హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఆదివారం సాదాసీదాగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో భక్తు ల్లేకుండా.. అధికారులు, అర్చకుల సమక్షంలోనే ఉత్సవాలు నిర్వహించారు. ఏటా వైభవంగా సాగే జాతర మామూలుగా జరగడం ఇదే మొదటిసారి. ఆలయ అర్చకులు, ఈవో, కుల వృత్తుల వారు మాత్రమే పూజల్లో పాల్గొన్నారు. సురిటి అప్పయ్య కుటుంబీకులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. భక్తులకు అనుమతి లేకపోవడంతో చాలామంది సమీపంలోని ఇతర గుళ్లలో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
కొందరు ఇండ్లల్లోనే నైవేద్యం వండి పెట్టారు. మరోవైపు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఆరో పూజ నిర్వహించారు. పాతబస్తీలో పాతబస్తీలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి, మీరాలం మండి మహంకాళి, భాగ్యలక్ష్మి, ఉప్పుగూడ మహంకాళితోపాటు 27 పురాతన ఆలయాల్లో నిరాడంబరంగా ఘటాలు ప్రతిష్ఠించారు. ఉజ్జయిని బోనాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. లాల్ దర్వాజా బోనాలూ ఇదే తరహాలో ఉంటాయని చెప్పారు.