కమలంతో సిక్కిం బంధం

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు నార్త్​ ఈస్ట్రన్​ రాష్టాల్లో బీజేపీ నేరుగానో, మిత్రపక్షాలతో సంకీర్ణంగానో ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఈ లిస్టులోకి సిక్కింకూడా చేరబోతోంది. ప్రతిపక్షం నుంచి 10 మంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. మరో మూడు సీట్లకు బై ఎలక్షన్ జరగాల్సి ఉంది. ఈ మూడింటినీ గనుక గెలిస్తే… బీజేపీ బలం 13కి చేరుతుంది. అయిదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్​లో ఒక్క సీటునూ దక్కించుకోలేని బీజేపీ ఇప్పుడు 10 ఎమ్మెల్యేలతో మెయిన్​ అపోజిషన్​గా అవతరించింది. నేపాల్​, భూటాన్​, చైనా దేశాల సరిహద్దుల్లోని సిక్కిం రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేయాలన్న కోరిక త్వరలోనే తీరనుందంటున్నారు ఎనలిస్టులు.

 

సిక్కింలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీ నాలుగు నెలలు గడిచేసరికి ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదిగింది. సిక్కిం అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 32. లేటెస్ట్ ఎన్నికల్లో ‘ సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్కేఎం) 17 సీట్లలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టింది. మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ నాయకత్వంలోని ‘సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) 15 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షంగా అవతరించింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కలేదు.

డెమొక్రటిక్ ఫ్రంట్​కి దెబ్బ మీద దెబ్బ

వరుసగా అయిదుసార్లు అధికారం దక్కించుకున్న సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్​కి ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ తగిలింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి అపోజిషన్​లో కూర్చుంది. ఎన్నికల తర్వాత గెలిచిన 15 మందిలో ఇద్దరు రెండేసి స్థానాల్లో గెలవడంతో నికరంగా 13మందే గెలిచినట్లయ్యింది. రెండు సీట్లకు బైఎలక్షన్​ జరగాల్సి ఉంది. కాగా, ఎస్డీఎఫ్​కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికే మూడొంతులు డీలా పడ్డ ఎస్డీఎఫ్​కి మరో  దెబ్బ తగిలింది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జి.టి.ధుంగెల్, ప్రసాద్ శర్మ  బుధవారం అధికార పార్టీ ‘సిక్కిం క్రాంతికారీ మోర్చా’లోకి జంప్ చేశారు. దీంతో  అసెంబ్లీలో ఎస్డీఎఫ్ బలం ఒకటికి పడిపోయింది. ఆ ఒక్కరు రికార్డులకెక్కిన మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత అపోజిషన్​ లీడర్​ పవన్ కుమార్ చామ్లింగ్. సిక్కిం పాలిటిక్స్​లో ఇదొక విచిత్రమైన పరిస్థితి.

మూడు సీట్లకు త్వరలో బై ఎలక్షన్స్

ఎస్కేఎం నుంచి ఒక్కరు, ఎస్డీఎఫ్​ నుంచి ఇద్దరు రెండేసి సీట్లకు పోటీ చేసి గెలిచారు. వీరు అదనపు సీట్లకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ సీట్లకు త్వరలో బై ఎలక్షన్స్ జరిగే అవకాశాలున్నాయి. ఈ మూడు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటే అసెంబ్లీలో ఆ పార్టీ బలం 13కు పెరుగుతుంది. సిక్కింలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 17. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చాలా దగ్గరగా వచ్చినట్లే. బీజేపీ లీడర్ల ఉత్సాహం చూస్తుంటే త్వరలోనే సిక్కింలో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయంటున్నారు ఎనలిస్టులు.

సిక్కిం పై  బీజేపీ స్పెషల్ ఫోకస్

2002లో లుక్​ ఈస్ట్​ కనెక్టివిటీ ప్రాజెక్ట్​ల​ స్కీమ్​ కింద సిక్కింని కూడా నార్త్​ ఈస్ట్​ రాష్ట్రంగా గుర్తించారు. 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ నామమాత్రంగా ఉండేది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండేవి. కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వాలు ఉన్నా అక్కడ కూడా కాంగ్రెస్​దే మెయిన్ రోల్​గా ఉండేది. 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక నార్త్ ఈస్ట్రన్ రాష్ట్రాలపై  ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఒక్క సిక్కిం మినహా దాదాపుగా అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ సొంత ప్రభుత్వాలు  లేదా బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉన్న  కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సిక్కింలో బలోపేతం కావడంపై బీజేపీ దృష్టి పెట్టింది. లేటెస్ట్ గా నాలుగు రోజుల కిందట ఆ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లి  బీజేపీ లో చేరారు. దీంతో అసెంబ్లీలో  బీజేపీ బలం 10కి పెరిగింది. అంతేకాదు బీజేపీయే ప్రధాన ప్రతిపక్షంగా మారింది.  అసెంబ్లీలో  తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు చెప్పారు. 10 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా పార్టీలో చేరడంతో  సిక్కిం బీజేపీలో జోష్ పెరిగింది. సిక్కింలో బీజేపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తామని ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఒకరైన దోర్జీ లెప్చా చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికోసం ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించిన పథకాల పట్ల సిక్కిం ప్రజలు హ్యాపీగా ఉన్నారని ఆయన చెప్పారు.

23 ఏళ్లకు పైగా సీఎం కుర్చీలో చామ్లింగ్

మన దేశంలో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు అప్పటి సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ దే. పశ్చిమ బెంగాల్​కి జ్యోతి బసు 23 ఏళ్ల పాటు సీఎంగా పనిచేస్తే,  సిక్కిం సీఎంగా చామ్లింగ్ 23 ఏళ్ల నాలుగు నెలల పాటు పనిచేశారు.  1993 మార్చిలో ఆయన సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. 1994 నుంచి వరుసగా 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లోనూ డెమొక్రటిక్ ఫ్రంట్​కే  సిక్కిం ప్రజలు పట్టం కట్టారు. 2004 ఎన్నికల్లో 32 సీట్లలో 31 సీట్లను ఫ్రంట్ గెలుచుకోగా, 2009 ఎన్నికల్లో మొత్తం 32 సీట్లను ఎస్డీఎఫ్​యే కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, చామ్లింగ్ గద్దె దిగాల్సి వచ్చింది.

నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్​లో ఎస్డీఎఫ్

2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ప్రత్యేకంగా బీజేపీ లీడర్ హిమంత బిశ్వ శర్మ కన్వీనర్​గా ‘నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్ఈడీఏ)’ని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అలయెన్స్​లో సభ్యులు. ఆ విధంగా అప్పటి సిక్కిం అధికార పార్టీ  డెమొక్రటిక్ ఫ్రంట్ ఎన్​ఈడీఏలో మెంబర్ అయింది