
కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్‌సీసీఎల్) 372 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల లోకల్ అభ్యర్థులతోపాటు 67 అన్రిజర్వ్డ్ పోస్టులకు తెలంగాణ అన్ని జిల్లాల వారు పోటీ పడొచ్చు. టెన్త్‌తోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 4లోపు దరఖాస్తు చేసుకోవాలి.
దేశంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన సింగరేణి తొలి విడతలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 372 పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ ఇచ్చింది. మిగిలిన పోస్టులకు దశల వారీగా ప్రకటన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 7 రకాల ఉద్యోగాలకు సంబంధించి 372 పోస్టుల ప్రకటన ఇవ్వగా వీటిలో 305 పోస్టులను సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన లోకల్ అభ్యర్థులకు కేటాయించారు.అన్ రిజర్వుడ్ కేటగిరీ కింద 67 పోస్టులకు తెలంగాణ అన్ని జిల్లాలకు చెందిన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వారీగా అర్హతలు
ఫిట్టర్ ట్రెయినీ: ఫిట్టర్ ట్రెయినీ పోస్టుకు అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఓకేషనల్ ట్రెయినింగ్(ఎన్సీవీటీ) జారీ చేసిన నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి. మొత్తం 128 పోస్టుల్లో 118 రెగ్యులర్ ప్రాతిపదికన 10 పోస్టులను క్యారీ ఫార్వర్డ్ మెథడ్‌లో రిక్రూట్ చేస్తారు.
ఎలక్ట్రీషియన్ ట్రెయినీ: ఎలక్ట్రీషియన్ పోస్టుకు అభ్యర్థి టెన్త్ పాస్‌తోపాటు ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎన్సీవీటీ జారీ చేసిన ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అప్రెంటీస్ సర్టిఫికెట్ కూడా ఉండాలి. మొత్తం 51 ఎలక్ట్రీషియన్ పోస్టుల్లో 42 రెగ్యులర్ ప్రాతిపదికన 9 పోస్టులను క్యారీ ఫార్వర్డ్ మెథడ్‌లో భర్తీ చేస్తారు.
వెల్డర్ ట్రెయినీ: వెల్డర్ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణులవడంతోపాటు వెల్డర్ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఎన్సీవీటీ జారీ చేసిన వెల్డర్ ట్రేడ్ అప్రెంటీస్ సర్టిఫికెట్ కూడా అవసరం. మొత్తం 53 పోస్టుల్లో ఒక పోస్టును క్యారీ ఫార్వర్డ్ మెథడ్‌లో రిక్రూట్ చేస్తారు.
టర్నర్/మెషినిస్ట్ ట్రెయినీ: టెన్త్ పాసై ఉండాలి. రెండేళ్లు ఐటీఐ పూర్తి చేసిన టర్నర్/మెషినిస్ట్ ట్రేడ్‌లో నేషనల్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఏడాది అప్రెంటీస్ శిక్షణ తర్వాత ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణత పొంది ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
మోటార్ మెకానిక్ ట్రెయినీ: ఎస్ఎస్సీ పాసై ఉండాలి. మోటార్ ట్రేడ్ మెకానిక్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఫౌండ్రీ మెన్/మౌల్డర్ ట్రెయినీ: టెన్త్ పాసై ఉండాలి. ఫౌండ్రీ / మౌల్డింగ్ ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసి ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి.
జూనియర్ స్టాఫ్ నర్స్: జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. డిప్లొమాతో ఇంటర్మీడియట్/జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) కోర్సు/ గుర్తింపు పొందిన బోర్డు నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో..
అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 మధ్నాహ్నం 3గంటల నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు అర్హత సర్టిఫికేట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ టైంలోనే అందులో సూచించిన ఎస్‌బీఐ లింకు ద్వారా రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల రిలాక్సేషన్ ఉంటుంది. సింగరేణిలో పనిచేసే ఇంటర్నల్ అభ్యర్థులకు వయో పరిమితి నిబంధన వర్తించదు. పరీక్ష ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు.
నాలుగు జిల్లాలు లోకల్
సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు లోకల్ జిల్లాలుగా మిగిలినవి నాన్‌లోకల్ జిల్లాలుగా పరిగణిస్తారు. 80 శాతం పోస్టులను లోకల్ అభ్యర్థులకు, 20 శాతం పోస్టులను నాన్‌లోకల్/అన్ రిజర్వ్డ్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. ఈ మేరకు అభ్యర్థులు అప్లికేషన్ సమయంలోనే లోకల్ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటో తరగతి నుంచి 7 వరకు ఎక్కడ చదివితే ఆ జిల్లానే అభ్యర్థి లోకల్ జిల్లాగా తీసుకుంటారు.
వేతనం: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్/మెషినిస్ట్, మోటార్ మెకానిక్, ఫౌండ్రీ/మౌల్డర్ ట్రెయినీ ఈ అయిదు పోస్టులకు వేతనం రోజుకు రూ. 1011.27, జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టుకు నెలకు రూ.29,460 శాలరీ ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్
నోటిఫికేషన్లో ప్రకటించిన అన్ని పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ఆయా పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్ట్/ట్రేడ్ నుంచి 25 నుంచి 30 శాతం ప్రశ్నలు ఉంటాయి. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, అర్థమెటిక్/జనరల్ మ్యాథ్స్, తెలంగాణ కల్చర్, కరెంట్ ఎఫైర్స్, జీకే, జనరల్ ఇంగ్లిష్ నుంచి ప్రశ్నలు వచ్చే చాన్స్ ఉంది. నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ రిటన్ టెస్ట్‌లో జనరల్ అభ్యర్థులు 30 శాతం, బీసీలు 25 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 15 శాతం క్వాలిఫైయింగ్ మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే రిటెన్ టెస్ట్ ప్యాటర్న్, సిలబస్ అఫీషియల్‌గా వెల్లడించాల్సి ఉంది.
అప్లికేషన్ ఫీజు: రూ.200
దరఖాస్తులు ప్రారంభం: 22 జనవరి 2021
చివరి తేది: 4 ఫిబ్రవరి 2021
వెబ్సైట్: https://scclmines.com/scclnew/careers.asp