బొగ్గు ఉత్పత్తి ఖర్చు తగ్గినప్పుడే మరింత సంక్షేమం సాధ్యం : సింగరేణి సీఎండీ బలరామ్

బొగ్గు ఉత్పత్తి ఖర్చు తగ్గినప్పుడే  మరింత సంక్షేమం సాధ్యం : సింగరేణి సీఎండీ బలరామ్
  • 38వ నిర్మాణాత్మక సమావేశంలో సింగరేణి సీఎండీ బలరామ్
  • సంస్థ సుస్థిర భవిష్యత్ కోసం సంపూర్ణ సహకారం
  • గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూనంనేని

హైదరాబాద్, వెలుగు: పోటీ మార్కెట్​లో నిలదొక్కుకోవాలంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గాల్సిన అవసరం ఉందని సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. అలాంటప్పుడే అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపు కొత్త పథకాలకు అవకాశం ఉంటుందన్నారు. శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్​తో 38వ నిర్మాణాత్మక సమావేశం జరిగింది. 

సింగరేణి బొగ్గు అమ్మకం ధరలు కోల్ ఇండియా ధర, విదేశీ బొగ్గు ధరతో పోల్చితే ఎక్కువగా ఉంటున్నాయని, దీంతో డిమాండ్ తగ్గుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే ఉద్యోగులు పూర్తి పని గంటలు యంత్రాలను వినియోగిస్తూ పనిచేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా థర్మల్ నుంచి సోలార్ విద్యుత్తు, ఇతర గ్రీన్ ఎనర్జీ విధానాల వైపు అడుగులు పడుతున్నాయని.. సంస్థ మనుగడ కోసం సోలార్ విద్యుత్తు, కీలక ఖనిజాల ఉత్పత్తి వంటి వ్యాపార విస్తరణ చర్యలను చేపట్టాల్సి వస్తోందన్నారు. కార్మిక సంఘాలు కంపెనీ ఆర్థిక స్థితిగతులు అర్థం చేసుకొని కార్మికుల్ని చైతన్య పరచాలని. కంపెనీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.

సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించండి

సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సమావేశంలో మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధిలో కార్మికులు కీలకపాత్ర పోషిస్తుంటారని, కంపెనీ అభివృద్ధితోపాటు సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తే సంస్థకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సంస్థను అగ్రస్థానంలో నిలపడానికి కార్మికులు తమ వంతు కృషి చేస్తారన్నారు. కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని రూపొందించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని కోరారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

సమస్యలపై సానుకూలంగా..

సమస్యలు పరిష్కరిస్తామని, ఆర్థిక పరమైన సమస్యలపై కమిటీలు వేసి చర్యలు తీసుకుంటామని సీఎండీ అన్నారు. హైదరాబాద్ లో సింగరేణి తరఫున సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే కూనంనేని ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించారు. కార్మికులకు సొంత ఇంటి పథకం సాధ్యాసాధ్యాలపై   ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీఎండీ బలరామ్ ఎంతో సాదాసీదాగా కార్మికులతో కలిసిపోయి సమస్యలు తెలుసుకోవడంపై యూనియన్ నాయకులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో గుర్తింపు సంఘం జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, వివిధ ఏరియాల గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.