
- జీఎం జి.దేవేందర్
కోల్ బెల్ట్, వెలుగు : ఫిబ్రవరి నెలలో నిర్దేశించిన బొగ్గు లక్ష్యాల్లో మందమర్రి ఏరియాలో 95 శాతం ఉత్పత్తి సాధించిందని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ జి. దేవేందర్ తెలిపారు. శుక్రవారం జీఎం చాంబర్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఫిబ్రవరి నెలకి సాధించిన బొగ్గు ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. ఏరియాలో ఫిబ్రవరి చివరి నాటికి వార్షిక బొగ్గు ఉత్పత్తి 77 శాతం సాధించడం జరిగిందన్నారు. వార్షిక సంవత్సరం ముగింపునకు మరో నెల రోజుల గడవు మిగిలి ఉందన్నారు.
నెల రోజుల్లో 100 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించేలా కార్మికులు, అధికారులు, సూపర్ వైజర్లు కృషి చేయాలని కోరారు. ఏరియాలోని కేకే 5 గని 110 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించగా, కాసిపేట 2 గనిలో 75, కాసిపేట గనిలో 63, శాంతి ఖని లో 28, కేకే ఓసీపిలో 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. ఏరియా లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించడంలో వెనుకబడి ఉన్నామని అయినప్పటికీ బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యం అధిగమించేందుకు మరో నెల రోజుల సమయం ఉందన్నారు.
ఏరియాలోని కేకే 5 గని కార్మికులు 100 శాతం పైగా ఉత్పత్తి సాధించి అత్యధిక ప్రతిభ కనబరిచారని ఈ సందర్బంగా గని కార్మికులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో ఎస్ఓ టు జిఎం విజయ్ ప్రసాద్, డీజీఎం ఐఈడి రాజన్న, సివిల్ ఎస్ఇ రాము, ఇన్చార్జి పర్సనల్ మేనేజర్ మైత్రేయ బందు, డివై పిఎం ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.