
నల్ల నేల, మన సింగరేణి బొగ్గు బావుల కార్మికుల కష్టం ఫలించింది. 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ఏడాది ఉత్పత్తి లక్ష్యంలో 96 శాతం అంటే 69.01మిలియన్ టన్నుల ఉత్పత్తిని సింగరేణి సాధించింది. 65.27మిలియన్ టన్నులు అంటే 91 శాతం రవాణా లక్ష్యాన్ని సాధించడం జరిగింది. ఉత్పత్తికి అంతే లెక్కన వినియోగదారులకు బొగ్గు సరఫరా కూడా చేయడం గొప్ప విషయం. 2023-– 24లో రూ3వేల కోట్ల నికర లాభాలు సాధించడం ఆల్ టైం సింగరేణి రికార్డు కాగా, సంస్థ టర్నోవర్ 37 వేల కోట్ల రూపాయలకు చేరే పరిస్థితి వచ్చింది. 135 సంవత్సరాల సింగరేణి చరిత్రలో 2023–-24 ఆర్థిక సంవత్సరం ఒక చారిత్రకమైన రికార్డు సృష్టించింది. సింగరేణి దేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతి ఏడాది ఏడు వేల కోట్లకుపైగా పన్నులు, రాయల్టీ, డివిడెండ్లు, ఇతర సెస్‌లు చెల్లించడమే కాదు, బొగ్గు గనులు ఉన్న జిల్లాలకు డిఎంఎఫ్టీ నిధులు వేల కోట్లలో చెల్లించడం, ఆ నిధులతోనే అభివృద్ధి పనులు జరుగడం చూస్తున్నాం.
1990 దశకంలో సింగరేణి రెండుసార్లు బీఐఎఫ్ఆర్ లోనికి వెళ్లి, ఖాయిలా మార్క్ నుంచి తప్పించుకుని బయటపడిన మొట్ట మొదటి సంస్థగా పేర్కొనవచ్చు.అప్పుడున్న కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుగా సింగరేణికి వెయ్యి కోట్లకుపైగా సహాయం అందచేసింది. అప్పటి కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి ఇందుకోసం, కార్మిక సంఘాల నాయకుల విజ్ఞప్తి మేరకు కృషి చేశారు. సంస్థ అప్పు మీద పది ఏండ్ల మారిటోరియం అనంతరం రూ. 663 కోట్ల వడ్డీని కూడా దఫాల వారిగా సింగరేణి చెల్లించింది.1998 అనంతరం 2000-–01లో మొదటిసారి భారీ నష్టాల నుంచి సింగరేణి లాభాల్లోకి వచ్చింది.
కార్మికులకు వాటా బోనస్!
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హయాంలో సంస్థ మొదటిసారి లాభాల నుంచి 10 శాతం వాటా బోనస్ కార్మికులకు, అధికారులకు ఇచ్చారు. అదే ఇప్పటిదాకా లాభాలను బట్టి వాటా పెంచుకుంటూ ప్రతి ఏటా ఇస్తూ వస్తున్నారు.--- నిజానికి దేశంలో ఎక్కడా కూడా ప్రభుత్వ రంగ సంస్థలో, చివరికి కోల్ ఇండియాలోనూ లాభాల్లో వాటా ఇచ్చే విధానం లేదు! ఒక సింగరేణిలోనే ఉన్నది.
మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలు!
తవ్వి తీసిన దానికన్నా, తీయాల్సిన బొగ్గు 10 వేల మిలియన్ టన్నుల దాకా ఉన్నది. ఇంకో 150 ఏండ్లు తవ్వి తీసినా తరగని రాక్షసి బొగ్గు నిక్షేపాలు గోదావరి తీరంలో ఉన్నాయి. ఇప్పుడు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఆవరణలోనే మరో 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు ప్రారంభించనున్నారు. సోలార్ ప్లాంటులను కూడ విస్తరించే పని, ఐరన్ ఓర్ తదితర రంగంలోనూ సింగరేణి ప్రవేశం కోసం యోచిస్తున్నది. సింగరేణి, ఈ ప్రాంతం ప్రజల గుండెలాంటిది. నిరుద్యోగులకు ఊపిరి లాంటిది. సంస్థను నాలుగు కాలాలపాటు కాపాడుకోవాలి. సింగరేణి సాధించిన 2024-–25 ఆర్థిక సంవత్సరంలో విజయాలు ఎలాంటి ఆటంకం లేకుండా భవిష్యత్తులోనూ సీఎండీ బలరాం లీడర్ షిప్లో కొనసాగాలని, అందుకు తోటి డైరెక్టర్లు, ఏరియాల జిఎంలు, హెడ్లు, అన్నింటికీ మించి కార్మికులు, కార్మిక సంఘాల నేతలు కలిసి ఈ ప్రాంతం ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతారని ఆశిద్దాం.
- ఎండి మునీర్,
సీనియర్ జర్నలిస్ట్