ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితా విడుదలైంది. హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌లో భారత పాస్‌పోర్ట్‌కు 82వ స్థానం దక్కింది. భారతీయ పాస్‌పోర్ట్‌తో 58 దేశాల్లో వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం... పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్‌ల్లో సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా 195 దేశాలకు వీసా రహిత యాక్సెస్ ఉంది. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, జపాన్ రెండవ స్థానంలో ఉండగా ఆ దేశాల పాస్‌పోర్ట్ హోల్డర్‌లు 192 దేశాలకు వీసా లేకుండా ఎంట్రీ ఇవ్వవచ్చు.
ఆ తర్వాత మూడవ స్థానంలో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాల పాస్ పోర్టులు ఉన్నాయి. ఆ దేశాల పాస్ పోర్ట్ హోల్డర్స్ 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్ నాల్గవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, పోర్చుగల్, యునైటెడ్ స్టేట్స్ 5వ స్థానంలో ఉండగా ఆ దేశాల పాస్ పోర్ట్ హోల్డర్స్ 186 దేశాలకు వీసా రహిత యాక్సెస్ తో ప్రయాణం చేయవచ్చు.
ఈ జాబితాలో భారత్ 82వ స్థానంలో ఉంది. మన దేశ పాస్ పోర్ట్ హోల్డర్స్ ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలతో సహా 58 దేశాలకు వీసా లేకుండాప్రయాణించవచ్చు. మరోవైపు ఈ లిస్టులో పాకిస్తాన్ 100వ స్థానంలో ఉంది. ఆ దేశ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు 33 దేశాలకు వీసా రహిత యాక్సెస్ ఉంది. జాబితాలో అందరికన్నా దిగువన ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ పాస్ పోర్ట్ తో 26 దేశాలకు వీసా లేకుండాప్రయాణించవచ్చు.
హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసిన టాప్ 10 ర్యాంకింగ్స్ ఉన్న దేశాలు:
1) సింగపూర్ ( వీసా లేకుండా195 దేశాలు చుట్టి రావచ్చు)
2) ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ ( వీసా లేకుండా192 దేశాలు చుట్టి రావచ్చు )
3) ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ ( వీసా లేకుండా191 దేశాలు చుట్టి రావచ్చు )
4) బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యునైటెడ్ కింగ్‌డమ్ ( వీసా లేకుండా190 దేశాలు చుట్టి రావచ్చు )
5) ఆస్ట్రేలియా, పోర్చుగల్ ( వీసా లేకుండా189 దేశాలు చుట్టి రావచ్చు)
6) గ్రీస్, పోలాండ్ ( వీసా లేకుండా188 దేశాలు చుట్టి రావచ్చు)
7) కెనడా, చెకియా, హంగరీ, మాల్టా ( వీసా లేకుండా187 దేశాలు చుట్టి రావచ్చు )
8) యునైటెడ్ స్టేట్స్ (వీసా లేకుండా186 దేశాలు చుట్టి రావచ్చు )
9) ఎస్టోనియా, లిథువేనియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( వీసా లేకుండా185 దేశాలు చుట్టి రావచ్చు )
10) ఐస్లాండ్, లాట్వియా, స్లోవేకియా, స్లోవేనియా ( వీసా లేకుండా184 దేశాలు చుట్టి రావచ్చు)
హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ చైర్ క్రిస్టియన్ కైలిన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచ సగటు ప్రయాణికులు వీసా-రహితంగా ప్రయాణించే దేశాల సంఖ్య రెట్టింపయింది. 2006లో సగటున వీసా లేకుండా 58 దేశాలకు ప్రయాణం సాగించిన ప్రయాణికులు2024లో 111 దేశాలకు వీసా రహిత ప్రయాణం చేయగలుగుతున్నారు. గ్లోబల్ మొబిలిటీ వల్ల ఇది సాధ్యమైందన్నారు.
గత 19 సంవత్సరాలుగా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ఈ జాబితాను విడుదల చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 227 దేశాల్లోని పాస్‌పోర్ట్‌లను ఇది ట్రాక్ చేస్తోంది. ఆయా దేశాల విధానం.. ఆయా దేశాలకు వస్తోన్న ప్రయాణికులు, దేశాల మధ్య ఉన్న సంబంధం, దేశ పరిస్థితులు, ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశానికి ఉన్న ఆదరణ ఆధారంగా ఈ సంస్థ ర్యాంకింగ్స్ విడుదల చేస్తుంది. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ర్యాంకింగ్స్ మారుస్తూ ఉంటుంది.