
మణుగూరు, వెలుగు: బొగ్గు ఉత్పత్తిలో వర్కింగ్ అవర్స్ పెంచి.. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని సింగరేణి సీఎండీ ఎన్ బలరాం నాయక్ స్పష్టం చేశారు. సోమవారం భద్రాద్రి జిల్లా మణుగూరు సింగరేణి మైన్స్ లో ఆయన పర్యటించారు. పీకే ఓసీ–2లో కొత్తగా నిర్మించిన సైట్ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం ప్రైవేట్ సంస్థలు, కోల్ ఇండియా నుంచి సింగరేణికి పోటీ ఎదురవుతుందని, దీన్ని తట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బొగ్గు బ్లాక్ లను పొందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, కొత్తగూడెం వీకే మైన్, ఇల్లందులోని రొంపేడు ఓసీ, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీని కొత్తగా ప్రారంభించుకుని అధిక ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు.
ఇప్పటికే సింగరేణిలో 245.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు, దీనిని 1000 మెగావాట్లకు పెంచేదిశగా కృషి చేస్తున్నామన్నారు. రాజస్థాన్ లో థర్మల్, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. మణుగూరు ఏరియా 2024- –-25 వార్షిక బొగ్గు ఉత్పత్తిలో లక్ష్యాన్ని అధిగమించి 127 లక్షల టన్నుల ప్రొడక్షన్ ను సాధించడం గర్వంగా ఉందని, ఏరియా కార్మికులను, సూపర్వైజర్లను, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
2025–26 సంవత్సరానికి 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్ గా నిర్ణయించామని తెలిపారు. అందుకు కార్మికులు రోజుకు 8 గంటలు మస్ట్ గా పనిచేయడంతో పాటు ఓపెన్ కాస్ట్ మైన్స్ లో కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన భారీ మెషీన్లను రోజుకు 22 గంటలు వినియోగించేలా చూడాలని కోరారు. అనంతరం సింగరేణి పాఠశాలను సందర్శించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులతో సెల్ఫీ దిగారు. మణుగూరు ఏరియా జీఎం దుర్గం రామచందర్, జీఎం ఎంఎస్ సురేశ్, శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ కేవీ రావు, ఏజీఎం కార్పొరేట్ రవి, సివిల్ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్స్ లక్ష్మీపతి గౌడ్, వీరభద్రరావు, శ్రీనివాసచారి, డీజీఎం రమేశ్ , అధికారులు, యూనియన్ లీడర్లు ఉన్నారు.