సింహాచలం గిరి ప్రదక్షిణ.... అప్పన్న ఆలయం చుట్టూ భక్తజన సందోహం

ప్రతీ ఏటా సింహాచలం వద్ద జరిగే గిరి ప్రదక్షిణ భక్తులకు ఎంతో ముఖ్యమైనది. విశాఖలో 32 కిలో మీటర్ల పొడవున వ్యాపించి ఉన్న సింహాచలం కొండ చుట్టూ భక్తులు ఎంతో  భక్తి శ్రద్దలతో కాలినడకన ప్రదక్షిణలు చేసే కార్యక్రమమే గిరి ప్రదక్షిణ.  మొత్తం కొండా చుట్టూ అంటే 32 కిలోమీటర్ల దూరాన్ని పూర్తిచేసి వచ్చే భక్తులకు కొండపైన గల సింహాచలం క్షేత్ర ముఖ్య ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తారు . 

ఈసారి గిరి ప్రదక్షిణ కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ మధ్యలో భక్తులు రెస్ట్ తీసుకోవడానికి 29 స్టాళ్లు, తాత్కాలిక వైద్య శిబిరాలు 133, టాయిలెట్స్ 300,  108 వాహనాలు 7తో పాటు 30 ఉచిత బస్సులను అధికారులు సిద్ధంగా ఉంచారు . భక్తుల కోసం లక్ష లడ్డూలను సిద్ధం చేశారు. కొబ్బరి కాయలు కొట్టేందుకు ఏకంగా 30 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. సచివాలయ, జీవీఎంసీ ఉద్యోగులతోపాటు భక్తుల సౌకర్యార్ధం 40కి పైగా స్వచ్చంద సంస్థల ప్రతినిధులు వాలంటీర్లుగా గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కొండపై పరిస్థితిని ఈవో ఈవో త్రినాథరావు, ఇతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు . 

సింహాచలం రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు

గిరిప్రదక్షిణ సందర్భంగా సింహాచలం రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని వైజాగ్  కలెక్టర్ తెలిపారు . గోపాలపట్నం నుంచి వచ్చే వాహనాలను పాత గోశాల నుంచి అనుమతించేది లేదని అన్నారు. సింహాచలానికి రెండో వైపు నుంచి వాహనాలకు అడవివరం వద్ద పార్కింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే సముద్రంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందువల్ల జోడుగుళ్ళపాలెం వద్ద   భక్తులను సముద్ర స్నానాలకు అనుమతించేది లేదని చెప్పారు. అయినప్పటికీ, లుంబినీ పార్క్, తెన్నేటి పార్క్ వద్ద సముద్ర స్నానాలు చేసే భక్తుల కోసం మూడు NDRF బృందాలతోపాటు మెరైన్ పోలీస్ సిబ్బందినీ, గజ ఈతగాళ్లను నియమించినట్టు కలెక్టర్ చెప్పారు.

జులై 2 న ప్రారంభం

సింహాచలంలో భక్తుల గిరిప్రదక్షిణ రెండోరోజు కొనసాగుతోంది. ఆదివారం (జులై2) మధ్యాహ్నం నుండే ప్రారంభమైన గిరిప్రదక్షిణ సోమవారం(జులై3)  ఉదయం కూడా కొనసాగింది. ఆదివారం(జులై2)  మధ్యాహ్నం 2.30గంటలకు విశాఖ నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ, సింహాచలం దేవస్థానం ఈవో త్రినాథరావు జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. అడవివరం, హనుమంతవాకా, అప్పుఘర్‌ మార్గంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు.32 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ జరుగుతుంది. ప్రతిఏటా ఆషాఢ శుద్ధ చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో సింహాచలంలో గిరిప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ALSO READ:రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలు.. చిన్న ప్యాక్ లపైనే అందరి దృష్టి

గోవింద నామస్మరణ

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు గిరి ప్రదక్షిణను కొనసాగించారు. సోమవారం (జులై3) ఉదయానికి సింహాచలం పరిసర ప్రాంతాలు భక్తజన సందోహాన్ని తలపించాయి. గోవింద నామస్మరణతో సింహాచల రహదారులు మారుమ్రోగుతున్నాయి. కనుచూపుమేరలో ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు కనిపించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా.. తెలుగు రాష్ట్రాలు, ఒడిశా నుంచి కూడా భక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొనేందుకు వచ్చారు. గిరిప్రదక్షిణ చేస్తున్న భక్తులకు జీవీఎంసీతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లను అందిస్తున్నాయి.