- 18 వేలకు పైగా మొక్కలు నాటిన బలరాం
- 6 జిల్లాల్లో 35 చిట్టడవులను సృష్టించినందుకు గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సీఎండీ ఎన్.బలరాంను ప్రతిష్టాత్మక ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ అవార్డు వరించింది. గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేశారు. సింగరేణిని పర్యావరణహిత సంస్థగా మార్చడమే కాకుండా అందరిలోనూ పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు బలరాం 18 వేలకు పైగా మొక్కలు నాటారు. రాష్ట్రంలోని 6 జిల్లాల్లో 35 చిట్టడవులను సృష్టించారు. ఇందుకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును అందించారు. దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ ఏటా ఈ అవార్డులు అందిస్తున్నది.
ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్న తమ సంస్థ నిబంధనల ప్రకారం పచ్చదనాన్ని కాపాడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా 6 కోట్లకు పైగా మొక్కలు నాటామని చెప్పారు. సంస్థ చేస్తున్న పర్యావరణహిత చర్యలకు ఇప్పటికే కార్బన్ న్యూట్రాలిటీ కంపెనీగా సీఎంపీడీఐ గుర్తించిందని తెలిపారు. ప్రతి అడుగు పచ్చదనం నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞాన్ని కొనసాగిస్తున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటుతున్నామన్నారు. కంపెనీలో ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటుతామని చెప్పారు. విద్యార్థుల్లో పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు వీలుగా సింగరేణి పాఠశాలల్లో పర్యావరణ సిలబస్ ను బోధిస్తున్నామని, ప్రతి క్లాస్ లోనూ గ్రీన్ కెప్టెన్లను నియమించి పర్యావరణ రక్షణపై విద్యార్థుల్లో అవగాహన కలిగిస్తున్నామని బలరాం వెల్లడించారు.