ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఎఎస్ డీ)పై సమాజంలో చాలా అపోహలు, తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. దానిపై సరైన అవగాహన లేకపోవడంతో చదువుకున్న వాళ్లు కూడా దాన్నొక సైకలాజికల్ కండీషన్, మెంటల్ డిజార్డర్‌గా పొరబడుతున్నారు. గత ఐదారేండ్లుగా మన దేశంలో దాని విస్తృతి పెరుగుతుండటంతో అదొక న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్ గా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. నిరుపేదల నుంచి లక్షాధికారుల వరకు, అన్ని సామాజిక వర్గాల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఎఎస్ డీ) ఏటికేడు చాలా వేగంగా పెరుగుతున్నది. మెదడులోని న్యూరాన్ల మార్పు లేదా రాంగ్కనెక్షన్స్ కారణంగా ఆటిజం పిల్లలు విభిన్నంగా వ్యవహరిస్తారు. ఇది న్యూరోటైపికల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రోటోకాల్‌ను పోలి ఉండదు. నేర్చుకోవడం, అనుకరించడంలో వారు అసలేమాత్రం ఇంట్రెస్ట్ చూపించరు. అలాగే మేధోపరంగా, శారీరక సామర్థ్యాల సాధనలో ముఖ్యమైన మైల్స్టోన్లను సాధించేందుకు అవసరమైన ప్రీరిక్విజిట్ లు ఈ చిన్నారుల్లో చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల వారు మాట్లాడటం సహా వారి సొంత అవసరాలు తీర్చుకునే కనీస స్కిల్స్‌ను కూడా సాధించలేరు. సరైన తోడ్పాటు, శిక్షణ లభించకపోతే వీరిలో డెవలప్‌మెంట్, గ్రోత్ లోపిస్తుంది.
ముందే గుర్తిస్తే బయటపడేయొచ్చు
తొలినాళ్లలోనే ఆటిజం లక్షణాలు గుర్తించి అవసరమైన థెరపీలు, ప్రణాళికాబద్ధమైన తోడ్పాటును నిరంతరం అందిస్తే, బాధిత పిల్లల మెదడులోని న్యూరాన్‌ల మధ్య కొత్త కనెక్షన్లు క్రియేట్ అవుతాయి. దీన్ని ‘న్యూరోప్లాస్టిసిటీ’ అని అంటారు. ఇది పిల్లలు 3 ఏండ్లు వచ్చే వరకు గరిష్టంగా ఉంటుంది. ఈ గోల్డెన్ పీరియడ్‌ను తల్లిదండ్రులు సమర్థంగా ఉపయోగించుకోవాలి.ఆటిజంను గుర్తించడంలో,ఎర్లీ ఇంటర్వెన్షన్ అందివ్వడంలో తల్లిదండ్రులు ఆలస్యం చేయొద్దు. సోషలైజేషన్ లేకపోవడం, మాట్లాడకపోవడం, ఇతరులతో కలవకపోవడం లాంటి ‘ఆటిజం రిస్క్’ను పెంచే ప్రాథమిక లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎక్స్పర్ట్స్ ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు పిల్లలకు, చికిత్స, థెరపీలు, తోడ్పాటు అందించాలి.
తొలిదశలో కనిపించే లక్షణాలు..
శిశువు(3 నుంచి 4 నెలలు) తిరుగుతున్న ఫ్యాన్, లైట్, ఆకాశం లేదా గాలికి ఊగే కొమ్మలు, ఆకులు మొదలైన వాటి వైపు తదేకంగా చూస్తున్నప్పుడు, తల్లిదండ్రులు దగ్గరికి వెళ్లినా వారి వైపు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. పిల్లలు చేతి వేళ్లను చూస్తూ ఎక్కువసేపు ఆడుతుంటారు. ఇలాంటప్పుడు తల్లిదండ్రులు వారు వేళ్లను లెక్కించే ప్రయత్నం చేస్తున్నారని పొరబడుతుంటారు. ఏడెనిమిది నెలల వయసులో కొత్త వాళ్లు, బయటి వ్యక్తులు ఎత్తుకున్నప్పుడు ఏడవకుండా, ఎలాంటి బెరుకు లేకుండా ఉంటే, పిల్లలు అందరితో ఫ్రెండ్లీగా, కలుపుగోలుగా ఉన్నట్లుని భావిస్తుంటారు. అయితే దీన్ని ‘స్ట్రెంజర్యాగ్జైటీ’ లేకపోవడం అంటారు. వస్తువులు, జంతువులు, రంగులు, అంకెలపై ఎక్కువ ఇష్టం చూపడం వారి వ్యక్తిత్వంగా పరిగణించబడుతుంది. నిద్ర నుంచి లేవగానే ఏడవకుండా, సైలెంట్‌గా ఆడుకుంటారు. దీన్ని చూసి చిన్నారి ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా తనంతట తానే ఆడుకుంటున్నట్లు భావిస్తారు. మూడునాలుగు నెలల వయసులో తల్లిదండ్రులు సహా ఇతరుల ముఖాలు చూసి నవ్వకపోవడం, కుటుంబ సభ్యులు, ఇతరుల కళ్లలోకి చూడకుండా ఉండటం వంటి లక్షణాలుంటే.. పిల్లలు ఆ తర్వాత ఎదుగుదలకు అవసరమైన విషయాలు నేర్చుకోలేరు.
తల్లిదండ్రులే బెస్ట్ థెరపిస్టులు
పిల్లలు, పెద్దల డెవలప్‌మెంట్ ఎప్పుడూ గత అనుభవం మీద ఆధారపడి ఉంటుంది. శిశువు ప్రతి ఎదుగుదల వారి వయసు ప్రకారం జరగట్లేదంటే వారి మెదడులోని న్యూరానల్ కనెక్టివిటీ అభివృద్ధిలో ఏదో తేడా జరిగినట్లు అర్థం చేసుకోవాలి. ఇలాంటి పిల్లలు చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిసరాలతో సరిగా కనెక్ట్ కారు. ఆటిజం పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి తల్లిదండ్రులను మించిన థెరపిస్టులు ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే ఇది నిరంతరాయంగా (రౌండ్ ది క్లాక్) జరగాల్సిన ప్రక్రియ. రెగ్యులర్‌గా కచ్చితమైన కమ్యూనికేషన్, అర్థవంతమైన ఆటలు, కార్యకలాపాల్లో నిరంతరం వారిని ఎంగేజ్ చేయడం ద్వారా తల్లిదండ్రులు తమ చిన్నారిని ఆటిజం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. అలా చేయడం వల్ల మీరు క్రమంగా మీ పిల్లలకు నేర్చుకోవడంపై ఆసక్తిని, ఇష్టాన్ని పెంచగలరు. వారు నేర్చుకోవడాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టిన
తర్వాత తన లోకంలో తనే ఉండే లక్షణం నెమ్మదిగా తగ్గుతుంది.
–డా. ఆర్ టీ. రాజేశ్వరీ,క్రాస్డిజబిలిటి ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, నిపిడ్