నాలుగు బొగ్గు బ్లాకులపై సింగరేణి ఫోకస్..ఎలాగైనా దక్కించుకునేందుకు కసరత్తు

  •     ఇతర రాష్ట్రాల వ్యూహమా? వేలంలో పాల్గొనడమా? 
  •     సాధ్యాసాధ్యాలపై  ఆఫీసర్లతో చర్చిస్తున్న కాంగ్రెస్​ సర్కారు
  •     గతంలో కేంద్రంపై కోపంతో రాష్ట్ర ప్రయోజనాలు గాలికి.. 
  •     కొత్త గనుల ఆవశ్యకతపై ఇప్పటికే సీఎంకు ఎమ్మెల్యే వివేక్ ​విజ్ఞప్తి

కోల్​బెల్ట్, వెలుగు :  రాష్ట్రంలో కేంద్రం వేలానికి పెట్టిన నాలుగు బొగ్గు బ్లాకులను ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి, రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నాయి. ఈ నాలుగు బ్లాకులను చేజిక్కించుకోవడం ద్వారా బొగ్గు ఉత్పత్తి పెంచుకోవడంతోపాటు పెద్దసంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉండడంతో ఆ దిశగా  కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రంలోని కేకే-–6, శ్రావణపల్లి ఓసీపీ, సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3 బొగ్గు బ్లాకులను రెండేండ్ల కిందే కేంద్ర ప్రభుత్వం వేలం జాబితాలో చేర్చింది. పలుమార్లు వీటికి ఓపెన్​ యాక్షన్​ నిర్వహించినా సింగరేణిని వేలంపాటలో పాల్గొనకుండా నాటి బీఆర్ఎస్​ సర్కారు ఒత్తిడి తెచ్చింది. కేంద్రాన్ని ఇరుకునపెట్టే వ్యూహంతో చేసిన ఈ చర్య వల్ల  ఆయా గనులు సింగరేణికి దక్కలేదు. ఫలితంగా కొత్త గనుల తవ్వకం నిలిచిపోయి, యువత ఉపాధికి దూరమైంది. వారం కింద డిప్యూటీ సీఎం, విద్యుత్​శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో జరిగిన సమావేశంలో బొగ్గు బ్లాకులను దక్కించుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై సింగరేణి ఆఫీసర్లు చర్చించడంతో ఈ దిశగా ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. 

నాడు కేంద్రాన్ని బద్నాం చేసేందుకు రాష్ట్ర ప్రయోజనాలు బలి.. 

రెండేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బొగ్గు బ్లాకుల కేటాయింపు విధానంలో భాగంగా సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం జాబితాలో చేర్చారు. వాటిలో మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే-–6, శ్రావణపల్లి ఓసీపీ, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3 బొగ్గు బ్లాకులున్నాయి. వాటిని కేటాయించేందుకు పలుమార్లు కేంద్రం టెండర్లు పిలిచింది. పోటీ కూడా లేకపోవడంతో టెండర్లలో పాల్గొని నామినల్​ రేట్లకు బొగ్గు బ్లాకులను దక్కించుకోవాల్సిన సింగరేణి  అప్పటి బీఆర్ఎస్​ ప్రభుత్వ ఆదేశాలకు తలొగ్గి సైలెంట్​గా ఉండిపోయింది. అప్పట్లో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు బీఆర్ఎస్​ ప్రయత్నించింది. ఈ క్రమంలో టీబీజీకేఎస్​ సహా వివిధ కార్మిక సంఘాలు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా 2021 డిసెంబర్​ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు సమ్మె చేశాయి. వెంటనే కేంద్రం టెండర్ల ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశాయి. కేంద్రాన్ని బద్నాం చేసే క్రమంలో నాటి బీఆర్ఎస్​ సర్కారు బొగ్గు బ్లాకుల కోసం ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదనే ఆరోపణలున్నాయి. ఇందుకు తగ్గట్లే సింగరేణి నుంచి బొగ్గు బ్లాకుల కోసం తమకు ఎలాంటి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా పేర్కొంది. తర్వాత నాలుగు బొగ్గు బ్లాకుల్లో ఒకటైన కోయగూడెం –3 బ్లాకును ఆరో అనే కంపెనీ దక్కించుకుంది. సత్తుపల్లి బ్లాకు–- 3 గనికి కూడా మరో కంపెనీ టెండరు వేసినా కేటాయింపు జరగలేదు. వేలంలో మరో గని పెనగడపను కూడా చేర్చారు. ఈ నాలుగు బ్లాకులను దక్కించుకుంటే సింగరేణికి ఏటా 30.87 కోట్ల టన్నుల బొగ్గు అదనంగా ఉత్పత్తి చేసే  చాన్స్​ ఉంది. తద్వారా  ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పించవచ్చు.

వేలంలో పాల్గొనడంపై త్వరలోనే క్లారిటీ..

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. సింగరేణి బొగ్గు బ్లాకులను దక్కించుకోవడంపై సీరియస్​గా దృష్టిపెట్టింది. చెన్నూర్​ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్​ నేత వివేక్​ వెంకటస్వామి ఈ బ్లాక్​లను సింగరేణి దక్కించుకోవాల్సిన ఆవశ్యకతను ఇప్పటికే సీఎం రేవంత్​రెడ్డికి వివరించారు. ఈ క్రమంలో వారం కింద  డిప్యూటీ సీఎం, విద్యుత్  శాఖ మంత్రి భట్టి విక్రమార్క సింగరేణి ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గు బ్లాకుల వేలం విషయాన్ని ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా గనుల కోసం ఇప్పటికే సంస్థ తరుపున రూ.వందల కోట్లు ఖర్చు పెట్టామని, తీరా వేలం పాటలో ప్రైవేట్​సంస్థలు దక్కించుకుంటే చాలా నష్టపోతామని చెప్పారు. అలా కాకుండా బొగ్గు బ్లాకులను సింగరేణి దక్కించుకుంటే ఏటా100 మిలియన్​టన్నుల ఉత్పత్తి టార్గెట్​ చేరుకోవడం ఈజీ అవుతుందని, కొత్తగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వివరించారు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని బొగ్గు బ్లాకుల విషయమూ చర్చకు వచ్చినట్లు తెలిసింది. గుజరాత్​ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అక్కడి  గనులను కేంద్రం వారికే కేటాయించిందని గుర్తు చేశారు. ఈ క్రమంలో గనులను టెండర్లు లేకుండా నేరుగా తమకే  అప్పగించాలని కేంద్రాన్ని కోరడమా, టెండర్లలో పాల్గొని దక్కించుకోవడమా అన్న విషయంలో కొద్దిరోజుల్లో స్పష్టత రానుందని సింగరేణి ఆఫీసర్లు చెప్తున్నారు.