ఆగమైన తెలంగాణ బాగయ్యేదెట్లా?

ఆగమైన తెలంగాణ బాగయ్యేదెట్లా?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 76 వేల కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ మిగులు బడ్జెట్​తో మొదలైంది. గత పది సంవత్సరాల నుంచి చంద్రశేఖర రావు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చేశారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్​ రావు, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు నిత్యం తమ ప్రకటనల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుందని, జీడీపీ 12 శాతం పెరుగుతుందని, తలసరి ఆదాయం మూడు లక్షలకు పైగా ఉందని ప్రజలకు నిత్యం ఊదరగొడుతూనే ఉన్నారు. 

మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా పైకి చూడడానికి మంత్రి ద్వయం లెక్కలు బాగానే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఆర్థిక, సామాజిక అసమానతలతో అంతర్ జిల్లాల అసమానతలు విపరీతంగా పెరిగాయి. ఈ పది ఏండ్లలో వేలమంది రాజకీయ వ్యాపారవేత్తలు, కార్పొరేట్​ యజమానులు బిలియనీర్స్​గా మారిపోయారు. ప్రజా ప్రతినిధులు సంపన్నులుగా ఎదిగిపోయినారు. అదేవిధంగా పేద,మధ్యతరగతి  ప్రజలపై దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నుల భారం మోపడం జరిగిందని గణంకాలు తెలియజేస్తున్నాయి. బడ్జెట్ ఒకటి రెండు సామాజిక వర్గాల పెట్టుబడిదారులకు, ఆర్థిక దోపిడీ చేస్తున్న నాయకులకు, అవినీతి అధికారులకు అనుకూలంగా వారి అవసరాల కోసం ఇష్టారాజ్యంగా ఆర్థిక నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, అవకతవకలకు పాల్పడి ఆర్థిక వ్యవస్థను మరో 20 ఏండ్ల వరకు కూడా కోలుకోలేకుండా చేయడం జరిగిందని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ ద్వారా తేలుతున్నది.

పథకాలతో మభ్యపెట్టి..

 సంక్షేమ పథకాలను ముందు పెట్టి పేద, మధ్య తరగతి ప్రజలపై పెను ఆర్థిక భారాన్ని మోపి చంద్రశేఖర రావు ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక రాబడిని300% పెంచడం జరిగింది. పెట్రోలు, డీజిల్ పై 36% వాల్యూ ఆడెడ్ టాక్స్ వేసి దేశంలో ఎక్కడా లేనంతగా డీజిల్ రూ. 99 రూపాయలకు, పెట్రోల్ రూ.111- అమ్మి ప్రతి ఏటా రాష్ట్ర ఖజానాకు రూ.35 వేల కోట్ల జమ చేయడం జరుగుతున్నది.

హద్దులు దాటిన పన్నుల భారం

వ్యవసాయ, రియల్ ఎస్టేట్ భూముల ప్లాట్ల విలువలను  విపరీతంగా పెంచి రూ. 20,000 కోట్లు , రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 200 శాతం, బస్సు ప్రయాణ చార్జీలు, ఎలక్ట్రిసిటీ చార్జీలు మూడింతలు పెరిగినాయి. మద్యం షాపులు 400 శాతం, బెల్ట్ షాపులు 1000% శాతం పెంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల నుంచి రూ.50 వేల కోట్ల వరకు మద్యం ఆదాయాన్ని పెంచుకున్నారు.మద్యం షాపుల్లో పర్మిట్ గదులను ఇచ్చి ప్రజలను తాగించి వాళ్ళ వెంటనే  పోలీసు గొట్టం పెట్టి వేలకోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఎడమ చేతితో ఇచ్చి, కుడి చేతితో మద్యం వ్యాపారం చేయడం జరిగింది. మోటారు వెహికల్ టాక్స్, అపరాధ రుసుములు, ఇంకా అనేక రకాల చార్జీలను, టాక్స్ లను నిర్మొహమాటంగా నిర్దాక్షిణ్యంగా పెంచి ప్రజల ఆదాయాలకు గండి కొట్టారు.

బడాయిల వల్ల రాని నిధులు

రాష్ట్ర రెవెన్యూ ఆదాయం విపరీతంగా పెంచడం వల్ల కేంద్ర 15వ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర ఆదాయం ఎంతో వేగంగా పెరుగుతున్నదని, నిజంగా తెలంగాణ రాష్ట్రం అనేక రాష్ట్రాల కంటే అత్యంత ధనవంతమైన రాష్ట్రంగా భ్రమపడి  ఈ రాష్ట్రానికి న్యాయంగా రావలసిన అదనపు కేంద్ర సహాయాన్ని నిరాకరించడం జరిగింది. ఒక పక్కన పేద ప్రజలపై మోయలేని ఆర్థిక భారాన్ని మోపి మరోపక్క కేంద్ర నిధులకు తెలంగాణను అర్హత లేని రాష్ట్రంగా చిత్రించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు, వెనుకబడిన 28 జిల్లాలకు ఎంత భారీగా నష్టం జరిగిందో గమనించవలసిన అవసరం ఉంది.

నిధుల దారి మళ్లింపు

కమీషన్లు, పెద్ద ఎత్తున ముడుపులు లభించే కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు ఇబ్బందిగా బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు, రాష్ట్ర రెవెన్యూ వనరులను ఇష్టారాజ్యంగా తరలింపు చేయడం వల్ల రాష్ట్ర ప్రజల అత్యంత అవసరమైన శాఖలకు కేటాయింపులు తగ్గించారు, విద్యా సంస్థలు కూడా నిధులు లేక నిర్వీర్యమైనాయి.  ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కమీషన్ల ప్రాజెక్టులకు తరలించడం జరిగింది. వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారు. గ్రామపంచాయతీలను గ్రామీణ అభివృద్ధిని అటకెక్కించారు. బిల్లులు చెల్లించకపోవడం వల్ల సర్పంచులు అప్పుల పాలైనారు కొంతమంది ఆత్మహత్యలు కూడా 
చేసుకున్నారు.

కాళేశ్వరం వడ్డీలకే సరి

కాళేశ్వరాన్ని డిజైన్ మార్చడం వలన ప్రాజెక్టు వ్యయం కేవలం 63 వేల కోట్ల రూపాయల నుంచి రూ. ఒక లక్షా రెండు వేల కోట్లకు పెంచారు. 2023 నాటికి ఈ వ్యయం 1,51,000 కోట్లకు పెంచినారు. ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 97 వేల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది. గత మూడు సంవత్సరాల నుంచి వడ్డీలు కట్టకుండా వాయిదాలు వేయడం జరిగింది. వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుత రాష్ట్ర ఖజానా నుంచి ప్రతి నెలకు రూ.4000 కోట్ల వడ్డీ  కింద చెల్లిస్తున్నారు. కాళేశ్వరం వడ్డీలు, అసలు, ప్రాజెక్టు విద్యుత్తు ఖరీదు, మెషిన్ల మెయింటెనెన్స్ ఖర్చులు మొత్తం ప్రతి ఏటా రూ. 25 వేల కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి  చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడింది. మూడేండ్లలో కేవలం 25 టీఎంసీలు మాత్రమే వాడుకలోకి వచ్చింది.

వచ్చే సర్కారుకు తప్పని తిప్పలు

ఒకవేళ ఈ ప్రభుత్వం పోయినప్పటికీ, ఉన్నప్పటికీ 2024లో ప్రారంభమయ్యే వార్షిక బడ్జెట్ తయారు చేయడం నూతన ఆర్థిక మంత్రికి పెద్ద తలనొప్పిగా మారనున్నది. అమ్మడానికి ప్రభుత్వ భూములు, ఆస్తులు మిగలవు. ఇప్పటికే పెంచిన పన్నులనే మోయలేక అఘోరిస్తున్న తెలంగాణ పేద, మధ్యతరగతి ప్రజలు కొత్త ప్రభుత్వం అదనపు పన్నులు వేస్తే తిరగబడతారు. ఇప్పటికే పెన్షనర్ల, ఉద్యోగస్తుల జీతాలు అప్పులు తెస్తేగానీ ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఖాళీ అయినాయి, జేఎన్టీయూ యూనివర్సిటీలో నిలువ డిపాజిట్లు తీసుకున్నారు. తెలుగు అకాడమీ సంస్థలో ఉన్న  డిపాజిట్లను కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఒకవేళ ఈ సమస్యలన్నీ అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని మార్చినప్పటికీ ప్రత్యామ్నాయ పార్టీలు కొత్త ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను అమలు చేయలేని పరిస్థితి దాపురించింది. 

జాగో, బచావో 

స్వార్థ ప్రయోజనాలకు, బంధుమిత్ర గణానికి, కార్పొరేట్ మిత్రులకు సంపద అందించడానికి చేసిన నిర్వాకం వల్లనే ఈరోజు రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. ఆఖరికి పాఠశాలల్లో బాలికల టాయిలెట్లు కూడా కట్టించలేని దురవస్థలోకి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. ఇక ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే అనేక ఆచరణకు సాధ్యంగాని, నిరర్థకమైన నిష్ప్రయోజనమైన అబద్ధాల మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి మరొకసారి పబ్బం గడుపుకోవడానికి చేసిన ఎత్తుగడలను పేద,  

మధ్యతరగతి ప్రజలు తిప్పి కొట్టకపోతే ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, పేద మధ్యతరగతి ప్రజలను ఎవ్వరూ కాపాడలేరు. ఇక శాశ్వతంగా ఉచిత బియ్యం, ఆసరా పథకాలకు, బతుకమ్మ చీరలకు,  ఉదయం బ్రేక్ ఫాస్ట్, ఆత్మగౌరవ సభల్లో విందులకు నిరంతరం ఆధారపడవల్సిన దుస్థితి ఏర్పడుతుందని జాగో, బచావో అని తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి.

ఆస్తుల అమ్మకం

ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అతి కష్టమైపోయింది, ఆస్తులను కుదవ పెట్టడం లేదా అమ్ముకోవడం ప్రారంభమైంది. వరంగల్​లో  జైలును కూలగొట్టి మహారాష్ట్ర బ్యాంకుకు కుదువబెట్టి 1,600 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోవడం జరిగింది. ఓఆర్​ఆర్​ సంస్థను 30 సంవత్సరాలు లీజుకు ఇచ్చి ఏడున్నర వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవడంతోపాటు.. మద్యం షాపుల అర్రాజులు ఆరు నెలల ముందే పెట్టి 2,600 కోట్ల రూపాయలు సర్కారు రాబట్టుకున్నది. హైదరాబాదు నగరంలో అత్యంత విలువైన భూములను అమ్మివేసింది. ఇక హైదరాబాదులో ఒక్క ఇంచు భూమి లేకుండా అమ్మకం చేసే ఆర్థిక సంక్షోభం, ప్రమాదం కూడా పొంచి ఉంది.

–కూరపాటి వెంకట్ నారాయణ రిటైర్డ్  ప్రొపెసర్ 

రిటైర్డ్  ప్రొపెసర్