Paris Olympics 2024: ప్రీ క్వార్టర్స్‌లో సింధుకు కఠిన ప్రత్యర్థి.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

Paris Olympics 2024: ప్రీ క్వార్టర్స్‌లో సింధుకు కఠిన ప్రత్యర్థి.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే..?

పారిస్ ఒలింపిక్స్ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు ప్రీ క్వార్టర్స్ చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో సింధు తన కెరీర్‌లో వరుసగా మూడోసారి ఒలింపిక్స్‌లో నాకౌట్ దశకు చేరుకుంది. తొలి రౌండ్ లో మాల్దీవులకు చెందిన ఫాతిమత్ నబాహా అబ్దుల్ రజాక్‌ను 21-9, 21-6తో వరుస సెట్లలో ఓడించిన సింధు.. రెండో రౌండ్ లో 21-5, 21-10తో ఎస్టోనియాకు చెందిన క్రిస్టీన్ కుబాను వరుస గేమ్‌లలో ఓడించి నాకౌట్ రౌండ్ (రౌండ్ ఆఫ్ 16)కు చేరుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌ను కేవలం 34 నిమిషాల్లోనే ముగించింది.

తొలి రెండు మ్యాచ్ లను సునాయాసంగా గెలిచిన సింధుకు ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో మాత్రం కఠిన ప్రత్యర్థి ఎదురు కానుంది. చైనాకు చెందిన 9వ ర్యాంకర్ హీ బింగ్ జియావోతో ఆమె తలపడనుంది. సింధు కన్నా ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉన్న చైనా ప్లేయర్ ను ఎదుర్కొని మ్యాచ్ గెలవడం ఈ తెలుగు ప్లేయర్ కు పెద్ద సవాలుగా మారింది. అయితే చివరిసారిగా జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో సింధు విజయం సాధించడం విశేషం. కాంస్యం కోసం జరిగిన ఈ పోరులో సింధు 21-13, 21-15తో బింగ్ జియావోను ఓడించింది. 

హెడ్-టు-హెడ్ రికార్డ్‌లో 9-11తో బింగ్జియావోపై భారత షట్లర్ వెనుకంజలో ఉంది. పివి సింధు, హే బింగ్ జియావోల మధ్య రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ గురువారం (ఆగస్టు 1వ తేదీ) పోర్టే డి లా చాపెల్లె ఎరీనాలో జరగాల్సి ఉంది. భారత కాలమాన ప్రకారం రాత్రి 10:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18 ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. జియో సినిమా యాప్ వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుంది.