కరీంనగర్ జిల్లాలో త్వరలో ఎల్ఎండీ, ఎంఎండీలో పూడికతీత పనులు

కరీంనగర్ జిల్లాలో త్వరలో ఎల్ఎండీ, ఎంఎండీలో పూడికతీత పనులు
  • కడెం ప్రాజెక్టుతో కలిపి రూ.1,439.55 కోట్ల వ్యయం 
  • ఎల్ఎండీలో 1.31 కోట్ల టన్నులు, మిడ్ మానేరులో 2.47 కోట్ల టన్నుల పూడికతీత 
  • కాంట్రాక్ట్ దక్కించుకున్న ముంబై  కంపెనీ  
  • పని పూర్తవ్వడానికి 20 ఏళ్లు పడుతుందని అంచనా 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్ తోపాటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టులో సిల్ట్(పూడిక) తీసే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రిజర్వాయర్లలో పేరుకుపోయిన బురదను తొలగించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ మూడు రిజర్వాయర్లను ఎంపిక చేసింది. రూ.1,439.55 కోట్లతో చేపట్టబోయే ఈ పనులను ముంబయికి చెందిన కంపెనీ దక్కించుకున్నట్లు తెలిసింది.  ఎల్ఎండీలో నుంచి సుమారు 1.31 కోట్ల టన్నులు, మిడ్ మానేరు నుంచి 2.47 కోట్ల  టన్నులు, కడెం ప్రాజెక్ట్ నుంచి 1.31 కోట్ల టన్నులు సిల్ట్ ను తొలగించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. 

నెల రోజుల్లో ఎల్ఎండీలో పనులు.. 

నెల రోజుల్లో తొలుత లోయర్ మానేరు డ్యామ్ లో పూడికతీత పనులు ప్రారంభం కానున్నట్లు ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే మిగతా ప్రాజెక్టుల్లోనూ సిల్ట్ ను తొలగించే పనులు చేపట్టనున్నారు. నీళ్లలో నుంచే బురద, వ్యర్థాలను తొలగించే హైడ్రో -సైక్లోన్ పద్ధతిని అవలంభించబోతున్నారు. వచ్చే 20 ఏళ్లలో ఈ మూడు ప్రాజెక్టుల నుంచి సుమారు 4 కోట్ల టన్నుల సిల్ట్ ను తొలగిస్తారని అంచనా వేస్తున్నారు.  పూడికలో సుమారు 25 శాతం ఇసుక ఉంటుందని అంచనా. 

ఈ ఇసుకను టన్నుకు రూ.406.64 చొప్పున పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ప్రభుత్వానికి అమ్మాలని అగ్రిమెంట్ లో పేర్కొన్నట్లు తెలిసింది. లోయర్ మానేరు డ్యామ్ కు సంబంధించిన సిల్ట్ ను తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ భూముల్లో డంప్ చేయబోతున్నారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీ పూర్తి స్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు డెడ్ స్టోరేజీ 2.6 టీఎంసీగా ఉండేది. కానీ ప్రస్తుతం డెడ్ స్టోరేజీ 1.9 టీఎంసీలకే పరిమితమైంది. పూడికతీత తర్వాత డెడ్ స్టోరేజీ 3.9 టీఎంసీలకు పెరిగే అవకాశముందని ఇరిగేషన్ ఆఫీసర్లు 
అంచనా వేస్తున్నారు. 

కేంద్రం సాయమందించేనా ? 

రిజర్వాయర్లలో పూడికతీతకు చేస్తున్న ఖర్చు భారీగా ఉండడంతో నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నదులు, ప్రాజెక్టులు, జలవనరుల పునురుజ్జీవం కోసం రిపేర్, రినోవేషన్, రిస్టోరేషన్ (ఆర్ఆర్ఆర్) స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రిజర్వాయర్లలో పూడికతీతకు సాయం అందించే అవకాశముంది. కేంద్ర నిధులతో ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో నదుల్లో పూడికతీత పనులు నడుస్తున్నాయి.