కరోనాతో కలిసి బతుకుదాం

కరోనాతో కలిసి బతుకుదాం
  • టీకాలు, ట్రీట్‌‌మెంట్‌‌తోనే వైరస్ కట్టడికి సింగపూర్ ప్లాన్
  • కేసుల కౌంటింగ్‌‌ను ఆపే యోచన
  • స్పెషల్ రోడ్ మ్యాప్‌‌ను రూపొందించిన టాస్క్ ఫోర్స్

సింగపూర్: రోజువారీ కరోనా కేసుల లెక్కింపును ఆపేయాలని సింగపూర్ యోచిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఇప్పట్లో ఈ మహమ్మారి పోయే అవకాశం లేనందున దానితో కలిసి బతకడంపైనే ఆ దేశం ప్రధానంగా ఫోకస్ పెట్టింది. కేసుల లెక్కింపును ఆపేయాలని, టెస్టింగ్ పద్ధతులు మార్చుకోవాలని భావిస్తోంది. టీకాలు వేయడం, సీరియస్ పేషెంట్లకు సమర్థంగా ట్రీట్ మెంట్ చేయడం ద్వారానే కరోనాను కంట్రోల్ చేయాలని ఆలోచిస్తోంది. ఇందుకోసం సింగపూర్ కొవిడ్-19 టాస్క్​ఫోర్స్​కు చెందిన ముగ్గురు సభ్యులు ఒక రోడ్ మ్యాప్​ తయారుచేశారు.

వైరస్ తో కలిసి బతకడమే మేలు
సుమారు 57 లక్షల మంది జనాభా ఉన్న సింగపూర్ లో ఇప్పటిదాకా 62,579 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వైరస్ కారణంగా 36 మందే చనిపోయారు. అయితే తాజాగా డెల్టా రకం కరోనా కూడా మోపవడంతో ఆసియా పసిఫిక్ దేశాలు మరికొన్నాళ్లు స్ట్రిక్ట్ రూల్స్ ను కొనసాగించాలని భావిస్తున్నాయి. అన్ని దేశాలూ ‘జీరో ట్రాన్స్ మిషన్’ పద్ధతిలోనే చర్యలు తీసుకుంటున్నాయి. కానీ వైరస్ ఇప్పట్లో పోయే చాన్స్ లేనందున, దానితో కలిసి బతుకుతూనే, ముప్పును తగ్గించుకోవాలని సింగపూర్ కొవిడ్19 టాస్క్ ఫోర్స్ సభ్యులు ట్రేడ్ మినిస్టర్ గాన్ కిమ్ యోంగ్, ఆర్థిక మంత్రి లారెన్స్ వాంగ్, ఆరోగ్య మంత్రి ఆంగ్ యే కుంగ్ చెప్తున్నారు. ఇన్ ఫ్లుయెంజా, చికెన్ పాక్స్ వంటి వాటితో కలిసి జీవిస్తున్నట్లుగా కరోనాతోనూ నార్మల్ లైఫ్​గడిపేలా పరిస్థితిని మార్చుకోవడమే మేలని వారు తమ రోడ్ మ్యాప్ లో పేర్కొన్నారు. 

రోడ్ మ్యాప్‌‌లో ఏముంది? 
కరోనా కేసుల రోజువారీ లెక్కలను ఆపేసి, సీరియస్ కేసులపైనే ఫోకస్ పెట్టాలని టాస్క్ ఫోర్స్ సభ్యులు సూచించారు. ఆర్టీ పీసీఆర్ టెస్టులు కాకుండా, కొన్ని నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చే బ్రీతలైజర్, ఇతర పద్ధతుల్లో టెస్టింగ్ చేపట్టాలని ప్రతిపాదించారు. క్లోజ్ కాంటాక్టులకు టెస్టింగ్ ఆపేసి, విదేశాల నుంచి వచ్చేవాళ్లకు, ఎక్కువ మంది గుమిగూడే కార్యక్రమాలకు ముందుగా మాత్రమే టెస్టులు చేయాలన్నారు. సీరియస్ పేషెంట్లకు సమర్థంగా ట్రీట్ మెంట్ అందించాలని, వ్యాక్సినేషన్ వేగం పెంచాలని పేర్కొన్నారు.