లింగంపేట, వెలుగు: ఎన్నికల్లో మందు, డబ్బు పంపిణీ నియంత్రించేందుకు ముమ్మర తనిఖీలు చేయాలని ఎస్పీ సింధూశర్మ పోలీసులకు సూచించారు. గురువారం జిల్లా సరిహద్దులోని నాగిరెడ్డిపేట మండలం పోచారం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును ఆమె తనిఖీ చేశారు. చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ప్రతీ వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్నారు. డబ్బు, మందు అక్రమంగా తరలిస్తే స్వాధీనం చేసుకొని సీజ్ చేయాలన్నారు.
గతంలో వేర్వేరు కేసుల్లో నేరస్తులుగా ఉన్నవారిని ముందస్తుగా బైండోవర్లు చేయాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం నాగిరెడ్డిపేట,లింగంపేట పోలీస్స్టేషన్లను ఎస్పీ సందర్శించారు. ఆమె వెంట ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ శ్రీనివాస్, నాగిరెడ్డిపేట ఎస్ఐ రాజు, లింగంపేట ఎస్ఐ ప్రభాకర్ ఉన్నారు.