హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం రామ కృష్ణ మఠం. ప్రభుత్వం గుర్తింపు పొందిన సేవా సంస్థ దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆధ్యాత్మిక సేవలను అందిస్తోన్న హైదరాబాద్ లోని రామ కృష్ణ మఠంలో ఈ ఏడాది జులై 27న స్వర్ణోత్సవాలు జరుగనున్నాయి.
రామకృష్ణ మఠం స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 27న (శనివారం) "భారతదేశం విద్యా విజన్ మరియు విద్యావేత్తల పాత్ర"పై జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. సదస్సుకు వివిధ విద్యాసంస్థలకు చెందిన వెయ్యి మందికి పైగా ఉపాధ్యాయులు, పలువురు విద్యావేత్తలు హాజరుకానున్నారని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తెలంగాణ డైరెక్టర్ డాక్టర్ బి.ఎస్. మూర్తి హాజరుకానున్నారు. ప్రత్యేక ఉపన్యాసం స్వామి ముక్తిదానంద ఇవ్వనున్నారని స్వామి బోధమయానంద తెలిపారు. జూలై 28 (ఆదివారం) హాఫ్-డే Spiritual రిట్రీట్ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. స్వర్ణోత్సవ వేడుకల్లో విద్యార్థులు, భక్తులు పాల్గొని మూర్తి త్రయం కృప పొందాలని బోధమయానంద కోరారు.
రామకృష్ణ మఠానికి అనుబంధ సంస్థగా రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు స్వామివికానంద రామకృష్ణ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ జంట సంస్థలు ప్రజలకు అనేక సేవలను అందిస్తున్నాయి. విద్య వైద్య సేవలతో పాటు భాషా నైపుణ్యాన్ని పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం, ఆధ్యాత్మిక చింతనతో కూడిన పుస్తకాల ప్రచురణ, మానవ వికాస కేంద్రం నిర్వహణ, గ్రామ సంక్షేమం వంటి విభిన్న కార్యక్రమాలతో ప్రజలకు ఎనలేని సేవలందిస్తోంది.