సింగరేణిలో దళారుల దందా! : సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్

చెమట చుక్కను నమ్ముకుని బొగ్గును బయటకు తీస్తూ ఈ దేశానికి వెలుగునిస్తున్న గని కార్మికుల కష్టం సొమ్ము దోపిడీకి గురి అవుతున్నది. వారి కష్టార్జితం మీద నాయకులు, కొందరు అధికారులు కక్కుర్తి పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రద్దయిన డిపెండెంట్ ఎంప్లాయిమెంట్​ను  స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇందుకోసం చాలా లీగల్ ఇబ్బందులను అధిగమించాల్సి వచ్చింది. రెండేండ్లు మిగులు సర్వీస్ తో దరఖాస్తు చేసుకున్న కార్మికులను మెడికల్ ఇన్వాలిడేషన్ చేసి ఉద్యోగం ఇచ్చుడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమం నేతలకు పంట పండిస్తున్నది. సింగరేణిలోని  సీనియర్ నేతలు కొందరు ప్రతీ మెడికల్ బోర్డులోనూ కోట్లలో వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా పలు యూనియన్ల నేతలు పెద్ద ఎత్తున డబ్బు కూడ బెట్టినట్లు అంచనా. కొందరు అధికారులకూ ఇందులో భాగస్వామ్యం ఉందనే ప్రచారం ఉంది. మెడికల్ ఇన్వాలిడేషన్ అవుతుందో కాదో అనే భయంతో ఉన్న కార్మికుల బలహీనతను సొమ్ము చేసుకోడానికి పైరవీకారులు, దళారులుగా అవతారం ఎత్తిన కొందరు నేతలు పిట్, ఏరియా స్థాయి నుంచి కొత్తగూడెం దాకా కష్టం సొమ్మును దండుకోడానికి రెడీగా ఉంటున్నారు. వీరికి ఇదే పని, ఉద్యోగాలు కూడా సక్రమంగా చేయరు. దాదాపు సింగరేణిలోని అన్ని ఏరియాల్లో యూనియన్ల ముసుగులో దళారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు సైతం ఇదే పనిలో ఉన్నారు.

కార్మికుల బలహీనతలే లక్ష్యంగా..

మెడికల్ బోర్డ్ ఉన్న రోజు దళారులంతా సింగరేణి గెస్ట్ హౌస్ లలో లేదా కొత్తగూడెం హోటల్స్, లాడ్జిల్లో కనిపిస్తారు. మెడికల్ బోర్డులో ఇన్వాలిడేషన్ అయిన వారితో పాటు ఫిట్ అయిన వారి జాబితాను యాజమాన్యం బయట ప్రదర్శించే కంటే గంట రెండు గంటల ముందే వీరికి ఓ నెట్ వర్క్ ద్వారా చేరుతుంది. యాజమాన్యం విధానాలు ఇలాంటి దళారీ వ్యవస్థకు ఊతం ఇస్తున్నాయి. కార్మికుల దగ్గర వసూలు చేస్తున్న డబ్బులను అధికారులకు కూడా ఇస్తున్నట్లు కొందరు నేతలు బహిరంగంగా చెబుతున్నారు. కొందరు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఇన్వాలిడేషన్ చేయిస్తామని కార్మికులతో నమ్మబలుకుతున్న నేతలు10 నుంచి 20 మంది దగ్గర అడ్వాన్సులు తీసుకుంటారు. అందులో ఓ రెండు లేదా మూడు స్టెప్స్ ఉన్నట్లు మైండ్ గేమ్ ఆడుతారు. లక్షల రూపాయలు పుచ్చుకొని బేరం ముగిస్తారు. కార్మికులెవరూ దళారులను, నేతలను ఆశ్రయించ వద్దని పదే పదే బహిరంగంగా ప్రకటిస్తున్నా.. తాము ఇన్వాలిడేట్ అవుతామో కామో అనే భయంతో ఎక్కువ మంది దళారులను ఆశ్రయిస్తూ.. ముడుపులు చెల్లించుకుంటున్నారు. ఇన్వాలిడేషన్ కాకుంటే తమ డిపెండెంట్ పరిస్థితి, కుటుంబ పరిస్థితి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రాకుంటే రోడ్డు మీదకు వచ్చేస్తామనే ఆందోళన వారిలో ఎక్కువ ఉంటున్నది. ఈ బలహీనతే వారిని అప్పోసప్పో చేయించి దళారులను ఆశ్రయించే విధంగా చేస్తున్నది. ఏ కార్మికుడైనా డిపెండెంట్ ఇంటర్వ్యూలో సెలక్షన్ మెడికల్ ఫిట్ లాంటి ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొని, ఒక్కోసారి తదుపరి చెకప్ కు నిమ్స్ కు, ఇతర కార్పొరేట్ ఆసుపత్రులకు పంపితే అక్కడా మధ్యవర్తుల దోపిడీ తప్పడం లేదు. అసలు పైరవీ లేకుంటే పనే కానీ పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. 

సీఎండీని కలిసే పరిస్థితి ఉండాలి

సింగరేణిలో గ్రీవెన్స్ సెల్స్ పూర్తిగా కంటి తుడుపు కార్యక్రమాలుగా మారాయి. కార్మికుల గోడు వినే యూనియన్ నేత లేరు. ఇన్వాలిడేషన్ ల మీదే ఆధారం అనే పరిస్థితి ఉంది. సూపర్ వైజర్లను భూగర్భంలో పనిచేస్తున్న వారిని సర్ఫేస్ పనికి మజ్దూర్ పనులకు పంపడం లాంటి హోదా మార్పులు చేసిన కారణంగా అవమానాలను సైతం కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో సమస్యలు ఇబ్బందులు షరా మాములే. ఇలాంటి విషయాలు మీద యాజమాన్యం మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. పొలిటికల్ లీడర్లకు, ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు లభించిన ప్రాధాన్యత కార్మిక ప్రతినిధులకు, నిజాయితీ పరులైన వ్యక్తులకు లేదు.ఈ విధానం మారాలి. పని, సమస్య ఉన్న కార్మికుడు లేదా సింగరేణి ప్రాంతం సామాన్యుడు సైతం జనరల్ మేనేజర్ నుంచి సింగరేణి సీఎండీని కలిసే పరిస్థితి రావాలి.

- ఎండీ మునీర్,  సీనియర్ జర్నలిస్ట్