- ముమ్మరంగా ఆశావహుల ప్రయత్నాలు
- బీఆర్ఎస్ నేతలు, టీబీజీకేఎస్ స్టేట్ లీడర్లతో మంతనాలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంవో) పోస్టుకు జోరుగా పైరవీలు చేస్తున్నారు. ప్రస్తుత సీఎంవో వెంకటేశ్వరరావు ఈ నెలాఖరున రిటైర్‌కానున్నారు. కోల్బెల్ట్వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కార్మికులకు వైద్య సేవలందించే హాస్పిటళ్లలో సీఎంవో పోస్టు కీలకమైనది. కారుణ్య నియామకాల్లో భాగంగా చేపడ్తున్న మెడికల్ బోర్డులో కార్మికులను అన్ ఫిట్ చేయడంలో దళారులు వారి నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పలు సందర్భాల్లో ఈ వసూళ్లపై గతంలో సీఎంవోలుగా పనిచేసిన కొందరి పేర్లు బయటకు వచ్చిన దాఖలాలున్నాయి. దీంతో సీఎంవో పోస్టుకు భారీగా డిమాండ్ పెరిగింది. సింగరేణి హాస్పిటళ్లలో పనిచేస్తున్న ఏసీఎంలలో సీనియార్టీ ప్రకారం సీఎంవో పోస్టును భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ కొంత కాలంగా సీనియార్టీని పక్కన పెట్టి సీఎంవో పోస్టును భర్తీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇదిలా ఉండగా సింగరేణి విభాగంపై పట్టున్న బీఆర్ఎస్ ముఖ్య లీడర్, ఎమ్మెల్సీతో పాటు టీబీజీకేఎస్ ముఖ్య నేతలతో సీఎంవో పోస్టును ఆశించే ఆశావాహులు తమకున్న స్థాయిలో జోరుగా పైరవీలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
సీనియార్టీని పక్కన పెట్టి
సింగరేణి పరిధిలో 7 ఏరియా హాస్పిటల్స్, 29 డిస్పెన్సరీలున్నాయి. కామన్‌గా సీఎంవో పోస్టులో సీనియార్టీకి మేనేజ్మెంట్ ప్రాధాన్యం ఇస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో సీనియార్టీతో పాటు ఆశావాహులపై వచ్చిన ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటుంది. వీటిని పక్కనపెట్టి పైరవీలతో నియమితులైన వారూ ఉన్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాల్లో భాగంగా చేపట్టే మెడికల్ బోర్డు ఇంటర్వ్యూల్లో సీఎంవో కీలక పాత్ర పోషిస్తారు. మెడికల్ బోర్డు ద్వారానే కార్మికులను అన్‌ఫిట్ చేస్తారు.
అన్‌ఫిట్ అయితేనే కార్మికుల వారసుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇప్పటికే అన్ ఫిట్ పేరుతో పెద్ద ఎత్తున దందా సాగుతుందనే ప్రచారం సింగరేణిలో ఉంది. ఒక్కో కార్మికున్ని అన్ ఫిట్ చేయిస్తే దాదాపు రూ. 5 నుంచి రూ. 7లక్షల వరకు దళారులు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఈ దందాకు సంబంధించి గతంలో పలువురిని కొత్తగూడెంలో పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ బోర్డులో వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే గతంలో సీఎంవోగా పనిచేసిన ఓ డాక్టర్‌ను ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలున్నాయి.
అంతకు ముందు సీఎంవోగా పనిచేసిన డాక్టర్ పెద్ద ఎత్తున దండుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్లిపోయారు. గతంలో సీఎంవోగా పనిచేసిన మంథా శ్రీనివాస్‌తో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న సీఎంవో వెంకటేశ్వరరావును సీనియార్టీ పక్కన పెట్టి మేనేజ్మెంట్ నియమించిందని పలు కార్మిక సంఘాల నేతలు అప్పట్లో ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీఎంవో పోస్టును ఆశిస్తున్న వారిలో ఏసీఎంలు సుజాత, విక్టర్ వందనం, కిరణ్రాజశేఖర్తో పాటు పద్మజ ఉన్నారు.
అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటాం
కొత్త సీఎంవో నియామకంలో సీనియార్టీతో పాటు సిన్సియార్టీ, పనిలో నిబద్ధత వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. పైరవీలకు చోటు ఉండదు. పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తాం.
- ఎన్. బలరాం, డైరెక్టర్ , సింగరేణి కాలరీస్