- ఆలయంలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు
అలంపూర్, వెలుగు: రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతోన్న జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవార్లకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈవో పురేందర్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పట్టు వస్త్రాలను అర్చకులకు అందజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సంకల్పం చేయించి పూజలు జరిపించారు. మంత్రితో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి ప్రసాద్ స్కీం పనులను పరిశీలించి, భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
గత ప్రభుత్వం ఆలయాలను పట్టించుకోలే..
కృష్ణ పుష్కరాల సందర్భంగా సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. హరిత హోటల్లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శక్తి పీఠం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. వరంగల్ లోని రామప్ప, వేయి స్తంభాల గుడి మాదిరిగా ఈ ఆలయాలు కూడా ప్రాచీనమైనవని, కేంద్ర పురావస్తు శాఖ అధికారులతో చర్చించి అభివృద్ధి చేస్తామన్నారు.
సీఎంను అలంపూర్ కు తీసుకువచ్చి ఆలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. నాగార్జున ఫ్యామిలీ కేసు ఎంతవరకు వచ్చిందని మీడియా అడగగా, ఆ కేసు ఎప్పుడో అయిపోయిందని, కోర్టులో చూసుకుంటామని సమాధానం ఇచ్చారు.