వర్షాల వల్ల టార్గెట్ ​చేరుకోలే : సింగరేణి సీఎండీ బలరామ్

వర్షాల వల్ల టార్గెట్ ​చేరుకోలే : సింగరేణి సీఎండీ బలరామ్
  • ఇకపై రోజుకు 2.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలి
  • జీఎంలకు సింగరేణి సీఎండీ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: భారీ వర్షాల వల్ల ఈ ఏడాది టార్గెట్​ 72 మిలియన్  టన్నుల ఉత్పత్తి లక్ష్యంపై కొంత ప్రభావం పడిందని సింగరేణి సీఎండీ బలరామ్  తెలిపారు. ఈ లోటును అధిగమించడానికి ఇకపై రోజుకు 2.4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగేలా చూడాలని   అధికారులను ఆయన ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్  సింగరేణి భవన్  నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో  అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఉత్పత్తి పై బలరామ్  ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

సీఎండీ మాట్లాడుతూ వర్షాల ప్రభావంతో ప్రొడక్షన్​ టార్గెట్​లో 10 శాతం వెనుకబడ్డామని, దీన్ని పూడ్చుకోవడంతో పాటు నెలవారి టార్గెట్​ సాధించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. పలు ఏరియాలు టార్గెట్​  సాధనలో వెనకబడడంపై సీఎండీ అసంతృప్తిని వ్యక్తంచేశారు. రానున్న 165 రోజులు  కీలకమని, రోజుకు 17.5 లక్షల క్యూబిక్  మీటర్ల ఓవర్ బర్డెన్  తొలగించేలా ప్లాన్​ చేయాలన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం, టైమింగ్స్​ పాటించకపోవడం, గైర్హాజరు కావడం వంటి అంశాలు​తన దృష్టికి వచ్చాయని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలా కాలంగా డ్యూటీకి రానివారిని విధుల నుంచి తొలగించడానికి వెనకాడబోమన్నారు. గైర్హాజరీ వల్ల ఇతర ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, ఉత్పత్తిపైనా ప్రభావం చూపుతోందన్నారు. కొత్తగా రిక్రూట్​ అయిన  ఉద్యోగులందరినీ విధిగా ఐదేళ్ల పాటు అండర్​ గ్రౌండ్​ మైన్స్​లో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎండీ సూచించారు.