సైలెంట్ వ్యాలీ ఉద్యమం కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో జల విద్యుత్ కేంద్రాన్ని స్థాపనకు ప్రభుత్వం ప్రయత్నించడం ఇందుకు కారణం. సైలెంట్ వ్యాలీ రక్షణ కోసం 1973లో ఉద్యమం ప్రారంభమైంది.
కారణాలు: సైలెంట్ వ్యాలీలో ప్రవహించే ప్రముఖ నది కుంతీ పూజ. సైరంధ్రీ అనే ప్రాంతం జల విద్యుత్ కేంద్ర స్థాపనకు అనువుగా ఉందని 1982లో గుర్తించారు. స్వాతంత్ర్యానంతరం 120 మెగావాట్ల జల విద్యుత్ కేంద్ర నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి కేరళ ప్రభుత్వ ఎలక్ర్టిసిటీ బోర్డు ప్రయత్నించింది. ప్రాజెక్టు నిర్మాణంతో ఈ ప్రాంతంలో నివసించే అరుదైన సింహపు తోక మకావ్‌లు అంతరించే ప్రమాదం ఉందని రోములస్ విట్టేకర్ మొదట చైతన్యం కలిగించారు. 1977లో కేరళ అటవీ పరిశోధనా సంస్థ సైలెంట్ వ్యాలీలో ఈ డ్యామ్ నిర్మాణ ప్రభావంపై అధ్యయనం చేసి ఈ ఏరియాను జీవ సంరక్షణ ప్రాంతంగా ప్రకటించమని అభిప్రాయపడింది.
నాయకత్వం: ఈ ఉద్యమంలో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ కీలకంగా వ్యవహరించింది. సుగతకుమారి అనే రచయిత్రి ప్రముఖ పాత్ర వహించారు. ఈమె మరతిను స్తుతి అనే గేయాన్ని రాసింది. ఈ గేయం సైలెంట్ వ్యాలీ రక్షణ ఉద్యమం జరిగిన ప్రతీ ప్రాంతంలో ప్రారంభగీతంగా ఆలపించేవారు. గ్రామంలో చిన్న సమూహాలతో ప్రారంభమైన ఈ ఉద్యమం జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందింది. దేశంలోని ప్రముఖ వ్యక్తులు సలీంఅలీ, స్వామినాథన్, మాధవ్ గాడ్గిల్, సీతారాం కేసరి, సి.వి.రాధాకృష్ణన్, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణకాంత్ మొదలైన వారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ ఈ ప్రాజెక్టును నిలిపివేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ కేరళ, తమిళనాడు అటవీ ప్రాంతాలను కలిపి నేషనల్ రెయిన్ ఫారెస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్‌గా మార్చమని ప్రభుత్వానికి విన్నవించారు. 1984 నవంబర్ 15న సైలెంట్ వ్యాలీ ప్రాంత అడవులు మొత్తం నేషనల్ పార్క్‌గా ప్రకటించబడ్డాయి. 1985 సెప్టెంబర్ 7న సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ను ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారు. 1986లో దీన్ని నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్‌లో అంతర్భాగం చేశారు. జంగిల్ బచావ్ ఉద్యమం: ఈ ఉద్యమం మొదట జార్ఖండ్‌లో సింగ్భం జిల్లాలో సహజ సాల్ వృక్షాల అడవుల్లో వాణిజ్య టేకు వృక్షాలను పెంచాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ప్రారంభమైంది. ఈ ఉద్యమం ఒరిస్సా, బిహార్లకూ విస్తరించింది. 2006లో చేసిన అటవీ హక్కుల చట్టం అడవుల్లో నివసించేవారి హక్కులను గుర్తించి, అటవీ నిర్వహణకు అవకాశం కల్పించింది. చాలా మంది గిరిజనులకు తమకున్న హక్కులు తెలియవు. అందుకే ఆదివాసీలు సభ్యులుగా ఒక సంస్థ ఏర్పడింది. ఇందులో మొత్తం 48 మంది సభ్యుల్లో ఇద్దరు మాత్రమే గిరిజనేతరులు. ఈ సంస్థను గిరిజన తెగలకు మేలు చేసే ఆదివాసీలు నిర్వహిస్తున్నారు. ఇందులో గిరిజనుల భాష మాత్రమే వాడుతున్నారు. సర్జామ్ సకావ్ అనే పత్రికను రెండు గిరిజన భాషల్లో, హిందీలో నిర్వహిస్తున్నారు. ఈ ఉద్యమ ముఖ్యోద్దేశం అటవీ సంరక్షణ, అడవులపై సంప్రదాయ, చట్టబద్ద గిరిజనుల హక్కులు నెరవేరేలా చూడటం, 2006 భారత అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలు జరిగేలా చూడటం, ఇందుకోసం గిరిజనులను చైతన్యవంతులను చేయడం, గ్రామ సభలు నిర్వహించడం మొదలైన పనులు చేపడుతున్నారు. అడవుల్లో నివసించడం, అటవీ భూమల్లో వ్యవసాయం చేయడమే కాక అటవీ సంపదను న్యాయబద్ధంగా వాడుకునేలా గిరిజనుల్లో చైతన్యం కలిగిస్తున్నారు.
అప్పికో ఉద్యమం
ఈ ఉద్యమం ఉత్తర కన్నడ జిల్లాలో 1983, సెప్టెంబర్ 8న ప్రారంభమైంది. అప్పికో ఉద్యమాన్ని పాండురంగ హెగ్డే ప్రారంభించారు. హత్తుకోవడాన్ని కన్నడ భాషలో అప్పికో అంటారు. తూర్పు కనుమలలో ఉన్న ప్రాంతాల అడవుల రక్షణ కూడా ఈ ఉద్యమం లక్ష్యంగా పెట్టుకొంది. అయితే ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయిన, ఎండిపోతున్న, చనిపోయిన చెట్ల నరికివేతకు అనుమతి ఇచ్చింది. స్థానిక అవసరాలకు వీటిని వాడుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పికో ఉద్యమం మిగిలి ఉన్న అడవులను రక్షించాలి, పచ్చదనాన్ని పునరుద్ధరించాలి, అడవులపై ఒత్తిడి తగ్గించడానికి హేతుబద్దంగా అడవులను వాడాలి అనే లక్ష్యాలను పాటించాలని నిర్ణయించింది. ఈ ప్రజా చైతన్యం ఫలితంగా తూర్పు, పశ్చిమ కనుమల రక్షణకు ఎన్నో యువ మండలాలు ఏర్పడ్డాయి. వీరు 1984–85 నుంచి అటవీశాఖ సహాయంతో నర్సరీలను స్థాపించి 1.2 మిలియన్ మొక్కలను పంపిణీ చేశారు. బంజరు భూముల్లో చెట్ల పెంపకం ప్రారంభించారు. పర్యావరణాన్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోవడం, గాలి, నీరు కలుషితం కావడం, అడవుల నరికివేత వల్ల దుష్పరిణామాలు తలెత్తాయి. ఈ ప్రభావాలను గుర్తించిన పౌర సమాజం పర్యావరణ పరిరక్షణకు కృషి మొదలు పెట్టింది. స్వాతంత్ర్యానంతరం దేశంలో భారీ పరిశ్రమలకు, నీటి పారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పర్యావరణ సమస్యలు, ఉద్యమాలు మొదలయ్యాయి. మానవ మనుగడ, సహజ వనరులను కాపాడటం, ప్రజల మౌలిక అవసరాలు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి.
చిప్కో ఉద్యమం
గాంధీ సిద్ధాంతమైన అహింసా మార్గంలో జరిగిన పర్యావరణ ఉద్యమం ఇది. చిప్కో అంటే చెట్లను హత్తుకోవడం. వృక్షాలను నరికివేయకుండా చెట్లకు, గోడ్డలికి మధ్య ఉద్యమకారులు ఉంటారు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా చెట్లను కాపాడటమే ఈ ఉద్యమ లక్ష్యం. ఇది 1973, ఏప్రిల్‌లో హిమాలయ ప్రాంతం(ఉత్తరాఖండ్) లో ప్రారంభమైంది. కాంట్రాక్టర్లు చెట్లను నరికివేయకుండా గిరిజన స్త్రీలు చెట్లను కౌగిలించుకొని నిద్రలేని రాత్రులను గడిపారు. ఉద్యమ నాయకత్వం సరళాబెన్, మీరాబెన్, చండీ ప్రసాద్ భట్, సుందర్‌లాల్ బహుగుణ మొదలైన వారంతా ఈ ఉద్యమాన్ని నడిపారు. చిప్కో ఉద్యమంలో ప్రముఖ నాయకుడు సుందర్‌లాల్ బహుగుణ. 1974, మార్చిలో గౌరీదేవి నాయకత్వంలో 27మంది గిరిజన యువతులు చెట్ల నరికివేతను అడ్డుకున్నారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో జరిగింది. వీరు 2500 చెట్లను నరకకుండా కాపాడారు. 1977ల్లో నరేంద్రనగర్ అటవీ ప్రాంతం వేలం వేసినప్పుడు బచీనీదేవి అనే స్త్రీ నాయకత్వంలో గిరిజనులు చెట్లను నరకకుండా రాత్రి, పగలు కాపలా కాశారు. హిమాలయ ప్రాంతంలోని గిరిజనులను చైతన్యవంతం చేయడానికి సుందర్‌లాల్ బహుగుణ ప్రయత్నించారు. 1981లో కశ్మీర్ నుంచి కోహిమా వరకు పాదయాత్ర చేశారు. తెహ్రీ, గడ్వాల్, డవాన్ లోయల్లో సున్నపుబట్టీల ఏర్పాటు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. 1989 నుంచి హిమాలయ ప్రాంతంలో డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా ఎన్నో నిరాహార దీక్షలు చేశారు. ఈ ఉద్యమంలో మరో ప్రముఖ నాయకుడు చండీ ప్రసాద్ భట్. భావితరాలకు నష్టం కలగకుండా తమ జీవనోపాధి పొందడానికి చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రాముఖ్యత ఇవ్వాలి.