ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడానికి సైంటిఫిక్​ రీజన్​ ఇదే..

ఆషాఢంలో స్త్రీలు  గోరింటాకు పెట్టుకోవడానికి సైంటిఫిక్​ రీజన్​ ఇదే..

గోరింటాకు ఆషాడమాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు? ప్రతి పండుగ, శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా.. ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు.  అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు.  ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. ఇది ఆధ్యాత్మికమైనా.. సైంటిఫిక్​ రీజన్స్​కూడా ఉన్నాయా.. అసలు ఆషాఢం గోరింటాకు వల్ల  కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి...

ఆషాడ మాసం మొదలైంది. ఇక ప్రతీ ఆడపిల్లల చేతులు ఇప్పటి నుంచి గోరింటాకుతో అందంగా మెరిసిపోతాయి. చాలా మందికి గోరింటాకు అంటే ఇష్టం ఉంటుంది. ఇక ఈ మాసంలో పెట్టుకోవడం మరింత ఇష్టం. ఎందుకంటే మగువ అందాన్ని పెంచడంలోనూ, ఆరోగ్యాన్ని ఇవ్వడంలో గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఇంతే కాదండోయ్.. పెళ్లి కాని అమ్మాయిల ఊహలకు గోరింటాకు అందాలను అద్దడానికి ఈ ఆషాడం వచ్చినట్లు ఉంటుంది. ఎందుకంటే గోరింటాకు పండడాన్ని బట్టి, కాబోయే భర్త గుణగణాలు చెబుతారు పెద్దవాళ్లు. కాస్తా ఎక్కువగా పండితే చాలు నీకు మంచి భర్త వస్తాడు.. నిన్ను బాగా చూసుకుంటాడు అంటూ ఆకాశానికెత్తేస్తారు. ఇక ఆ గోరింటాకు చేతులను చూసుకుంటూ యువతి ఆనందంతో మురిసిపోతుంది. అలాగే కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు. ఈ సమయంలో వీరు తమ రెండు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. ఈ గోరింటాకు వారి సౌభాగ్యాన్ని గుర్తు చేస్తోంది. పుట్టింట ఉన్న మనసు, మెట్టింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది అంటారు.

గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమై గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు. అందుకే మనవారు చెప్పినట్లుగా ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే అమ్మాయిలంతా ఈ సమయంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇప్పుడంటే గోరింటాకు పెట్టుకోవడం ఆడవారు మాత్రమే కాదు ఇదివరకైతే మగవారు కూడా పెట్టుకునేవారు. అంతెందుకు ఈ మధ్య ఈ ఫ్యాషన్ తిరిగి వచ్చింది. గత రెండేళ్లుగా యువకులు కూడా పెట్టుకుంటున్నారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అంటున్నారు.

వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.. జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి. ఇలాంటి మార్పు మొదలైన కాలంను ఆషాడ  మాసం అని పిలుస్తాం. ఆషాడం వచ్చిదంటే చాలు వర్షాలు పడుతుంటాయి. దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది. దీంతో  సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతుంది. దీంతో మన శరీరంలో కొంత చికాకుగా ఉంటుంది. గోరింటాకులో ఉన్న ఔషధగుణం పిప్పిగోళ్ళని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది. కాలి వేళ్ళ గోళ్ళ మొదళ్ళలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది. గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు . గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తుంది గోరింటాకు. సహజమైన  మంచి కండిషనర్ గా పని చేస్తుంది.

ఆషాఢంలోనే ఎందుకు..

ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకున్న తరువాత  ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు ...మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

సైంటిఫిక్ రీజన్..

శాస్త్రీయంగా చూస్తే గర్భాశయదోషాలను తొలిగిస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింతచేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయమవుతాయి. మొగుడికీ ... గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది. గోరింటాకు పండటం అనేది ఆమగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. అందంగా ఉన్నమ్మాయికి చక్కని భర్త వస్తాడని అంటుంటారు అందుకే.. సహజ సిద్ధమైన గోరింటాకు ప్రకృతిలో దొరికే కలుషితం లేనిది. ఆర్టిఫిషియల్ రంగులతో అలంకరించుకునే దానికంటే సహజమైన గోరింటాకును పెట్టుకోవడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం ఏంటంటే

 ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్, సర్ఫులను వాడుతారు. ఈ సమయంలో వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి సమమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు

గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కాలు..

ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు బ్యూటిషన్లు. గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొద్దిగా చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక.. అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి.. అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు.. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా వెనిగార్ లేదా ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకుని చేతులకి రాసుకుంటే ఎర్రగా మెరిసిపోతూ కనిపిస్తుంది. ...

సో, ఆధ్యాత్మికంగా.. సైంటిఫిక్​ రీజన్సే కాక ఆరోగ్య  పరంగా.. ఇన్ని లాభాలు ఉన్న గోరింటాకుని మీరు మిస్ కావొద్దు.. ఇక ఆలస్యమెందుకు.. గోరింటాకు తెచ్చుకుని చేతులను అందంగా మార్చుకోండి.