విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రానికి వైశాఖ పౌర్ణమి, బుద్ద పూర్ణిమ సందర్భంగా గురువారం మే 23న భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి సందర్భంగా అప్పన్న స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి వారికి చందన సమర్పణ పూర్తిచేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి వారికి మేల్కొలుపు పలికారు. సుప్రభాత సేవలు నిర్వహించి, సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి సిద్ధం చేసిన శ్రీ గంధాన్ని స్వామికి సమర్పణ చేశారు.
స్వామి వారి నిజరూప దర్శనం కోసం, వైశాఖ పౌర్ణమి ఉత్సవం సందర్భంగా ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వరాహ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు సింహాచలం ఈవో తెలిపారు.