
- డ్యూటీల్లో కార్మికులు రక్షణ మరవొద్దు
- సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్సూచన
కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: సింగరేణికి రక్షణ, ఉత్పత్తి రెండు కళ్లని, మరోవైపు ఉత్పత్తి పెంపుతో పాటు విద్యుత్ డిమాండ్ మేరకు బొగ్గు సప్లై ఉండాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాంనాయక్ తెలిపారు. గురువారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓసీపీ, ఇందారం –1ఏ అండర్‌గ్రౌండ్ మైన్‌ను సంస్థ డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన సందర్శించారు.
ఉద్యోగులు, కార్మికులకు కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 70 మిలియన్ టన్నుల బొగ్గు టార్గెట్చేరుకోవాలంటే ఉత్పత్తిని పెంచాలని, డ్యూటీల్లో కార్మికులు రక్షణ మరవద్దని పేర్కొన్నారు.
బొగ్గు నాణ్యతకు ప్రయారిటీ ఇవ్వాలని, మెషీన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు దృష్టి పెట్టాలని సూచించారు. మస్టర్ పడి బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గైర్హాజరీ చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగుల శక్తిని సద్వినియోగం చేసుకుంటామని, అన్ని కేటగిరీల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
జైపూర్పవర్ప్లాంట్లో పీఎల్ఎఫ్, పనితీరు బాగుందని చెప్పారు. అనంతరం జైపూర్‌లోని సింగరేణి థర్మల్పవర్ప్లాంట్(ఎస్టీపీపీ)లో కొత్తగా నిర్మించి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆయన వెంట బెల్లంపల్లి జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్టీపీపీ ఇన్చార్జ్ ఈడీ కె.శ్రీనివాసులు, శ్రీరాంపూర్ ఇన్చార్జ్ జీఎం టి.శ్రీనివాస్, ఏఐటీయూసీ జనరల్సెక్రటరీ రాజ్‌కుమార్, ఓసీపీల పీవోలు వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్ ఉన్నారు.
మస్టర్ పడి బయట తిరిగితే చర్యలు
గోదావరిఖని: సింగరేణిలో మస్టర్(అటెండెన్స్) పడి బయట తిరిగితే ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటామని సీఎండీ ఎన్.బలరామ్‌నాయక్ హెచ్చరించారు. గురువారం రామగుండం రీజియన్ పరిధి జీడీకే11వ గని, ఓసీపీ 3, ఓసీపీ 5 ప్రాజెక్ట్‌ల వద్ద కార్మికులు, ఉద్యోగులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు.
ఒకప్పుడు సింగరేణి మాత్రమే బొగ్గు వెలికితీసేదని, కానీ నేడు చాలా ప్రైవేటు సంస్థలు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయని, కాంపిటీషన్ ఎక్కువైందని, దీంతో నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని సూచించారు. అనంతరం గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మారుపేర్ల డిపెండెంట్బాధితులు న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చారు.