఈ యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. యోగిని ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు యుధిష్టిరుడికి చెప్పినట్టుగా బ్రహ్మ పురాణం చెబుతోంది.

పూజా విధానం

  • యోగిని ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించాలి.
  • పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి విగ్రహం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. గంగాజలంతో అభిషేకించాలి. 
  •  శ్రీ మహా విష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ఇష్టం.అందుకే ఈరోజున పసుపు రంగు దుస్తులను ధరించాలి.
  •  విష్ణుమూర్తికి పసుపు రంగు పూల హారాన్ని సమర్పించాలి.
  •  శ్రీహరి పూజలో పండ్లు, స్వీట్లు, పువ్వులు పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి.
  •  యోగినీ ఏకాదశి వేళ ఏకాదశి కథను వినాలి. మరుసటి రోజు ఉపవాస దీక్షను విరమించాలి.

ఇవి దానం చేయండి..

  •  యోగినీ ఏకాదశి వేళ పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.
  •  పేదలకు బట్టలు దానం చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి.
  •  యోగినీ ఏకాదశి రోజున నెయ్యిని దానం చేయడం వల్ల తెలివితేటలు, మేధస్సు పెరుగుతాయని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే నెయ్యిని దేవతల ఆహారంగా పరిగణిస్తారు.
  • బ్రాహ్మణులకు దక్షిణను దానం చేయాలి. ఈ రోజున దక్షిణ దానం చేయడం వల్ల జ్ఞానము.. తెలివి తేటలు లభిస్తాయి
  •  నువ్వులను దానం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో సుఖసంతోషాలు లభిస్తాయి.
  •  పండ్లను దానం చేయడం వల్ల ఆరోగ్య పరంగా మెరుగైన ఫలితాలొస్తాయి.
  •  గోమాతను దానం చేయడం వల్ల మోక్షం లభిస్తుంది.