- 2030 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి ప్లాన్
- సింగరేణి సీఎండీ బలరాం
- కొత్తగూడెంలో ఘనంగా సింగరేణి డే వేడుకలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి ఆధ్వర్యంలో మూడు వేల మెగావాట్ల కెపాసిటీ గల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం చెప్పారు. సోమవారం సింగరేణి డే సందర్భంగా కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలను ఆయన ప్రారంభించారు. సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పలు డిపార్ట్‌మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారంభించారు. అంతకుముందు 2కే రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుతం ఏడాదికి రూ. 700 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నామని, దీనిని పూర్తిగా తగ్గించుకోవాలన్న ఆలోచనతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సింగరేణికి అవసరమైన మొత్తం విద్యుత్‌ను సోలార్ ప్లాంట్ ద్వారానే సమకూర్చునేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇప్పటికే 245 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసామని, కొత్తగా 540 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. సింగరేణి ఆధ్వర్యలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను సైతం ఏర్పాటు చేయనున్నామన్నారు. నీటి ప్రాజెక్టులలో ఫ్లోటింగ్, ఖాళీ స్థలాలతో పాటు ఓబీ డంపులతో పాటు, ఇతర రాష్ట్రాల్లోనూ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
మణుగూరు ఏరియా పగిడేరులో ప్రయోగాత్మకంగా చేపట్టిన జియోథర్మల్ ప్లాంట్ ఏర్పాటుపై రీసెర్చ్ చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో లాభాల్లో కార్మికులకు 33 శాతం, కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5 వేలు బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. కార్మికులకు రూ. కోటి, కాంట్రాక్ట్ వర్కర్లకు రూ. 30 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ ద్వారా ఏడాదికి కోటి టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపారు. 2030 నాటికి వంద మిలియన్ టన్నుల కోల్ ప్రొడక్షన్ టార్గెట్‌గా పనిచేస్తున్నామని చెప్పారు.
సేఫ్టీ, క్వాలిటీతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు జి.వెంకటేశ్వరరెడ్డి, డి.సత్యనారాయణ, జీఎంలు సుభాని, కె. శ్రీనివాస్, కవితానాయుడు, మనోహార్, సుబ్బారావు, సీహెచ్.లక్ష్మీనారాయణ, దామోదర్‌రావు, జానకిరాం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.