ఉపాధిహామీ పనుల్లో బయటపడిన వెండి నాణేలు

ఉపాధిహామీ పనుల్లో బయటపడిన వెండి నాణేలు
  •  సిద్దిపేట జిల్లా నర్సాయపల్లిలో ఘటన

చేర్యాల, వెలుగు: ఉపాధి హామీ కూలీలకు వెండి నాణేల బాక్స్​దొరికింది. గురువారం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు రోజులాగే గ్రామంలోని సల్ల మల్లారెడ్డికి చెందిన భూమిలో చదును పనులు చేస్తుండగా రాయితో చేసిన బాక్స్ పారకు తగిలింది. మొదట దానిని తెరిచేందుకు కూలీలు భయపడ్డారు.

అనంతరం ఎలాగోలా తెరిచిచూడగా.. అందులో 228 గ్రాముల 20 వెండి నాణేలు, 2 ఉంగరాలు కనిపించాయి. నాణేలపై అరబిక్​ భాషలో అక్షరాలు ఉన్నాయి. అవి నాలుగు వందల సంవత్సరాల క్రితం అసఫ్​జాయి కాలంలో చలామణిలో ఉన్న నాణేలుగా తెలిసింది. వాటిని చూసేందుకు గ్రామానికి చెందిన ప్రజలు ఎగబడ్డారు. దీంతో ఈ విషయం కాస్తా సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో అధికారుల దృష్టికి వెళ్లింది.

విషయం తెలుసుకున్న చేర్యాల సీఐ ఎల్ శ్రీను, మద్దూరు తహసీల్దార్ స్పాట్​కు చేరుకొని​పంచనామా నిర్వహించారు. తొలుత గ్రామానికి చెందిన స్వర్ణకారుడిని పిలిపించి చెక్​ చేయించారు. అవి వెండి నాణేలని గుర్తించిన అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటిని కలెక్టర్​కు పంపిస్తామని, ఆ తర్వాత ఆర్కియాలజీ డిపార్ట్​మెంట్​కు తీసుకెళ్లి వివరాలు అందజేస్తామని సీఐ శ్రీను తెలిపారు.