Champions Trophy: భారత్‌ను ఓడించండి.. కోటి రూపాయలు బహుమతిగా ఇస్తా: సింధ్ గవర్నర్

Champions Trophy: భారత్‌ను ఓడించండి.. కోటి రూపాయలు బహుమతిగా ఇస్తా: సింధ్ గవర్నర్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: దాయాదుల పోరుపై సింధ్ గవర్నర్ ముహమ్మద్ కమ్రాన్ ఖాన్ టెస్సోరి ఓ బహిరంగ ప్రకటన చేశారు. దుబాయి గడ్డపై భారత్‌ను ఓడిస్తే, కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానని పాకిస్తాన్ ఆటగాళ్లకు హామీ ఇచ్చారు. ఇది తానొక్కడి కోరిక కాదని, యావత్ దేశం అదే కోరుకుంటోందని టెస్సోరి ఆ జట్టు ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.

"భారత్‌పై పాకిస్తాన్ జట్టు గెలిస్తే, నా వైపు నుండి ఆటగాళ్లకు కోటి రూపాయలు ఇస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఒకవేళ ఓడిపోతే వారిని పట్టించుకోము అని కాదు. ఆటగాళ్లే మన బలం, గౌరవం. వాళ్లు గెలిచినా, ఓడినా ఎప్పటికీ ఆధరిస్తాం. కానీ ఈసారి దేశం మొత్తం విజయం కోసం ప్రార్థిస్తోంది. మన వాళ్లు దానిని సాధిస్తారని గట్టిగా నమ్ముతున్నారు.." 

"ప్రస్తుతానికి నేను లండన్‌లో ఉన్నాను, కానీ భారతదేశంపై పాకిస్తాన్ తలపడే ప్రతి మ్యాచ్‌లోనూ నా ప్రార్థనలు, గుండె చప్పుడు ఎప్పుడు పాకిస్తాన్‌తోనే.." అని టెస్సోరి ARY న్యూస్ ఇంటర్వ్యూలో అన్నారు.

ఓ మాదిరి స్కోరు.. 

ఇదిలావుంటే, కీలక పోరులో ఇప్పటికే దాయాది జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 49.4 ఓవర్లలో 241 పరుగుల వద్ద ఆలౌటైంది. సౌద్ షకీల్ (62; 76 బంతుల్లో 5 ఫోర్లు), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌ (46; 77 బంతుల్లో 3 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఇమామ్ ఉల్ హక్ (10), బాబర్ అజామ్ (23), సల్మాన్ అఘా (19), ఖుష్‌దిల్ షా (38) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ పడగొట్టారు.