దీపావళి చిన్న.. పెద్దా తేడా లేకుండా హిందువులు ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని పూజించి.. కేదారీశ్వర వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. ఈ తరంలో ఈ పండుగను ఒక్కరోజే జరుపుకుంటారు.. గతంలో రెండు రోజులు జరుపుకునేవారు ( నరకచతుర్దశి... దీపావళి) . వాస్తవానికి ఇది రోజుల పండుగ . అసలు ఐదు రోజులు ఈ పండుగను ఎందుకను జరుపుకోవాలి.. పండితులు తెలిపిన ప్రకారం .. దీపావళి ఐదు రోజుల పండుగ ప్రాముఖ్యత .. విశిష్టత గురించి తెలుసుకుందాం.. . . .
దీపావళి పండుగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో ధన త్రయోదశి నుంచి భాయ్ పూజ వరకు దీపావళి వేడుకలు చేసుకుంటారు. ఐదు రోజుల పాటు సాగే ఈ పండుగ ఈ ఏడాది అక్టోబర్ 29 న ధన త్రయోదశి ( ధన్తేరాస్)తో ప్రారంభమై నవంబర్2న భాయ్ పూజతో ముగుస్తుంది.
అక్టోబర్ 29... 1 వరోజు...ధన త్రయోదశి ( ధన్తేరాస్): ఈ రోజున లక్ష్మీదేవి పుట్టిన రోజు. .. దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మథించే సమయంలో శ్రీ మహాలక్ష్మి జన్మించింది. ఆమెను భార్యగా స్వీకరించిన విష్ణుమూర్తి.. సకల సంపదలకు.. ఐశ్వర్యానికి అధిదేవతగా ప్రకటిస్తాడు. అందుకే ఈ రోజున ( అక్టోబర్29) బంగారం కొంటారు. మరో కథ ప్రకారం.. విష్ణువు గుండెలపై ఎప్పుడూ లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటుంది. విష్ణుమూర్తిలో లక్ష్మీదేవి స్థానాన్ని.. భృగు మహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలో కొల్హాపూర్‌కు వచ్చిన రోజు.. ఆమె భూలోకానికి వచ్చినరోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెబుతున్నారు.
అక్టోబర్ 30 ..2 వ రోజు.. నరక చతుర్దశి .. ఛోటీ దీపావళి: ధన త్రయోదశి తర్వాత, ఛోటీ దీపావళిని జరుపుకుంటారు. దీన్నే నరక చతుర్ధశిగా పిలుస్తారు. నరకాసురిడిని సంహరించిన సందర్భంగా ఇది జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజించే సంప్రదాయం ఉంది. ఈ ఏడాది ఛోటీ దీపావళి అక్టోబర్ 30న వచ్చింది.ఈరోజు ప్రతి ఒక్కరూ తలస్నానం ఆచరించి కొత్త బట్టలు ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. . లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.
అక్టోబర్ 31... 3 వ రోజు... దీపావళి అమావాస్య : త్రేతాయుగంలో శ్రీరాముడు సీతతో కలిసి అయోధ్యకు ప్రయాణం చేసిన రోజు దీపావళి. .. ద్వాపరయుగ ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన రోజు దీపావళిగా మన పురాణాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ 31 న కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది. లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో.. ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్ముతుంటారు. దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవి ఆరాధన చేసేవారికి సకల సంపదలు సిద్ధిస్తాయని శాస్త్ర వచనం.
నవంబర్ 1... 4వ రోజు... బలి పాడ్యమి .. గోవర్దన పూజ..దీపావళి మర్నాడు బలిపాడ్యమి... చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును నవ దివస్ గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే. ఈ సంవత్సరం గోవర్ధన్ పూజ నవంబర్ 1శుక్రవారం వచ్చింది. దీన్ని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అన్నకూట్ అని కూడా అంటారు. గోవర్ధన పూజ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఒక వేలితో ఎత్తాడని చెబుతారు.
నవంబర్ 2.... 5వ రోజు భాయ్ పూజ : గోవర్థన పూజ జరిగిన మరుసటి రోజు భాయ్ దూజ్ జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు తిలకం వేసి రాఖీ కడతారు. ప్రతిగా సోదరులు తమ సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. మగవారు అక్కాచెల్లెళ్ల చేతి భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయి. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది.
కుమారుడు యముడు, అతడి సోదరి యమి(యమున). ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది..