గోదావరిఖని/యైటింక్లయిన్ కాలనీ, వెలుగు : సింగరేణి రామగుండం రీజియన్- 2లోని మైన్స్ రెస్క్యూ మెయిన్ స్టేషన్ ఆవరణలో ఈనెల 11న ప్రారంభమైన 52వ ఆల్ ఇండియా మైన్స్ రెస్క్యూ పోటీలు శుక్రవారం ముగిశాయి. నాలుగు రోజుల పాటు రెస్క్యూ స్టేషన్ లో డ్రిల్, కవాతు, క్యాప్టన్ రిపోర్ట్, ఫస్ట్‌ఎయిడ్, రెస్క్యూ రిలే ఈవెంట్, స్టాట్యుటరీ, థియరీ, జీడీకే 7ఎల్ఈపీ అండర్ గ్రౌండ్ మైన్ లో రెస్క్యూ రికవరీ, ఫ్రెష్ ఎయిర్ బేస్ పోటీలు నిర్వహించారు.
ఈ పోటీల్లో వివిధ టీమ్ లు హోరాహోరీగా తలపడ్డాయి. ఓవరాల్ చాంపియన్ గా సింగరేణి బీ టీం, రెండో స్థానంలో వెస్టర్న్ కోల్ లిమిటెడ్, మూడో స్థానంలో సెంట్రల్ కోల్ లిమిటెడ్ నిలిచాయి. విజేతలకు చీఫ్ గెస్ట్ - డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ప్రభాత్ కుమార్ బహుమతులు అందజేసి మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ఆస్తులు, కార్మికుల ప్రాణాల రక్షణలో సింగరేణి రెస్క్యూ సేవలు భేష్ అని కొనియాడారు. బహుమతుల ప్రదానంలో డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ శ్యామ్ మిశ్రా, అధికారులు పాల్గొన్నారు.