రోజుకు 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలి: సింగరేణి సీఎండీ బలరాం

రోజుకు 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలి: సింగరేణి సీఎండీ బలరాం
  • అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి సీఎండీ బలరాం సూచన

హైదరాబాద్,  వెలుగు: వచ్చే మార్చి 31 వరకు రోజుకు 2.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని  జీఎంలకు సింగరేణి సీఎండీ ఎన్.బలరాం సూచించారు. శనివారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి ఆయన అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం ముగియటానికి ఇంకా 108 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ సమయాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తూ రోజు బొగ్గు ఉత్పత్తి చేసి రవాణా నిర్వహించాలన్నారు.

ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. టార్గెట్​ మేరకు ఉత్పత్తి సాధిస్తున్న గనులను, ఏరియాలను అభినందిస్తూ, వెనుకబడి ఉన్న ఏరియాలు ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు.బొగ్గు రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా, ఎప్పటికప్పుడు రైల్వే అధికారులతో సంప్రదిస్తూ సకాలంలో బొగ్గు సరఫరా చేయాలని సూచించారు.

విద్యుత్తు వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు డి.సత్యనారాయణ రావు జి.వెంకటేశ్వర్ రెడ్డి, సుభాని, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ రవిప్రసాద్ తదితరులు  పాల్గొన్నారు.