ఒకేసారి ఎన్నికలు దేశానికి.. రాజకీయ పార్టీలకూ మంచిదే

మన దేశంలో ఏటా రెండు, మూడు రాష్ట్రాల్లో ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు.. ఇలా రాష్ట్రంలో, కేంద్రంలో ఒక ప్రభుత్వం ఎన్నికైన ఐదేళ్ల పీరియడ్ మధ్యలో తరచూ ఎలక్షన్ కోడ్ అమలులోకి వస్తోంది. దీని వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు బ్రేకులు పడుతున్నాయి. ప్రధాని, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎన్నికల వ్యూహాల్లో బిజీ అవుతుండడంతో పాలన గాడి తప్పుతోంది. పైగా పదే పదే ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ కు, ప్రచారం కోసం పార్టీలకు బోలెడంత డబ్బు వృధా అవుతోంది.  ఈ సమస్యలకు పరిష్కారంగా దేశంలో అన్ని ఎన్నికలూ ఒకేసారి నిర్వహించడం బెటర్ అన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఈ విషయాన్ని నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మరోసారి ప్రస్తావించారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండు దశాబ్దాల పాటు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. 1952, 1957, 1962, 1967ల్లో పార్లమెంట్, అసెంబ్లీ.. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో శాసనసభ రద్దవుతూ రావడంతో ఆ ప్రక్రియకు తూట్లుపడడం మొదలైంది. బంగ్లాదేశ్ ఆవిర్భావం కోసం జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించిన ఇందిరాగాంధీ లోక్ సభను ఏడాది ముందే రద్దు చేసి, 1971లోనే ఎన్నికలకు వెళ్లడంతో జమిలి ఎన్నిక అనేది మొత్తంగా దారితప్పింది. ఆ తర్వాత పలు చట్టబద్ధ సంస్థలు మళ్లీ ఒకేసారి ఎన్నికల నిర్వహణ అవసరం ఉందంటూ అనేక సార్లు చెబుతూ వచ్చాయి. 1999లో లా కమిషన్ ఎన్నికల సంస్కరణల నివేదికలో లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని సిఫార్స్ చేసింది.  పరిపాలనలో స్థిరత్వం కోసం ఈ సిఫార్స్ చేసినట్లు కమిషన్ చైర్మన్ జస్టిస్ జీవన్ రెడ్డి నాడు స్పష్టంగా చెప్పారు.

చాలా దేశాల్లో ఫిక్స్డ్ డే

పక్కాగా దేశంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరపడం పాలనా సౌలభ్యానికి వీలు కల్పిస్తుందని ప్రపంచంలోని అనేక దేశాలు గుర్తించాయి. చాలా దేశాలు జాతీయ, ప్రాంతీయ ఎన్నికలు ఒకేసారి పెడుతున్నాయి. 48 దేశాల్లో ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ లో పాల్గొనడానికి వీలుగా ఆదివారం మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో జాతీయ,  ప్రాంతీయ శాసనసభలకు ఎన్నికలు ఐదేండ్లకోసారి ఉమ్మడిగా జరుగుతాయి.  అయితే మున్సిపల్ ఎన్నికలు రెండేండ్ల తర్వాత ఒక ఫిక్స్డ్ డేట్ లో పెడతారు. స్వీడన్లో అయితే లోకల్ బాడీ ఎన్నికలతో సహా అన్నీ ఒకే రోజున జరుగుతాయి. నాలుగేండ్లకు ఒకసారి సెప్టెంబర్​ రెండో ఆదివారం ఎన్నికలు పెడతారు.

పదే పదే ఎన్నికలతో ఖర్చు, సమస్యలు

ఐదేండ్ల గ్యాప్ లో మళ్లీ మళ్లీ ఎలక్షన్లు పెట్టడం వల్ల ఎన్నికల కోడ్ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు స్తంభించిపోతున్నాయి. ప్రభుత్వాధినేతలు, ఉద్యోగులు కూడా వారి పనులను పక్కన బెట్టి ఎన్నికల నిర్వహణపై పడడంతో పాలన కూడా గాడి తప్పుతోంది. పైగా రాను రానూ ఎన్నికల ఖర్చు పెరుగుతూ వస్తోంది. 1971లో 11.5 కోట్లు అయిన ఎన్నికల ఖర్చు 2014 లోక్ సభ ఎలక్షన్ల సమయానికి దాదాపు రూ.4500 కోట్లు ఖర్చు అయింది. ఇదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. మొన్నటి బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చేసిన ఖర్చులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్లు ఖర్చయ్యాయి. జమిలి ఎన్నికల ద్వారా ఈ విధమైన ఖర్చును గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది.

ఎంతో ప్రజాధనం వృధా అవుతోంది

ఒకసారి జనరల్ ఎలక్షన్స్ నిర్వహించడానికి అయ్యే ఖర్చును ఎన్నికల సంఘం రూ.4,500 కోట్లు అని గతంలో పార్లమెంటరీ కమిటీకి చెప్పింది. అయితే రియాలిటీలో ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంది. ఎన్నికల కమిషన్ నేరుగా చేసే ఖర్చు కింద రూ.4500 కోట్లు మాత్రమే చూపిస్తున్నప్పటికీ.. భద్రతా ఏర్పాట్లు సహా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఇతర అవసరాల కోసం ప్రభుత్వం బయటకు ప్రకటించకుండా రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది. ఒకేసారి ఎన్నికలతో ప్రజాధనం వేస్ట్ కాకుండా కాపాడడంతో పాటు రాజకీయ పార్టీలకు కూడా మేలే జరుగుతుంది. లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఇలా వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల ప్రచార ఖర్చులు, అసంతృప్తుల లొల్లి లాంటివి పెరుగుతాయి. అదే ఒకేసారి దబ్బున ఎన్నికలు జరిగితే పార్టీలకు ఎన్నికల ఖర్చు తగ్గడంతో పాటు పార్టీలో నేతలు, కార్యకర్తలు అంతా సంఘటితంగా పని చేసేలా చూసుకోవచ్చు.

ఒకేసారి కష్టమనుకుంటే..

దేశంలో అన్ని ఎన్నికలు కలిసి ఒకేసారి జరిగితే పాలన పరంగా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వాలకు స్పష్టమైన 58 నెలల వ్యవధి లభిస్తుంది. లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే వ్యవస్థను రూపొందించడానికి సమయం ఆసన్నమైందని 1983లోనే భారత ఎన్నికల కమిషన్ పేర్కొన్నది. 2015 లో, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, చట్టం, న్యాయంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం లోక్ సభ, రాష్ట్ర శాసనసభలకు ఒకేసారిఎన్నికలు పెట్టాల్సిన అవసరాన్ని చెప్పింది. అయితే ఇంత పెద్ద దేశంలో ఒకేసారి అన్ని ఎలక్షన్స్ పెట్టాలంటే నిర్వహణ కష్టం కావొచ్చు. రెండు లేదా మూడు  దఫాల్లో ఎన్నికలను నిర్వహించడం ఒక ప్రత్యామ్నాయం. 2022 నవంబర్ లో కొన్ని  రాష్ట్రాల అసెంబ్లీలు, 2024లో మిగిలిన వాటికి ఎన్నికలు పెట్టొచ్చు. ఈ రెండు దఫాల్లోనూ అనుకున్న సమయానికి ఆరు నెలలు ముందు లేదా తర్వాత గడువు ముగిసే సభలకు ఒకేసారి ఎన్నికలు పెట్టేయొచ్చు. రెండింటిలో ఏదో ఒకసారి లోక్ సభ ఎలక్షన్స్ నిర్వహించవచ్చు. అలాగే మరో దఫాగా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే పద్ధతి కొంతమేర ఆచరణీయం. పైగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే సామర్థం ఉందని ఎన్నికల కమిషన్ ఇప్పటికే చెప్పిన విషయం ఈ సందర్భంగా గమనించాలి.

మన దేశంలోనూ మార్పు అవసరం

ఇండియాలోనూ లోక్ సభ, రాష్ట్ర శాసనసభలు, మున్సిపల్ సహా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశంలో సుదీర్ఘ చర్చలు కూడా జరిగాయి. లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఈసీ వేర్వేరుగా ఓటర్ల లిస్ట్ రూపొందిస్తోంది. దీనికోసం ఎలక్షన్ కమిషన్ కు మానవ వనరులు, డబ్బు మళ్లీ మళ్లీ అవసరం పడుతోంది. ఇది అనవసరమని, అన్ని ఎన్నికలకూ కలిపి ఐదేండ్లకోసారి ఒకే ఓటర్ లిస్టు ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికల నిర్వహణపై లోతైన స్టడీ జరగాల్సి ఉందని అన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ కోసం లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ సమన్వయంతో పని చేసి దేశ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పుడు ఒకేసారి ఎన్నికల అవసరం దేశానికి చాలా అవసరమని గతంలో మాట్లాడిన మోడీ.. ఇప్పుడు మరోసారి నొక్కి చెప్పడం ద్వారా ఆయన ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగానే అర్థం చేసుకోవాలి.