Simona Halep: అనుకున్నది సాధించాను.. టెన్నిస్‌కు మాజీ వరల్డ్ నెంబర్ 1 రిటైర్మెంట్

Simona Halep: అనుకున్నది సాధించాను.. టెన్నిస్‌కు మాజీ వరల్డ్ నెంబర్ 1 రిటైర్మెంట్

మాజీ వరల్డ్ నెంబర్ ప్లేయర్ సిమోనా హాలెప్ టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. మంగళవారం (ఫిబ్రవరి 4) తన స్వస్థలమైన రొమేనియాలో జరిగిన క్లజ్-నపోకా టోర్నమెంట్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలైన తర్వాత ఆటకు వీడ్కోలు పలికింది. 33 ఏళ్ల హాలెప్ ప్రపంచ 72వ ర్యాంక్ లూసియా బ్రాంజెట్టి చేతిలో 6-1, 6-1 తేడాతో చిత్తుగా ఓడింది.

రిటైర్మెంట్ తర్వాత మాట్లాడుతూ.. "నాకు బాధతో పాటు ఆనందంగా కూడా ఉంది. ప్రస్తుతం రెండు భావోద్వేగాలు నాలో నన్ను వెంటాడుతున్నాయి. చక్కగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకప్పటిలా అత్యుత్తమ స్థాయిలోకి రావడానికి నా శరీరం సహకరించదు. వీడ్కోలు చెప్పడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈ రోజు నా ప్రదర్శన బాగా లేకపోయినా నా కోసం మీరందరూ వచ్చినందుకు ధన్యావాదాలు". అని హాలెప్ ఎమోషనల్ అయింది. 

"నేను ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాను. గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాను. టెన్నిస్ ఆటలో నేను కోరుకున్నదంతా సాధించాను. నేను ఇప్పటికీ టెన్నిస్ ఆడగలను. కానీ ఒకప్పటిలా అత్యున్నత స్థాయిలో పోటీ పడటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది". అని హాలెప్ తన కెరీర్ గురించి మాట్లాడింది. హెలెప్ తన కెరీర్ లో రెండు గ్రాండ్ స్లామ్స్ గెలుచుకుంది. 2018 లో ఫ్రెంచ్ ఓపెన్.. 2019 లో వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ తన ఖాతాలో ఉన్నాయి. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫైయింగ్ నుండి వైదొలిగింది.