కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయిపల్లి సర్పంచ్ అధికం మహేశ్వరి భర్త , మాజీ ఎంపీటీసీ నర్సాగౌడ్( 48) మంగళవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వివరాలిలా ఉన్నాయి.. సర్పంచ్ మహేశ్వరి కుటుంబం జిల్లా కేంద్రంలోని ఆశోక్‌నగర్ కాలనీలో ఉంటోంది.
సోమవారం విప్ గంప గోవర్ధన్ ప్రోగ్రామ్‌కు వెళ్లి ఇంటికి వచ్చిన నర్సాగౌడ్ సాయంత్రం 7 గంటలకు బయటకు వెళ్లారు. కొంత సేపటికి ఇంటికి ఫోన్ చేసి తాను వేరే ఊరిలో ఫంక్షన్‌కు వెళ్తున్నానని చెప్పారు. రాత్రి అయినప్పటికీ రాకపోవటంతో కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విచ్ఆఫ్ వచ్చింది.మంగళవారం పొద్దున కుటుంబసభ్యులు నర్సాగౌడ్ కోసం వెతకగా కామారెడ్డి జిల్లా పోలీసు ఆఫీసుకు కొద్ది దూరంలో నిర్మించి వదిలేసిన బిల్డింగ్ వెనుక డెడ్ బాడీ, బైక్ కనిపించాయి.
వెంటనే దేవునిపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సురేశ్, రూరల్ సీఐ శ్రీనివాస్‌గౌడ్, దేవునిపల్లి ఎస్సై సురేశ్ డెడ్‌బాడీని పరిశీలించారు. నర్సాగౌడ్ మృతిపై గ్రామస్థులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ డెడ్‌బాడీతో ఓ వ్యక్తి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.