కాంటాక్ట్లను గుర్తించడానికి ‘ట్రేస్ టుగెదర్ టోకెన్’ పరికరం
ఇప్పటికే వృద్ధులకు పంపిణీ.. మరింత మందికి ఇచ్చేందుకు రెడీ
బ్లూటూత్, క్యూఆర్ కోడ్లతోనే పనిచేసే డివైస్
ఒక్కసారి చార్జ్ చేస్తే 9 నెలల పాటు వాడుకోవచ్చు
సింగపూర్: కేసులు పెరిగిపోతుండడంతో కరోనా వైరస్ కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం సింగపూర్ సరికొత్త ఉపాయం చేసింది. మన దగ్గర ఆరోగ్యసేతు యాప్లాగానే అక్కడ ఇప్పటికే ట్రేస్ టుగెదర్ అనే యాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తున్నారు. మరి, స్మార్ట్ఫోన్ లేనివాళ్ల పరిస్థితేంటి? అలాంటి వాళ్ల కోసమే ఆ దేశ స్మార్ట్ నేషన్ అండ్ డిజిటల్ గవర్నమెంట్ ఆఫీస్ అధికారులు ఓ డివైస్ను తయారు చేశారు. దానిపేరే ‘ట్రేస్ టుగెదర్ టోకెన్’. ముఖ్యంగా ముసలివాళ్లే లక్ష్యంగా ఈ పరికరాన్ని రూపొందించారు. దీనిని వాడడానికి ఇంటర్నెట్ అవసరమే లేదు. పైగా ఒక్కసారి చార్జ్ చేస్తే 6 నుంచి 9 నెలల పాటు అది పనిచేస్తుందట. ఇప్పటికే చాలా మంది వృద్ధులకు ఆ పరికరాలను అందజేసింది సింగపూర్ గవర్నమెంట్. మరింత మందికి ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎలా పనిచేస్తుంది?
ఈ ట్రేస్ టుగెదర్ టోకెన్ పరికరం క్యూఆర్కోడ్, బ్లూటూత్ సాయంతో పనిచేస్తుంది. ఆ పరికరం ఉన్నవాళ్ల దగ్గరకెళితే మరో యూజర్ పరికరం వెంటనే బ్లూటూత్ సిగ్నల్స్ను పంపుతుంది. స్మార్ట్ఫోన్ యాప్ను వాడుతున్న వాళ్లకూ సిగ్నల్ ఇస్తుంది. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ ఉందని తేలినా, పాజిటివ్ వ్యక్తిని కాంటాక్ట్ అయినా వెంటనే అలర్ట్ చేస్తుంది. పాజిటివ్ అని తేలిన వ్యక్తికి ఆ దేశ ఆరోగ్య శాఖ ట్రేసింగ్ టీమ్ సమాచారం ఇస్తుంది. వాళ్లను వెంటనే ఆస్పత్రిలో చేర్పిస్తుంది. ఆ వ్యక్తి దగ్గరున్న ఆ టోకెన్ను తీసుకుంటుంది. అయితే, దీనిపై ప్రైవసీ అనుమానాలు తలెత్తడంతో గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చింది. ఇది ఇంటర్నెట్తో పనిచేయదు కాబట్టి ఎవరి డేటాకూ ప్రమాదం ఉండదని, చోరీ అయ్యే చాన్స్ లేదని స్పష్టం చేసింది. కేవలం పాజిటివ్ వచ్చిన పేషెంట్ నుంచి మాత్రమే డేటా తీసుకోవడానికి వీలవుతుందని ప్రకటించింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి టోకెన్ నుంచి యూఎస్బీ (పెన్డ్రైవ్ లాంటివి) ద్వారా మాత్రమే డేటా తీసుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. ఆ వ్యక్తి కాంటాక్ట్ అయిన వారి వివరాలను టోకెన్ నుంచి తీసుకుని అలర్ట్ చేస్తామని తెలిపింది. డివైస్లో కేవలం 25 రోజులే ఆ డేటా స్టోర్ అయి ఉంటుందని, ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందని చెప్పింది. ఎవరి ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని హామీ ఇచ్చింది.
For More News..