
ఈ ఒలింపిక్స్ టాప్ స్టార్లలో ముందున్న అమెరికా లెజెండరీ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ అంచనాలను అందుకుంటోంది. విమెన్స్ జిమ్నాస్టిక్స్ పోటీలను క్లీన్‌స్వీప్ చేసే దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే రెండు బంగారు పతకాలు గెలిచిన బైల్స్ తాజాగా మూడో స్వర్ణంతో తీన్‌మార్ కొట్టింది. శనివారం జరిగిన విమెన్స్ వాల్ట్ ఫైనల్లో 27 ఏండ్ల బైల్స్ 15.300 స్కోరుతో టాప్ ప్లేస్ సాధించింది. తన మార్కు యుర్చెంకో డబుల్ పైక్, చెంగ్ వాల్ట్ విన్యాసాలతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. బ్రెజిల్‌కు చెందిన రెబెకా ఆండ్రేడ్ రజతం, అమెరికా జిమ్నాస్ట్ జేడ్ కారీ కాంస్యం గెలిచారు.
పారిస్ గేమ్స్‌లో ఇప్పటికే విమెన్స్ టీమ్, ఆల్‌రౌండర్ ఈవెంట్లలో స్వర్ణాలు గెలిచిన బైల్స్.. ఒలింపిక్స్‌లో తన బంగారు పతకాల సంఖ్యను ఏడుకు పెంచుకుంది. రియో గేమ్స్‌లో టీమ్, ఆల్‌రౌండర్, వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్‌లో నాలుగు స్వర్ణాలు గెలిచిన సిమోన్ బ్యాలెన్స్ బీమ్‌లో కాంస్యంతో సరిపెట్టింది. ఈసారి మిగిలిన అన్‌ఈవెన్ బార్స్, ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్స్, బీమ్‌లోనూ చాంపియన్‌గా నిలిచి ఆరు స్వర్ణాలతో క్లీన్‌స్వీప్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది.