
సింహాచలం దుర్ఘటన మృతుల వివరాలు తరచి చూస్తే ఒక్కొక్కరిదీ ఒక్క విషాద గాథ. మంగళవారం (ఏప్రిల్ 29) తెల్లవారుజామున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో గోడ కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక సాఫ్ట్ వేర్ జంట కూడా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ దైవ దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లడం ఆ కుటంబాల్లో పూడ్చలేని లోటుగా మిగిలింది.
హైదరాబాద్ లోని వేర్వేరు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. మూడేళ్ల క్రితమే వీరికి వివాహం అయ్యింది. ప్రస్తుతం ఇద్దరూ వైజాగ్ లోని ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రపాలెం కు చెందిన ఈ దంపతులలో మహేశ్ హెచ్సీఎల్ (HCL) కంపెనీలో వర్క్ చేస్తుండగా, శైలజ మైక్రోసాఫ్ట్ (Microsoft) కంపెనీలో పనిచేస్తోంది.
సింహాచల స్వామివారి దర్శనం కోసం అందరిలాగే వెళ్లారు ఈ దంపతులు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లో నిల్చుని ఉన్నారు. కాసేపైతే దైవ దర్శనం అయిపోతుంది.. అని ప్రశాంతంగా దేవుణ్ని తలచుకుంటూ లైన్లో నిల్చున్న వారికి విధి ఆడే నాటకం గురించి ఎలా తెలుస్తుంది. అనూహ్యంగా ఒక్క సారిగా మృత్యువు వచ్చి మీదపడినట్లుగా అక్కడున్న గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.
ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెం వాసులు ఈ ఘటన తో షాక్ కు గురయ్యారు.