సాధారణ మెకానిక్ కొడుకు.. స్ట్రీట్ లైట్ సెన్సర్ తయారు చేశాడు

మట్టిలో మాణిక్యం.. ఓరుగల్లు బిడ్డ

స్ట్రీట్‌ లైట్స్‌ సెన్సర్‌ మేడ్‌ ఇన్‌ వరంగల్

టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఐఐటీ, ఐఐఎంలలో మాత్రమే పది మందికీ పనికొచ్చే ఇన్నొవేషన్స్ చేస్తారనుకుంటే అది ఒట్టి భ్రమే. మారుమూల పల్లెల్లో.. అంతెందుకు కొద్దో గొప్పో చదువుకున్న వాళ్లలో సైతం అద్భుతాలు సృష్టించే సత్తా ఉంటుందని నిరూపించాడు తెలంగాణకు చెందిన ముప్పారపు రాజు. నాన్న చేస్తున్న రిపేర్‌‌‌‌‌‌‌‌ పనులు చూస్తూ పెరిగి ఆ నాలెడ్జ్‌ తోనే ఇన్నొవేషన్స్‌‌‌‌ చేశాడు. .. వెన్నుతట్టి ప్రోత్సహించే వాళ్లు ఉంటే ఎన్నో కనిపెట్టొచ్చని చెప్తున్నాడు.

మారుమూల పల్లెల్లో టాలెంట్‌ కు కొదవ లేదని మరోసారి మన తెలంగాణ బిడ్డ నిరూపించాడు. నాన్న బతుకుదెరువు కోసం చేసే పనిపై పెంచుకున్న ఆసక్తి.. ఈ రోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా శభాష్ అనిపించుకునేలా చేసింది. ఒక మామూలు ఎలక్ట్రీషియన్ కొడుకు స్ట్రీట్ లైటింగ్ మీద సర్కారోళ్లకు లక్షల రూపాయల డబ్బు మిగిల్చి పెడుతున్నాడు. ఇదొక్కటే కాదు.. తన ఆలోచనలకు పదును పెట్టి పది మందికీ ఉపయోగపడే పరికరాలు బోలెడు తయారు చేశాడు.

ఒక మామూలు మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పుడు పగలు, రాత్రి తేడా లేకుండా రోజంతా లైట్లు వెలగడం గమనించి.. ఎందుకిలా కరెంట్ వేస్ట్ చేస్తున్నారని అనుకున్నాడు. వాటికి ఆన్, ఆఫ్ చేయడానికి స్విచ్‌ లు ఉండవని, ఒక్కసారి లైట్ పెడితే.. అది కాలిపోయే వరకు వెలుగుతూనే ఉండాల్సిందేనని తెలుసుకోవడానికి ఆయనకు కొంత టైమ్ పట్టిం ది. కుటుంబ పోషణ కోసం నాన్న చేసే రేడియో రిపేర్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ చూస్తూ పెరిగిన ఆ కుర్రాడు… అసలు ఈ స్ట్రీట్ లైట్లు రాత్రులు మాత్రమే వెలిగి, తెల్లా రగానే ఆరిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచన చేశాడు. పల్లెల్లో రోజంతా వెలుగుతూ కనిపించే స్ట్రీట్ లైట్లను ఆటోమేటిక్‌ గా ఆపేసే ‘న్యాచురల్ స్ట్రీట్ లైట్ స్విచ్’ కనిపెట్టాడు. రాత్రి చీకటి పడగానే ఆటోమేటిక్ ఆన్, పొద్దున తెల్లారే టైమ్‌‌కి ఆఫ్ అయ్యేలా డిజైన్ చేశాడు. ఆదే ఈ రోజు దాదాపు వందకు పైగా గ్రామ పంచాయతీల్లో బోలెడంత కరెంట్, క్యాష్ సేవ్ చేస్తోంది.

వరంగల్ రూరల్ జిల్లా నర్సం పేట నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే గోపాలపురం గ్రామంలో పుట్టి పెరిగిన ఈ రూరల్ ఇన్నొవేటర్ పేరు ముప్పారపు రాజు. లైట్ డిపెండెంట్ రెసి స్టర్ సహాయంతో పగలు సన్ లైట్‌‌ను గుర్తించి ఆటోమేటిక్‌ గా స్ట్రీట్ లైట్లు ఆన్, ఆఫ్ అయ్యే డివైజ్‌ ను తయారు చేశాడు. పగలు ఎండ లేకుండా మబ్బులు కమ్మేసినా ఇంటి లోపల చీకటిగా మారి లైట్ అవసరం అవుతుందే కానీ బయట దానితో పనిలేదు. నేచర్‌‌ అందించే వెలుతురు ఉంటుంది. దీనిని కూడా డిటెక్ట్ చేసి లైట్ ఆన్ కాకుండా కంట్రోల్ చేసేలా రాజు తన డివైజ్ డెవలప్ చేశాడు. సాయంత్రం సూర్యుడు అస్తమించాక మాత్రమే లైట్లు వెలిగేలా డిజైన్ చేశాడు. అందుకే ఈ డివైజ్‌ కి ‘న్యాచురల్ స్ట్రీట్ లైట్ స్విచ్’ అని పేరు పెట్టాడు.

నాన్నను చూస్తూ ..

‘‘దుగ్గొండి, నర్సంపేటల్లో స్కూల్, కాలేజీ చదువు పూర్తయింది. చదివిందేమో బీఎస్సీ. అది కూడా BZC గ్రూప్. అయితే చిన్నప్పటి నుంచి నాన్న రేడియో రిపేర్లు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వర్క్స్ చేస్తుండడం చూస్తూ పెరగడం వల్ల దానిపై ఇంట్రెస్ట్ పెరిగింది. 2005లో 15 ఏళ్ల వయసు ఉండగా బడికి వెళ్లి వస్తున్నప్పడు మిట్ట మధ్యాహ్నం స్ట్రీట్ లైట్స్ వెలుగుతుండడం చూసి ఈ టైమ్‌‌లో వీటి అవసరం ఏముంది అనిపించింది. ఆ తర్వాత నాన్నను అడిగితే.. ‘వాటికి స్విచ్‌ లు ఉండవు. ఒక్కసారి ఫ్యూజ్‌ లు పెట్టి వదిలేస్తారు’ అని చెప్పాడు. ఇలా పగలు రాత్రి తేడా లేకుండా వెలుగుతూ ఉంటే కరెంట్ వేస్ట్.. పైగా అలా నాన్ స్టా ప్‌‌గా వెలిగి, వెలిగి ఆ లైట్లు త్వరగా చెడిపోయేవి. ఆ తర్వాత రాత్రులు కూడా లైట్లు ఉండేవి కాదు. ఆ పాడైపోయిన లైట్లు మార్చడానికి నెలలు, సంవత్సరాలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఇలా రాత్రి వేళల్లో పడిన ఇబ్బం దుల నుంచే ఈ ఆలోచన పుట్టుకొచ్చింది. నైట్ టైమ్‌‌లో మాత్రమే లైట్లు వెలిగేలా చేసే ఆటోమేటిక్ స్విచ్ తయారు చేయాలని అనుకున్నా’ అని రాజు చెప్పాడు. సన్ లైట్‌‌ను గుర్తించే ఫొటో సెన్సర్ సాయంతో దీనిని తయారు చేశానని చెప్పాడు. సోలార్ ప్యానెల్స్‌‌లో ఉండే ఫొటో వోల్టా యిక్ సెల్స్‌‌తో కూడిన సెన్సర్‌‌ పెట్టడం వల్ల నేరుగా ఎండ దానిపై పడకపోయినా వెలుతురు ఉందా లేదా అన్నది ఈజీగా గుర్తించి ఈ డివైజ్ పర్ఫెక్ట్‌‌గా పని చేస్తోందని చెప్పాడు.

నాటి కలెక్టర్ సపోర్ట్

స్కూల్ చదువు పూర్తయ్యే సమయానికే స్ట్రీట్ లైట్ సెన్సర్ స్విచ్ తయారు చేయాలన్న ఆలోచన రాజులో మొదలైంది. నాన్న సాయంతో చిన్న చిన్నగా సర్క్యూట్స్ చేయడం నేర్చుకున్నాడు. 2006 – 07లో అప్పటికి ఉన్న నాలెడ్జ్‌ తో స్ట్రీట్ లైట్ స్విచ్ చేసినా అది పెద్దగా క్లిక్ కాలేదు. అయితే కాలేజీ చదువు పూర్తయ్యాక మళ్లీ దీనిపై పట్టు దలగా వర్క్ చేయడం స్టార్ట్ చేశానని రాజు చెబుతున్నాడు. 2014లో ఒక ప్రొటోటైప్ తయారు చేసి ఊరిలోని స్ట్రీట్ లైట్లకు పెట్టి చూస్తే చాలా కాలం పని చేసిందని, కానీ మరిన్ని తయారు చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ లేక ఆగిపోవాల్సి వచ్చిందని అన్నాడు. ఒక్కో డివైజ్ తయారు చేయడానికి 3,500 రూపాయల వరకు ఖర్చవుతుంది. దీనికి సపోర్ట్ చేయాలని లోకల్‌‌గా కొన్ని గ్రామ పంచాయతీల్లో అడిగితే ఫండ్స్ లేవని చెబుతూ వచ్చారని రాజు తెలిపాడు. ‘నా ఇన్నొవేషన్ గురించి ట్విట్టర్ ద్వారా 2016లో అప్పటి వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు తెలుసుకున్నారు. ఈ న్యాచురల్ స్ట్రీట్ లైట్ సిస్టమ్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి.. నన్ను పిలిచి మాట్లాడారు. ఆయన కలెక్టర్ ఫండ్స్ నుంచి నేరుగా 100 డివైజ్‌‌లు కొన్నారు. వాటిని కొన్ని గ్రామాల్లో పెట్టించారు. తొలిసారి నాకు మంచి సపోర్ట్ దక్కింది ఆయన నుంచే’ అని రాజు చెప్పాడు.

30% కరెంట్ బిల్లులు సేవ్

కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ సాయంతో రాజు ఇన్నొవేషన్ గురించి పదిమందికి తెలిసింది. ఆయనతో పాటు మరికొందరు అధికారులు ముందుకు రావడంతో ఈ నాలుగేళ్లలో తన సొంత ఊరితో పాటు 120 గ్రామ పంచాయతీల్లో ఈ స్ట్రీట్ లైట్స్‌‌కు ఈ డివైజ్ ఫిక్స్ చేశామని రాజు చెప్పా డు. వరంగల్ అర్బన్ మున్సి పాలిటీలో కూడా వీటిని వాడుతున్నారన్నాడు. అలాగే వరంగల్ రూరల్, అర్బన్, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో 10 రైస్ మిల్స్‌‌లో కూడా లైట్లకు వీటినే ఫిక్స్ చేసినట్లు చెప్పాడు. ఊర్లలో స్ట్రీట్ లైట్లు 24 గంటలూ వెలగడం వల్ల కరెంట్ బిల్లులు ఎక్కువగా వచ్చేవి. దీంతో పంచాయతీలు బిల్లులు ఏ నెలవి ఆ నెలలోనే కట్టలేక పెండింగ్ పడి పేరుకుపోయేవి. కానీ ఇప్పుడు మేం ఆటోమేటిక్‌‌గా లైట్ ఆఫ్ అయ్యేలా సెట్ చేయడంతో అన్ని పంచాయతీల్లో దాదాపు 30 శాతం, అంతకంటే ఎక్కువ కూడా కరెంట్ బిల్లులు తగ్గిపోయాయి’అని రాజు అన్నాడు. తాను తయారు చేసిన డివైజ్‌‌ను దేశం మొత్తం అన్ని పల్లెల్లో స్ట్రీట్ లైట్లకు వాడితే భారీగా కరెంట్ వృథాను కంట్రోల్ చేయడమే కాకుండా కోట్ల రూపాయల్లో కరెంటు బిల్లులు ఆదా చేయొచ్చని చెప్పాడు.

బెస్ట్ సొల్యూషన్ అనిపించి..

‘‘పల్లెల్లో స్ట్రీట్ లైట్లు అదేపనిగా వెలగడం వల్ల ఆ లైట్ల లైఫ్ టైమ్ తగ్గిపోయేది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి రాజు ఇన్నొవేషన్ బెస్ట్ సొల్యూషన్ అనిపించింది. 2016లో ఆ కుర్రాడి డివైజ్ గురించి నాకు తెలిసింది. అప్పుడు నేను వరంగల్ అర్బన్ కలెక్టర్‌‌గా ఉండడంతో నేరుగా నా ఆఫీస్‌ కే వచ్చి దాని గురించి డెమాన్‌‌స్ట్రే షన్ ఇవ్వాలని కబురు పంపాను. ఈ డివైజ్‌ లో ఉండే పీవీసీ సెల్‌ పై సూర్యకాంతి పడినప్పుడు ఆటోమేటిక్‌ గా స్ట్రీట్‌ లైట్లు ఆఫ్ అయిపోయేలా డిజైన్ చేశాడు. సన్ లైట్ తగ్గగానే స్విచ్ ఆన్ అవుతోంది. దీంతో రాజు డివైజ్‌ ని మొదట ఒక 10 గ్రామ పంచాయతీల్లో పెట్టించాం. ఐదారు నెలల పాటు టెస్ట్ చేశాక, అవి ఎలా పని చేస్తున్నాయన్న దానిపై విలేజ్ ఆఫీసర్లు, గ్రామ సర్పంచ్‌ల దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇవి బాగా పని చేస్తున్నాయని చెప్పడంతో మరికొన్ని పంచాయతీల్లో పెట్టించాం. దాదాపు 100 గ్రామాలు, కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు, ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేశాం. సాధారణంగా ఐఐటీ లాంటి గొప్ప గొప్ప ఇన్‌‌స్టిట్యూట్స్‌‌లో ఉండే స్కాలర్స్‌‌కే  గుర్తింపు రావడం చూస్తుంటాం. అయితే లోకల్‌ గా ఉండే ప్రాబ్లమ్స్‌‌కి ఇలాంటి రూరల్ ఇన్నొవేటర్స్ బుర్రలోనే సొల్యూషన్స్ పుడతాయి’ అని కలెక్టర్‌‌‌‌ ప్రశాంత్ పాటిల్ చెప్పారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ జిల్లా కలెక్టర్‌‌గా పని చేస్తున్నారు .

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ట్వీట్..

రాజు ఇన్నొవేషన్స్ ఒక్క స్ట్రీట్ లైటింగ్ ఆటోమేటిక్ స్విచ్‌ తోనే ఆగిపోలేదు. పబ్లిక్ ప్లేసు లు, రైల్వేస్టేషన్ల దగ్గర వాడుకునేందుకు వీలుగా సోలార్ పవర్ మొబైల్ చార్జింగ్ సిస్టమ్, ఇంట్లో కూర్చునే పొలంలోని మోటర్‌‌ని ఆఫ్ చేసే రిమోట్ కంట్రోల్, ఇంట్లో దొంగలు పడిన విషయాన్ని హీట్ సెన్సర్ ద్వారా గుర్తించి మొబైల్‌ కి మెసేజ్ పంపే డివైజ్, సోలార్ పవర్‌‌తో గడ్డి కోసే మెషీన్, పెట్రోల్ లేకుండా సోలార్ పవర్‌‌తోనే పొలానికి పురుగు మందు స్ప్రేయర్ ఇలా చాలానే తయారు చేశాడు. కరోనా టైమ్‌‌లో రాజు తయారు చేసిన పెడల్ ఆపరేటెడ్ హ్యాండ్ శానిటైజర్ సిస్టమ్‌‌కి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు దక్కింది. చేతులతో తాకే పని లేకుండా ఒక క్యాన్‌‌లో లిక్విడ్ సోప్, మరోదానిలో వాటర్ పెట్టి రెండింటినీ కూడా చేతితో తాకే పని లేకుండా పెడల్స్ బిగిం చాడు. వాటితో నొక్కి చేతులు శుభ్రంగా కడుక్కునేలా ఏర్పాటు చేశాడుజ దీనిని మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ కలెక్టరేట్, బస్టాండ్, కూరగాయల మార్కె ట్ ఇలా వేర్వేరు ప్రాంతాల్లో పెట్టిం చారు. అలాగే వరంగల్ పోలీస్ కమిషనర్ ఆఫీస్, ఖమ్మం, కరీంనగర్ కలెక్టర్ ఆఫీసులు సహా రాష్ట్రం లోని వేర్వేరు మున్సి పాలిటీల పరిధిలోని చాలా ప్లేసుల్లో ఏర్పాటు చేశారు. ఈ ఇన్నొవేషన్‌‌కు నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్‌‌ నుంచి గుర్తింపు దక్కింది. కరోనా టైమ్‌‌లో ఈ ఇన్నొవేషన్‌‌ చేయడాన్ని మెచ్చుకుంటూ ప్రోత్సాహంగా రూ.75 వేల ఆర్థిక సాయం కూడా చేసింది. ఈ ఇన్నొవేషన్‌‌ను సరైన టైమ్‌‌లో మంచి సొల్యూషన్ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఆ స్థా యి వ్యక్తి తన ఇన్నొవేషన్ గురించి ట్వీట్ చేయడం జీవితంలో మరిచిపోలేనని రాజు అంటున్నాడు.

సాయం చేస్తే పది మందికి ఉపాధి

‘‘స్ట్రీట్ లైట్ సెన్సర్ స్విచ్ సహా నా ఇన్నొవేషన్స్ దేనికీ కూడా ఏ ఒక్క రాజకీయ నేత నుంచి కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దల నుంచి కానీ సాయం అందలేదు. గతంలో కలెక్టర్ గారు మాత్రమే సపోర్ట్ చేశారు. నా లాంటి వాళ్లను ప్రోత్సహించేందుకు ‘పల్లె సృజన’ అనే ఎన్జీవో పని చేస్తోంది. దానిలో నేను కూడా ఒక వలంటీర్‌‌గా ఉన్నా. తెలంగాణ పల్లెల్లో తిరిగి రూరల్ ఇన్నొవేటర్లను గుర్తించడమే దీని పని. నాలాం టి వాళ్లు రాష్ట్రం లో చాలా మందే ఉన్నారు . రూరల్ ఇన్నొవేటర్స్‌‌కి టీ హబ్, టీఎస్ఐసీ లాంటి సంస్థల నుంచి కూడా ఏమాత్రం సాయం అందడంలేదు. గతంలో హెల్ప్ కోసం ఎంతో ఆశగా ఐటీ, మున్సి పల్ మంత్రి కేటీఆర్ గారికి కూడా నేను ట్వీట్ చేశా. కానీ స్పందన రాలేదు. ప్రభుత్వం నుంచి నాకు ఏదైనా సాయం అందితే నా ఇన్నొవేషన్స్‌‌తో ఒక స్టా ర్టప్‌‌ పెట్టి.. ప్రొడక్షన్ మొదలుపెడతా. దీని ద్వారా పది మందికి నేను ఉపాధి చూపిస్తాను. నా లాంటి మధ్య తరగతి కుటుంబాని కి చెందిన ఇంకొంత మందికి చేదోడుగా నిలవాలన్నదే నా కల’’ అని రాజు చెప్పాడు.

 -శ్రీనివాస్‌ పులిమి